Basara: లాబ్ధిలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కలెక్టర్ భవేష్ మిశ్రా

Basara: బాసర మండలం లాబ్ధి గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరిపిన కలెక్టర్ భవేష్ మిశ్రా. సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.

RAMESH RATNELLI, BASARA
Published on: 8 Nov 2026 5:10 PM IST
Basara
X

Basara: లాబ్ధిలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కలెక్టర్ భవేష్ మిశ్రా

బాసర: ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు తోకలవాడ్ అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇంటి నిర్మాణ వివరాలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. మిఠాయిలు, పిల్లలకు టపాసులు, నోటుపుస్తకాలు అందజేసి చక్కగా చదువుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లాబ్ధి గ్రామం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజలో ఉండటం అభినందనీయమన్నారు. ఇతర గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో విశేష పురోగతికి కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద కుటుంబాల్లో సొంతింటి ఆనందం వెల్లివిరుస్తోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. లబ్ధిదారుల ఇంట్లో వారితో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారు అనూష బాయి మాట్లాడుతూ.. సొంతింటిలో దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్‌కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి పండుగలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు.

అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాబ్ కార్డులు కలిగిన గ్రామస్తులంతా వీబీ-జీ రామ్ జీ పథకం కింద ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, సర్పంచ్ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA