Gudihathnoor: గుడిహత్నూర్ మోడల్ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో కలిసి భోజనం
Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గుడిహత్నూర్ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.
Gudihathnoor: గుడిహత్నూర్ మోడల్ స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో కలిసి భోజనం
గుడిహత్నూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, పౌష్టికాహారం అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన ఆయన, ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతోందా, భోజనం నాణ్యత ఎలా ఉందని పిల్లలను ఆప్యాయంగా ఆరా తీశారు. భోజన తయారీ, సరఫరాలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు ఉంటాయని నిర్వాహకులను హెచ్చరించారు. అనంతరం పాఠశాల వంటశాల, కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి, అక్కడ పండించిన తాజా కూరగాయలను విద్యార్థుల భోజనానికి వినియోగించడాన్ని అభినందించారు.
పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను సందర్శించి విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను వీక్షించిన కలెక్టర్, అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన యోగా, మ్యూజిక్ గదులను ప్రారంభించారు.
జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల మాక్ పార్లమెంట్ పోటీల్లో గుడిహత్నూర్ మోడల్ స్కూల్ విజేతగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, తహసీల్దార్ కవితారెడ్డి, ఏపీఎం సుజాత, సర్పంచ్ ఆడే శీల, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.




