Adilabad: ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బతుకమ్మ సంబరాలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు, అధికారుల కుటుంబాలు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నాయి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Oct 2026 10:53 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బతుకమ్మ సంబరాలు

Adilabad: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, తెలంగాణ జానపద పాటలు, మహిళల కోలాటాలు, ఉత్సాహభరితమైన నృత్యాలతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి. మౌనిక ఐపీఎస్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బంది, హోంగార్డులు, వివిధ పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి, ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలిచే తంగేడు, గునుగు తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, పోలీసు విధుల్లో నిరంతరం నిమగ్నమై ఉండే అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇలాంటి పండుగలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, కుటుంబ బంధాలకు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణమని అన్నారు.

బతుకమ్మ పండుగలో పూలను అందంగా పేర్చి గౌరమ్మను పూజించడం, మహిళలంతా ఒక్కచోట చేరి వలయాకారంలో బతుకమ్మ ఆడుతూ జానపద పాటలు పాడటం మన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయమని తెలిపారు. ప్రకృతిని ఆరాధించడం, పూల ప్రాధాన్యతను చాటిచెప్పడం, మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందించడం ఈ పండుగ ప్రత్యేకతలని పేర్కొన్నారు.

వేడుకల్లో భాగంగా పోలీసు కార్యాలయాలు, వివిధ విభాగాలకు చెందిన మహిళా సిబ్బంది అందంగా అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించారు. అత్యంత సుందరంగా అలంకరించిన బతుకమ్మలకు జిల్లా ఎస్పీ బహుమతులు అందించి సిబ్బందిని ప్రోత్సహించారు. అనంతరం అందరూ కలిసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి, నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు నిర్వహించారు.

పోలీసు కుటుంబాల మధ్య స్నేహభావం, ఐక్యత, ఆత్మీయతను పెంపొందించేలా ఈ వేడుకలు కొనసాగాయి.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, మహిళా పోలీసు సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.