Gudihatnur: సాఫ్ట్‌వేర్ చదువును పక్కనపెట్టి పాడి పరిశ్రమలో రాణిస్తున్న యువకుడు!
Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్ యువకుడు రాథోడ్ నితిన్ అనన్య డెయిరీ ఫామ్‌తో పదిమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Gudihatnur: సాఫ్ట్‌వేర్ చదువును పక్కనపెట్టి పాడి పరిశ్రమలో రాణిస్తున్న యువకుడు!
Gudihatnur: కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన యువత సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం నగరాల బాట పడుతుంటే, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలానికి చెందిన 26 ఏళ్ల యువకుడు రాథోడ్ నితిన్ మాత్రం వినూత్న ఆలోచనతో సొంత ఊరిలోనే పాడి పరిశ్రమను ఎంచుకుని విజయపథంలో దూసుకుపోతున్నాడు.
గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగాల వేటలో పడకుండా, పక్కా ప్రణాళికతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తన వద్ద ఉన్న రూ. 10 లక్షల పొదుపునకు తోడు, మరో రూ. 20 లక్షలు బ్యాంకు రుణం పొంది, మొత్తం రూ. 30 లక్షల పెట్టుబడితో గత ఏడాది 14 గేదెలతో మండల కేంద్రంలో ‘అనన్య డెయిరీ ఫామ్’ని ప్రారంభించాడు.
మొదట చిన్నగా ప్రారంభమైన ఈ ప్రయాణం, ఏడాది తిరిగేసరికి చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో నిలదొక్కుకుంది. ప్రస్తుతం ఈ డెయిరీ ద్వారా రోజూ 70 లీటర్ల స్వచ్ఛమైన పాలు, 15 కిలోల నాణ్యమైన పెరుగు ఉత్పత్తి చేస్తున్నాడు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా, మార్కెటింగ్‌లోనూ సరికొత్త పద్ధతులను అవలంబిస్తున్నాడు.
పర్యావరణహితంగా, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆదిలాబాద్ పట్టణంలో ‘అనన్య డెయిరీ’ పేరుతో సరికొత్త విధానంలో గాజు సీసాల్లో (గ్లాస్ బాటిల్స్) స్వచ్ఛమైన పాలను నేరుగా వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ చేస్తూ ప్రత్యేక ఆదరణ పొందుతున్నాడు. మరోవైపు స్థానిక మార్కెట్‌లో తానే స్వయంగా స్టాల్ ఏర్పాటు చేసుకుని పాలు, పెరుగు, స్వచ్ఛమైన నెయ్యిని విక్రయిస్తూనే, అక్కడే టీ స్టాల్‌ను సైతం నడుపుతూ అదనపు వ్యాపార అవకాశాలను సృష్టించుకున్నాడు.
తాను స్వయం ఉపాధి పొందడమే కాకుండా, తన డెయిరీ కార్యకలాపాల ద్వారా 8 మందికి ఉపాధి కల్పిస్తూ స్థానిక యువతకు మార్గదర్శిగా మారాడు. వ్యాపారంలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు, దాణా ఖర్చులు మరియు బ్యాంకు ఈఎంఐ (EMI) సక్రమంగా చెల్లించగా అన్ని ఖర్చులు పోను తనకు నెలకు రూ. 45 వేల నికర ఆదాయం మిగులుతోందని నితిన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు, బ్యాంకు EMI పూర్తయితే తన లాభం ఇంకా రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు, చదువుకున్న చదువును, ఆధునిక వ్యాపార నైపుణ్యాలను పాడి పరిశ్రమకు జోడించి స్వల్ప కాలంలోనే లాభాల బాట పట్టవచ్చని నిరూపిస్తూ, గుడిహత్నూర్, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో రాథోడ్ నితిన్ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు.




