Adilabad: మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రైతులతో కలెక్టర్ సమావేశం

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రైతులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించి, న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 17 Nov 2026 11:28 PM IST
Adilabad
X

Adilabad: మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై రైతులతో కలెక్టర్ సమావేశం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు కోసం భూములు అందిస్తున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా, చట్ట నిబంధనల ప్రకారం న్యాయమైన, మెరుగైన నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియ, నష్టపరిహారం నిర్ణయానికి సంబంధించి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్క్ పరిధిలోకి వచ్చే గిమ్మ, గూడ, రాంపూర్, హాతిగాట్ గ్రామాలకు చెందిన రైతులతో ఆయన నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పారిశ్రామిక ప్రగతికి మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఒక కీలక మైలురాయిగా నిలవనుందని, దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి, జిల్లాకు ఆర్థిక ప్రగతి చేకూరుతాయని తెలిపారు. అయితే అభివృద్ధి కోసం తమ విలువైన సాగు భూములను అందిస్తున్న రైతుల సంక్షేమాన్ని విస్మరించే ప్రసక్తే లేదన్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం భూముల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని, అర్హులైన రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. నష్టపరిహారం నిర్ణయించే ప్రక్రియలో పారదర్శకత పాటిస్తామని, రైతుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

సమావేశంలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు, నష్టపరిహారం, ఇతర అంశాలపై పలు సందేహాలు, డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ప్రతి అంశాన్ని ఓపికగా విన్న కలెక్టర్, వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, భూసేకరణ ప్రక్రియపై ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారులకు సహకరించాలని కోరారు.

జిల్లా అభివృద్ధితో పాటు రైతుల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, భూసేకరణ ప్రత్యేక అధికారులు, గిమ్మ, గూడ, రాంపూర్, హాతిగాట్ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.