Boath: జ్యువెలరీ షాప్ పేరిట బంగారం, నగదు స్వాహా.. నిందితుడి అరెస్ట్

Boath: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో నగల తయారీ, మరమ్మతుల పేరిట వినియోగదారుల నుంచి బంగారం, నగదు కాజేసి పరారైన నిందితుడు రంగు రామును అరెస్ట్ చేసిన పోలీసులు.

NAGULA SATISH, BOATH
Published on: 12 Nov 2026 10:24 PM IST
Boath
X

Boath: జ్యువెలరీ షాప్ పేరిట బంగారం, నగదు స్వాహా.. నిందితుడి అరెస్ట్

​బోథ్: నగల తయారీ, మరమ్మతుల పేరిట వినియోగదారులను నమ్మించి బంగారం, నగదు కాజేసిన నిందితుడిని బోథ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బోథ్ పట్టణంలో గతంలో అయ్యప్ప జ్యువెల్ షాప్ నిర్వహించిన రంగు రాము (45) చెడు వ్యసనాలకు బానిసై, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసేవాడు. ఆర్థిక అవసరాల కోసం తన వద్దకు వచ్చే కస్టమర్లను మోసం చేయడం మొదలుపెట్టాడు.

​ఈ క్రమంలో బంగారు గొలుసు తయారీ కోసం భారతి సమత వద్ద రూ.45,000 నగదు, రెండు జతల కమ్మల తయారీ కోసం ముస్తాక్ అహ్మద్ షేక్ వద్ద 9 గ్రాముల బంగారంతో పాటు రూ.15,050 నగదు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసగించాడు. అలాగే మరమ్మతుల నిమిత్తం మల్లారపు విజయ వద్ద 3 గ్రాముల బంగారు కమ్మలు తీసుకుని స్వాహా చేశాడు.

వీరితో పాటు మరికొందరు కస్టమర్లను కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితుల నుంచి కాజేసిన సుమారు 10 గ్రాముల బంగారు గొలుసు, 6 కమ్మలను పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి ఆ డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నాడు.

​అనంతరం పోలీసులకు చిక్కుతాననే భయంతో నిందితుడు హైదరాబాద్‌కు పరారయ్యాడు. గురువారం తిరిగి బోథ్‌కు చేరుకున్న రంగు రామును స్థానిక బస్ స్టాప్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుడి వద్ద నుంచి ఒక ఒప్పో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా బోథ్ సీఐ డి. సాయినాథ్ మాట్లాడుతూ.. ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలను ఇతరులకు అప్పగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH