Adilabad: గిట్టుబాటు ధర లేక.. గోబీ పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో సరైన ధర రాక కౌలు రైతు గోబీ పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఎకరాకు రూ.70 వేల పెట్టుబడి పెట్టి తీవ్ర నష్టపోయాడు.

NAGULA SATISH, BOATH
Published on: 27 Sept 2026 8:00 AM IST
Adilabad
X

Adilabad: గిట్టుబాటు ధర లేక.. గోబీ పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామంలో మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కౌలు రైతు తన చేతికొచ్చిన పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. మన్నూర్ గ్రామానికి చెందిన షేక్ రఫీక్ అనే రైతు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని గోబీ సాగు చేశాడు. పంటను మార్కెట్‌కు తరలించే సమయంలో కిలోకు కేవలం 3 నుంచి 4 మాత్రమే ధర పలుకుతుండటంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కూరగాయలను కోయించి మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అయ్యే కూలీ ఖర్చులు, రవాణా చార్జీలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో పంటను నేలమట్టం చేయాల్సి వచ్చిందని రైతు వాపోయాడు.

​ఎకరాకు సుమారు 70,000 వరకు పెట్టుబడి పెట్టి శ్రమించినప్పటికీ, ఆశించిన దిగుబడి రాకపోగా వచ్చిన కొద్దిపాటి పంటకు కూడా కనీస మద్దతు ధర దక్కలేదని తెలిపాడు. గత ఏడాది గోబీ పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో అన్ని ఖర్చులు పోను ఎకరాకు 1,50,000 వరకు లాభం వచ్చిందని, ఆ ఆశతోనే ఈసారి కూడా సాగు చేస్తే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చిందని రైతు రఫీక్ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఎకరాకు దాదాపు 1,50,000 వరకు నష్టం వాటిల్లడంతో పాటు, ఎకరాకు చెల్లించాల్సిన ₹20,000 కౌలు భారం కూడా నెత్తిన పడిందని పేర్కొన్నాడు.

​ఇదే పంటను ఇలాగే కొనసాగిస్తే రోజురోజుకూ పెరుగుతున్న ఈ భారీ నష్టాన్ని ఎంతమాత్రం భరించలేనని, లేదంటే కౌలుకు తీసుకున్న భూమి మరింత భారంగా మారుతుందనే ఉద్దేశంతోనే పంటను అర్ధాంతరంగా తొలగించాల్సి వచ్చిందని రైతు వివరించాడు. భూ యజమానికి సకాలంలో కౌలు డబ్బులు చెల్లించాలంటే, ఉన్న పొలంలో వెంటనే మరో ప్రత్యామ్నాయ పంటను సాగు చేసి ఆ వచ్చే ఆదాయంతోనైనా కౌలు తీర్చాలనే ఆలోచనతోనే గోబీ పంటను దున్నేశానని ఆవేదనతో తెలిపాడు. పెట్టిన పెట్టుబడులు పోయి, అప్పులు తీర్చే దారి కనిపించక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తనలాంటి కౌలు రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH