Gudihathnoor: బడుల బాటలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి బస్సు యాత్ర!

Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి బృందం బస్సు యాత్ర. గుడిహత్నూర్‌లో ఘన స్వాగతం.. బడ్జెట్‌లో విద్యకు 18 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్.

NAGULA SATISH, BOATH
Published on: 19 Sept 2026 11:03 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: బడుల బాటలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి బస్సు యాత్ర!

గుడిహత్నూర్: ​ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం, క్షేత్రస్థాయి సమస్యల అధ్యయనం లక్ష్యంగా తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (టీపీఎఫ్) ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన ప్రత్యేక బస్సు యాత్ర శనివారం ఇచ్చోడ మీదుగా గుడిహత్నూర్ కు చేరుకుంది,

ఈ పర్యటనలో ఆకునూరి మురళితో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారులు డాక్టర్ ఎంవీ రెడ్డి, ఎం. చంపాలాల్, ప్రొఫెసర్ పద్మజ, ప్రతినిధులు ఎన్. రుబీనా, టి. నిర్మల, పి. అశోక్ కుమార్, ఎం. కుమార్, నిఖిల్ విజయ్ కృష్ణ, సృజన యాదవ్ బస్సులోనే ప్రయాణిస్తూ పాఠశాలలను సందర్శించారు. షెడ్యూల్‌లో భాగంగా ఇచ్చోడ మండలంలోని ఎంపీపీఎస్ జామిడి పాఠశాలను, గుడిహత్నూర్ మండలం సీతాగొండి సమీపంలోని సోమరపేట టీడబ్ల్యూపీఎస్ పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు, విద్యాబోధనపై ఆరా తీశారు.

అనంతరం రాత్రి బస కోసం గుడిహత్నూర్ మండలంలోని గర్కంపేట గ్రామానికి చేరుకోగా, అంతకు ముందు గుడిహత్నూర్ బస్టాండ్ సమీపంలో ఆకునూరి మురళికి ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అస్పైర్ ఇండియా జార్ఖండ్, ఒడిశా కోఆర్డినేటర్ గాంతుల నరేష్, గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకతి రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్, జర్నలిస్టులు సత్యనారాయణ, నాగుల సతీష్, గ్రామ యువకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను తక్షణమే బలోపేతం చేయాలని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని వెంటనే ఆమోదించి పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాల్లో తగిన సంఖ్యలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు. కాగా, ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్ లో విద్యారంగ సమస్యలు, పరిష్కారాలపై సమగ్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు బృందం తెలిపింది.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH