Adilabad: ఆదిలాబాద్‌లో బినామీ ఖాతాల మోసం.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్

Adilabad: కార్మికుల పేర్లపై బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచి రూ.8.55 కోట్ల లావాదేవీలు, పన్ను ఎగవేతకు పాల్పడిన వ్యాపారి రాజ్ కుమార్ మిట్టల్ అరెస్ట్, రిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 28 Nov 2026 3:54 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో బినామీ ఖాతాల మోసం.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్

ఆదిలాబాద్: కర్మాగారంలో పనిచేసే కార్మికుల ఆధార్, పాన్ కార్డులు తీసుకుని వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయల లావాదేవీలు. ఆదాయపు పన్ను ఎగవేతకు బినామీ ఖాతాలను వినియోగించి ప్రభుత్వాన్ని, కార్మికులను మోసం చేసిన నిందితులు. ఒక నిందితుడు రిమాండ్.. పరారీలో మరో నిందితుడు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి

నిందితుల వివరాలు:

A-1: రాజ్ కుమార్ మిట్టల్ @ రాజీవ్ కుమార్ మిట్టల్ @ గోరే సెట్(55), s/o రఘునాథ్ మిట్టల్, నివాసం భుక్తాపూర్, ఆదిలాబాద్. (రిమాండ్)

A-2: సంజీవ్ కుమార్ మిట్టల్ (54), s/o రఘునాథ్ మిట్టల్, నివాసం భుక్తాపూర్, ఆదిలాబాద్. (పరారీలో ఉన్నాడు)

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ మిట్టల్ తన సోదరుడు సంజీవ్ కుమార్ మిట్టల్‌తో కలిసి బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి, ఫోర్జరీ, చీటింగ్‌కు పాల్పడిన కేసులో రాజ్ కుమార్ మిట్టల్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.

నిందితులు తమ వ్యాపార సంస్థల ఆర్థిక లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా ఉంచి పన్ను ఎగవేయాలనే ఉద్దేశంతో తమ వద్ద పనిచేసే కార్మికులైన పెర్క భూమన్న, అలువాల అనిల్ కుమార్ సుధాకర్, మాదస్తువార్ సంతోష్, రమాకాంత్ కేంద్రే, గోదం గజానన్ తదితరులను నమ్మించి వారి ఆధార్, పాన్ కార్డులు సేకరించారు. వారి సంతకాలను ఖాళీ కాగితాలపై తీసుకుని శ్రీ రేణుకా మాత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్‌లో వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచారు.

అనంతరం ఖాతాదారుల చెక్‌బుక్‌లను తీసుకుని ఖాళీ చెక్కులపై వారి సంతకాలు సేకరించి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. సదరు బినామీ ఖాతాల ద్వారా తమ వ్యాపార సంస్థలకు సంబంధించిన కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తూ ఆదాయపు పన్ను శాఖకు ఆర్థిక లావాదేవీల వివరాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వ్యాపార సంస్థలపై తనిఖీలు నిర్వహించగా, పన్ను బకాయిలను చెల్లిస్తామని నిందితులు హామీ ఇచ్చారు. అయినప్పటికీ చెల్లింపులు చేయకుండా కాలయాపన చేశారు. 2022 జూలై 29న ఆదాయపు పన్ను శాఖ నుంచి సంబంధిత కార్మికులకు నోటీసులు అందడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పెర్క భూమన్న పేరుతో నిర్వహించిన బ్యాంకు ఖాతాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.5,16,41,322, 2014-15లో రూ.1,94,27,504 లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా పలువురు కార్మికుల ఖాతాల ద్వారా 2012-13 నుంచి 2015-16 వరకు మొత్తం సుమారు రూ.8.55 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది.తన సొంత బ్యాంకు ఖాతా కూడా ఫ్రీజ్ కావడంతో, తన అకౌంట్లో ఉన్న రెండు కోట్ల నగదును వాడుకోకుండా పోవడంతో బాధితుడు పెర్క భూమన్న నిందితులను నిలదీయగా, సమస్యను పరిష్కరిస్తానని నమ్మిస్తూ మోసం చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు రాజ్ కుమార్ మిట్టల్‌ను అదుపులోకి తీసుకొని, ఈరోజు నిందితుని అరెస్టు చేసే రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు . విచారణలో నేరానికి సంబంధించిన ఆదాయపు పన్ను శాఖ పత్రాలు, ఒక ఆపిల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో నిందితులపై IPC సెక్షన్లు 409, 420, 464, 465, 467, 468, బినామీ లావాదేవీల నిషేధ చట్టం-1988 సెక్షన్ 53, ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 276(C) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ బి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.