Gudihathnoor: న్యాయవాది జోందలే అజయ్‌కు అబ్దుల్ కలాం అవార్డు

Gudihathnoor: గుడిహత్నూర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది జోందలే అజయ్ కుమార్ ప్రతిష్టాత్మక "ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు - 2026" కు ఎంపికయ్యారు.

NAGULA SATISH, BOATH
Published on: 24 Oct 2026 2:57 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: న్యాయవాది జోందలే అజయ్‌కు అబ్దుల్ కలాం అవార్డు

గుడిహత్నూర్: ​హైదరాబాద్‌కు చెందిన మెగాసిటీ నవకళా వేదిక ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతిని పురస్కరించుకుని అందించే ప్రతిష్టాత్మక "ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు - 2026" కు ప్రముఖ న్యాయవాది జోందలే అజయ్ కుమార్ ఎంపికయ్యారు. రేపు హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ వేదికగా ఈ అవార్డు అందుకోనున్నారు, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ఆయన, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో రాణిస్తూనే పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

​ఈ క్రమంలో గతంలోనూ ఆయన విశేష సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు లభించాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ అడ్వకేట్‌గా అందించిన మెరుగైన సేవలకు గాను 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా సత్య సంగీత ఇంటర్నేషనల్ వారి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి పురస్కారం – అభినందన పురస్కారాన్ని పొందారు.

అంతకుముందు 2022 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం నుంచి ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందడంతో పాటు, అదిలా ఆదర్శ హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ వెల్ఫేర్ సొసైటీ వారిచే ప్రత్యేక సత్కారాన్ని దక్కించుకున్నారు.

​గ్రామీణ ప్రాంతంలో, ప్రభుత్వ పాఠశాలలో చదివి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన జోందలే అజయ్‌ను గుడిహత్నూర్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, న్యాయవాద మిత్రులు, అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH