Bajarhatnoor: శిశువును కోల్పోయిన కుటుంబానికి రూ.5 లక్షల సాయం
Bajarhatnoor: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఘటనలో నవజాత శిశువును కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
Bajarhatnoor: శిశువును కోల్పోయిన కుటుంబానికి రూ.5 లక్షల సాయం
బజార్హత్నూర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో నవజాత శిశువును కోల్పోయిన బజార్హత్నూర్ మండలం శ్యాంరావుగూడ గ్రామానికి చెందిన ఏర్మ నాగుబాయి, ఇష్రూ దంపతుల కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, స్థానిక తహసీల్దార్‌తో కలిసి బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కడుపుకోత మిగిల్చిన ఈ దుర్ఘటన అత్యంత విచారకరమని, ప్రజా పాలనలో ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సీడం మాన్కు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లాండే నాగనాథ్ అప్పా, జల్క పాండురంగ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆడే జైపాల్, ప్రధాన కార్యదర్శి కాగ్నే రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.




