Adilabad: డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసం.. ఐదుగురు నిందితుల అరెస్ట్!

Adilabad: మంత్రతంత్రాలు, పూజలతో డబ్బులు రెట్టింపు చేస్తామని మోసం చేస్తున్న ఐదుగురిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేసి రూ.3.74 లక్షలు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 23 Nov 2026 1:32 PM IST
Adilabad
X

Adilabad: డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసం.. ఐదుగురు నిందితుల అరెస్ట్!

Adilabad: మంత్రగాళ్ల ముఠా అరెస్ట్- ఎస్పీ అఖిల్ .. మంత్రతంత్రాలు, పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు అదిలాబాద్ జిల్లా పోలీసులు మంత్రాల నేపంతో మోసం చేస్తున్న ఐదుగురు నిందితులు అరెస్టు,

ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు మాయమాటలతో అమాయక ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు జిల్లావ్యాప్తంగా ఇచ్చోడ, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలలో నిందితులపై 8 కేసులు నమోదు రాష్ట్రవ్యాప్తంగా 24 మందిని మోసం చేసినట్లు వెల్లడి కేసుల నమోదు చేశారు పోలీసులు.

నిందితుల వద్ద నుండి రూ 3.74 లక్షల నగదు, మూడు కార్లు, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం..మంత్రతంత్రాలు, పూజల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి, వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇచ్చోడ పోలీసులు గుర్తించి ఐదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని,అదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ కేసు వివరాలను వెల్లడించారు.

ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-44 సమీపంలో TGWRJC పాఠశాల వద్ద గల అండర్ బ్రిడ్జి పక్కన ఈ నెల 19వ తేదీ సాయంత్రం నిందితులు ఫిర్యాదుదారుడిని మంత్రతంత్రాలు, పూజల ద్వారా డబ్బులు రెట్టింపు చేసి ఇస్తామని నమ్మించి రూ.3 లక్షలు బలవంతంగా లాక్కొని మోసానికి పాల్పడ్డారు.

ఫిర్యాదుదారుడు తోకల రాజు తన పరిచయస్తుడైన శ్రీపతి శంకర్‌తో కలిసి వారం రోజుల క్రితం పని నిమిత్తం ఆదిలాబాద్‌కు వచ్చిన సమయంలో ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద మండలి నిందితులైన బక్కన్న, ఆత్రం పరశురాం, నౌగాడే శేకర్, మండలి శైలేష్ అనే నలుగురు వ్యక్తులు పరిచయమయ్యారు. తమకు మంత్రతంత్రాలు తెలుసునని, ఒక రూపాయి నోటును పూజల ద్వారా పది రూపాయలుగా మార్చగలమని నమ్మబలికారు.

ఈ క్రమంలో శ్రీపతి శంకర్ ఫోన్ నంబర్ తీసుకున్నారు.అనంతరం ఈ నెల 19వ తేదీన బక్కన్న ఫోన్ చేసి, తాము వస్తున్నామని, మీ వద్ద ఎంత డబ్బు ఉన్నా తీసుకొని రావాలని సూచించాడు. అదే రోజు సాయంత్రం మరోసారి ఫోన్ చేసి ఇచ్చోడకు చేరుకున్నామని, NH-44 పక్కన TGWRJC పాఠశాల వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి దగ్గరకు రావాలని తెలిపాడు.

దీంతో డబ్బులు రెట్టింపు అవుతాయనే ఆశతో ఫిర్యాదుదారుడు తోకల రాజు, శ్రీపతి శంకర్‌తో కలిసి రూ.3 లక్షల నగదుతో వారు సూచించిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బక్కన్న, శేకర్ ఉండగా, శేకర్ డబ్బులు చూపించాలని అడిగాడు. ఫిర్యాదుదారుడు నగదు చూపిస్తున్న సమయంలో బక్కన్న, శేకర్ ఇద్దరూ కలిసి బలవంతంగా రూ.3 లక్షలు లాక్కొని, ఫిర్యాదుదారుడితో పాటు శ్రీపతి శంకర్‌పై దాడి చేశారు.

అనంతరం మిగతా నిందితులతో కలిసి కారులో అక్కడి నుంచి పారిపోయారు. నిందితులు పారిపోతున్న సమయంలో ఫిర్యాదుదారుడు ఒక నిందితుడి ఫొటోను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు.మరుసటి రోజు బాధితులు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన ఆత్రం పరశురాం గతంలో కూడా ఇదే తరహాలో మంత్రతంత్రాలు, పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. అమాయక ప్రజలకు తనకు మంత్రశక్తులు ఉన్నాయని, వారు ఇచ్చిన డబ్బులను పూజల ద్వారా రెండింతలు లేదా నాలుగు రెట్లు చేసి ఇస్తానని నమ్మించేవాడు.

ఈ క్రమంలో బక్కన్నతో పరిచయం ఏర్పడగా, ఇద్దరూ కలిసి ఇలాంటి మోసాలు చేయాలని పథకం రూపొందించుకున్నారు. అనంతరం బక్కన్న బంధువులైన శేకర్, శైలేష్‌లను కూడా తమ ముఠాలో చేర్చుకున్నారు. ఈ నలుగురు కలిసి అమాయక ప్రజలను గుర్తించి, వారికి అధిక మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశ చూపించి మోసాలకు పాల్పడేవారు.

బాధితులను నమ్మించేందుకు ముందుగా పూజలు చేస్తామని చెప్పి, వారు తీసుకువచ్చిన నగదు బ్యాగులను తెల్ల కాగితాలు లేదా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ నోట్లతో నింపిన బ్యాగులతో మార్చేవారు. అనంతరం ఐదు నుంచి పది రోజుల వరకు బ్యాగులు తెరవకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. బాధితులు తిరిగి ప్రశ్నించినప్పుడు పూజ విఫలమైందని, మరోసారి పూజలు చేయాలని, మరింత డబ్బులు తీసుకురావాలని చెప్పి మళ్లీ మోసం చేసేవారు.

ఈ విధంగా మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులను మోసం చేసినట్లు ప్రధాన నిందితుడు విచారణలో వెల్లడించాడు. బాధితుల నుంచి తీసుకున్న డబ్బులను నలుగురు సభ్యులు సమానంగా పంచుకొని, సొంత అవసరాలు, కారు ఈఎంఐలు, ఇంటి నిర్మాణం వంటి వాటికి వినియోగించినట్లు తెలిపాడు.

నిందితుల వివరాలు:

ఆత్రం పరశురాం (40) s/o పైకు, గిన్నెర గ్రామం, ఇంద్రవెల్లి మండలం.

మండలి బక్కన్న (47) s/o ఇంద్రయ్య, శాంతినగర్ కాలనీ, ఇంద్రవెల్లి గ్రామం మరియు మండలం.

నౌగడే శేఖర్ (39) s/o యాదవ్, అర్జుగూడ కాలనీ, వాంకిడి గ్రామం మరియు మండలం, ఆసిఫాబాద్ జిల్లా.

మండలి శైలేష్ (27) s/o వెంకటేష్, బస్టాండ్ ప్రాంతం, కెరమెరి గ్రామం మరియు మండలం, ఆసిఫాబాద్ జిల్లా.

షేక్ అలీం (36) s/o షేక్ జమాల్, బజార్ మేలా కాలనీ, సిర్పూర్ (యు) గ్రామం మరియు మండలం, ఆసిఫాబాద్ జిల్లా.

నిందితులను ఈరోజు అరెస్టు అరెస్ట్ చేయడం జరిగిందని వీరి వద్ద నుండి రూ 3,74,000/- నగదు, మూడు కార్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. విచారణలో భాగంగా నిందితులపై ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు (Cr. No. 331, 333), ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు (Cr. No. 212, 213, 215, 216, 217), ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.

ఈ కేసుల్లో మొత్తం 10 మంది బాధితులు ఉన్నట్లు విచారణలో గుర్తించామని, రాష్ట్రవ్యాప్తంగా ఈ ముఠా చేతిలో మోసపోయిన వారు 24 మంది ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.

ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేష్, గుడిహత్నూర్ ఎస్ఐ ఎల్. శ్రీకాంత్, ఇచ్చోడ ఎస్ఐ కె. విష్ణు ప్రకాష్ తదితరులు దర్యాప్తులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మంత్రతంత్రాలు, పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బులను కోల్పోవద్దని, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపిఎస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై విష్ణు ప్రకాష్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.