Boath: పత్తి పంటలో గంజాయి సాగు రూ.4 లక్షల మొక్కలు స్వాధీనం, అరెస్ట్
Boath: బోథ్ మండలం నిగినిలో పత్తి పంట మధ్య గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. రూ.4 లక్షల విలువైన 40 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Boath: పత్తి పంటలో గంజాయి సాగు రూ.4 లక్షల మొక్కలు స్వాధీనం, అరెస్ట్
బోథ్: పత్తి పంటలో అంతర పంటగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని బోథ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిగిని గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో పత్తి చేను మధ్యలో సాగు చేస్తున్న సుమారు రూ.4 లక్షల విలువ గల 40 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే, నిగిని గ్రామానికి చెందిన లక్ష్మణ్ మడావి (51)కి గంజాయి తాగే అలవాటు ఉంది. తాను వినియోగించగా మిగిలిన గంజాయి నుంచి విత్తనాలు సేకరించి, సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో తన చేనులోని పత్తి పంట మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా సాగు చేయడం ప్రారంభించాడు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, ఒక్కో మొక్క విలువ దాదాపు రూ.10,000 చొప్పున మొత్తం 40 మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బోథ్ సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ గంజాయి సాగు చేసినా, విక్రయించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా గంజాయి సాగుకు పాల్పడే రైతులకు రైతుబంధు, రుణమాఫీ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందకుండా ఉన్నతాధికారులకు, సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




