Nirmal: 22A నిషేధిత జాబితాతో నలిగిపోతున్న నిర్మల్ జిల్లా రైతులు!

Nirmal: తెలంగాణలో 'భూభారతి' వచ్చినా తీరని రైతుల భూ సమస్యలు. 22A నిషేధిత జాబితా వల్ల పట్టా భూములపై హక్కులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిర్మల్ జిల్లా రైతాంగం.

RAKESH N, KHANAPUR
Published on: 14 Oct 2026 8:55 AM IST
Nirmal
X

Nirmal: 22A నిషేధిత జాబితాతో నలిగిపోతున్న నిర్మల్ జిల్లా రైతులు!

Nirmal: తెలంగాణలో రైతాంగాన్ని భూ సమస్యలు మరోసారి తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా రైతుల భూ కష్టాలు మాత్రం తీరడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన 'ధరణి' పోర్టల్ పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం 'భూభారతి'ని తీసుకువచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ముఖ్యంగా 22A నిషేధిత జాబితా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూమి.. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న హక్కు.. కానీ నేడు అదే భూమి తమదేనని నిరూపించుకోవడానికి రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో జరిగిన లోపాల వల్ల ఎంతోమంది రైతుల భూములు 22A (నిషేధిత జాబితా) లోకి చేరిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినా, కొత్తగా 'భూభారతి' వచ్చినా ఆ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

నిషేధిత జాబితా నుండి తమ భూములను తొలగించుకోవాలంటే అధికారులు 1954 కంటే ముందు నాటి రికార్డులను సమర్పించాలని అడుగుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏడు పదుల క్రితం నాటి రికార్డులు ఎక్కడ తెచ్చుకోవాలో తెలియక, లంచాలు ఇచ్చుకోలేక సగటు రైతాంగం తీవ్ర మానసిక క్షోభకు గురవుతోంది. కొన్ని చోట్ల కొందరు కేటుగాళ్ళు అధికారులతో చేతులు కలిపి, తప్పుడు రికార్డులతో అసలైన రైతుల భూములను సైతం 22A లోకి నెట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సొంత పట్టా భూమి ఉన్నప్పటికీ, 22A ఆంక్షల వల్ల రైతులు ఆ భూములను అమ్ముకోలేకపోతున్నారు, పిల్లల పెళ్లిళ్లకు లేదా చదువుల కోసం లోన్లు తెచ్చుకోలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరూ నష్టపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. పేర్లు మారుతున్నా.. రైతుల భూ సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 22A సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సరళమైన పద్ధతిలో తమ భూములకు విముక్తి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR