Tamsi: గిరిగామలో 'పోలీసులు మీకోసం'.. పాల్గొన్న ఎస్పీ అఖిల్

Tamsi: అదిలాబాద్ జిల్లా తాంసి మండలం గిరిగామలో నిర్వహించిన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 26 Oct 2026 3:45 PM IST
Tamsi
X

Tamsi: గిరిగామలో 'పోలీసులు మీకోసం'.. పాల్గొన్న ఎస్పీ అఖిల్

అదిలాబాద్ జిల్లా: తాంసి మండలం గిరిగామ గ్రామంలో నిర్వహించిన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎస్పీకి గ్రామస్థులు డప్పు వాయిద్యాలు, గుస్సాడి నృత్యంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం 86వ కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆదివాసీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరుగురు నిపుణులైన వైద్య సిబ్బందితో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా 10 హెల్మెట్లను పంపిణీ చేశారు.యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీల విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు.

మొదటి బహుమతి గోట్కూరి గ్రామ జట్టుకు రూ.3,500 నగదు, ట్రోఫీ, రెండో బహుమతి తాంసి గ్రామ జట్టుకు రూ.2,000 నగదు, ట్రోఫీ, మూడో బహుమతి కప్పర్ల గ్రామ జట్టుకు రూ.1,500 నగదు, ట్రోఫీ అందజేశారు.ఈ సందర్భంగా కప్పర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 13 సీసీటీవీ కెమెరాలను, పొన్నారి గ్రామంలో 5 సీసీటీవీ కెమెరాలను, గొట్కూరి గ్రామంలో 4 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని, యువతతో పాటు ప్రజలందరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

గంజాయి సాగు చేసినా, విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సంబంధిత అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు.

విద్యతోనే జీవితంలో మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, ముఖ్యంగా ఆదివాసీ యువత విద్యకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని తెలిపారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు, నేరస్తులను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ గ్రామాల అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. సరిహద్దు ప్రాంతం గుండా దేశి దారు అక్రమ రవాణా జరగకుండ, ఆరోగ్యానికి హాని చేసే దేశి దారు సేవించకుండా ఉండాలని తెలిపారు.

ఆదివాసీలో ఎలాంటి వైద్య అవసరాల కైనా నకిలీ బాబాలను మంత్రాలను తంత్రాలను నమ్మవద్దని, నిష్ణాతులైన ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్ల వద్ద చికిత్స చేసుకోవాలని తెలిపారు. కంటి పరీక్షలలో భాగంగా ఉచితంగా పది కంటి అద్దాలు అంద చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, ఎస్ఐ ఎస్. జీవన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దారుట్ల మీరాబాయి, పరిసర గ్రామాల సర్పంచులు, గ్రామస్థులు, వైద్యులు నవీన్ రెడ్డి, రోజా రాణి, రవికాంత్, శ్వేత, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.