Indervelli: పేకాటకు స్థలమిచ్చిన జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు

Indervelli: ఇంద్రవెల్లిలో పేకాట స్థావరం నిర్వహణకు స్థలమిచ్చిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమాని గోరేసేట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మిల్లు జప్తుకు ఆర్డీవోకు లేఖ రాశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 24 Oct 2026 3:40 PM IST
Indervelli
X

Indervelli: పేకాటకు స్థలమిచ్చిన జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు

అదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని ఈనెల 21న పాడుబడ్డ మిట్టల్ జిన్నింగ్ మిల్లు ప్రాంగణంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 14 మందిని అరెస్టు చేసిన ఘటనలో, పేకాటకు స్థలం కల్పించిన జిన్నింగ్ మిల్లు యజమాని రాజ్ కుమార్ మిట్టల్ అలియాస్ గోరేసేట్‌ పై సైతం కేసు నమోదు చేసినట్లు ఇంద్రవెల్లి ఎస్‌హెచ్‌ఓ ఈ. సాయన్న తెలిపారు.

ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2,24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో జిన్నింగ్ మిల్లు యజమానికి తెలిసే అక్కడ పేకాట ఆడినట్లు వెల్లడికావడంతో, అతనిపై కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించిన జిన్నింగ్ మిల్లును జప్తు చేయాలని కోరుతూ సంబంధిత ఆర్డీవోకు లేఖ అందజేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ ఈ. సాయన్న వెల్లడించారు.

ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పేకాట, గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు వాటికి సహకరించే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇంద్రవెల్లి ఎస్‌హెచ్‌ఓ ఈ. సాయన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.