Nirmal: నిర్మల్‌లో షాపింగ్ మాల్స్ వద్ద అక్రమ వసూళ్ల ఆరోపణలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో కొత్తగా వెలిసిన షాపింగ్ మాల్స్ వద్ద అక్రమ వసూళ్లు, ట్రాఫిక్ ఇబ్బందులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 14 Oct 2026 2:01 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో షాపింగ్ మాల్స్ వద్ద అక్రమ వసూళ్ల ఆరోపణలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన షాపింగ్ మాల్స్ వద్దనుండి కొంతమంది ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది... నిర్మల్ పట్టణంలో ఇటీవలే బడా షాపింగ్ మాల్స్ ప్రారంభమయ్యాయి. నిర్మల్ పట్టణంలో అసలే ఇరుకుగా ఉన్న జాతీయ రహదారి తో నిత్యం ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, నూతనంగా వెలిసిన ఈ షాపింగ్ మాల్స్ రద్దీ వల్ల, ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి.

అయితే ఈ బడా షాపింగ్ మాల్స్ ఏర్పాటు అనుమతుల కోసం లక్షల రూపాయల్లో చేతులు మారినట్లు ఆరోపణలు వెలుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియం లోని ఖాళీ ప్రదేశంతో పాటు ఇతర ఖాళీ ప్రదేశాలు కూడా షాపింగ్ మాల్ వాహనాల పార్కింగ్ కోసం ఈ షాపింగ్ మాల్స్ వాడుకుంటున్నాయి. అయితే ఒక్కో షాపింగ్ మాల్ వద్ద దాదాపు 25 లక్షల రూపాయల వరకు రాజకీయ పార్టీ నేతలు, కొంతమంది అధికారులు వసూళ్లకు పాల్పడ్డట్లు ప్రచారం సాగుతుండగా, పంపకాల్లో తేడా రావడంతోనే వసూళ్ల పర్వం పై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ చర్చ సాగుతోంది.

సోషల్ మీడియాలో సైతం షాపింగ్ మాల్స్ వసూళ్ల పర్వంపై వైరల్ గా మారింది. షాపింగ్ మాల్స్ పార్కింగ్ ఇబ్బందులపై కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు షాపింగ్ మాల్స్ కు అధికారులు నోటీసులు ఇచ్చినా అక్కడ తీరు మాత్రం మారలేదు. షాపింగ్ మాల్స్ ఏర్పాటు సమయంలో సినీ తారల సందడి ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డట్టు స్థానికులు పేర్కొంటున్నారు.

చిన్న చిన్న దుకాణాల వద్ద వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకునే అధికారులు షాపింగ్ మాల్స్ వద్ద ఎంత రద్దీగా ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం ప్రభుత్వ ప్రాంగణాన్ని వాహనాల పార్కింగ్ గా ఎలా వాడుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL