Adilabad: ఇచ్చోడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని 40 మేకలు మృతి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బైపాస్ రహదారిపై గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో 40 మేకలు మృతి చెందగా, కాపరికి తీవ్ర గాయాలయ్యాయి.
Adilabad: ఇచ్చోడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని 40 మేకలు మృతి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బైపాస్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొన్న ఘటనలో సుమారు 40 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, వాటిని కాస్తున్న కాపరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన జీవనోపాధి కోసం మేకల మందతో ఇక్కడికి వలస వచ్చాడు. ఈ క్రమంలో ఇచ్చోడ బైపాస్ సమీపంలో మేకలను మేపుతూ, వాటిని జాతీయ రహదారి దాటించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని లారీ రహదారి దాటుతున్న మేకల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రతకు 40 మేకలు రహదారిపైనే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయాయి.
అదే సమయంలో మేకలను కాపాడుకునే ప్రయత్నంలో కాపరికి కూడా లారీ బలంగా తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి రక్తపు మడుగులో పడివున్న క్షతగాత్రుడిని కాపాడి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన మేకల విలువ దాదాపు రూ. 3.50 లక్షల వరకు ఉంటుందని, జీవనోపాధి కోల్పోయి తీవ్ర నష్టానికి గురయ్యామని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.




