తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి రేవంత్ రెడ్డి లేఖ
x

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి 

Highlights

MP Revanth Reddy Letter To Governor Tamilisai : రాష్ట్రంలో రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కేసీఆర్ సర్కారు కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు.

MP Revanth Reddy Letter To Governor Tamilisai : రాష్ట్రంలో రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కేసీఆర్ సర్కారు కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి, నియంత్రణ, ప్రజలకు వైద్యసేవలు అందుతోన్న తీరు పై ఆది నుంచి మీరు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతావైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సైతం సంకోచించని మీ వైఖరి అభినందనీయమన్నారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, ప్రజాస్వామిక హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లుతోందని లేఖలో ప్రస్తావించారు. పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆవిరైపోయిందని పేర్కొన్నారు. విలువలకు పాలకులు సమాధికట్టేశారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాక ఓ బందిపోటు ముఠా నాయకుడుగా, ఆధునిక నియంతగా అరాచక పోకడలు పోతున్నాడన్నారు. ప్రాథమిక హక్కులు, పౌరహక్కులు, వాక్స్వాతంత్ర్యం, రాజకీయ స్వేచ్ఛ అన్నవి మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ... అక్రమ నిర్భాందాలకు ఒడిగడుతూ మానవహక్కులను కాలరాస్తున్నారన్నారు. పోలీసులను కేసీఆర్ తన ప్రైవేటు సైన్యంగా మార్చివేశారన్నారు.

పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధించడమే పోలీసుశాఖ పనిగా మారిపోయిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం, వారి ఇళ్ల దగ్గర నిరంతర నిఘా, కదలికల పై నిఘా పెట్టడం, ఫోను సంభాషణల పై నిఘా పెట్టడం ప్రభుత్వ అప్రకటిత ప్రాధాన్యం అయింది. ప్రజా ప్రతినిధులమైన మేము స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితి లేదు. ప్రజలు కష్టాలలో ఉంటే వారిని పరామర్శించే బాధ్యత, వారికి న్యాయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే హక్కు మాకు ఉంది. వివిధ నిరసన పద్ధతుల్లో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే బాధ్యత, హక్కు ప్రతిపక్ష నేతలుగా మాకు ఉంది. చంద్రశేఖర్ రావు పాలనలో ఇలాంటి హక్కులన్నీ మాటలకే పరిమితం అయ్యాయి. సర్కారుకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటానికి లేదు, తప్పులను ఎత్తిచూపే స్వేచ్ఛ లేదు. ఇది అన్యాయం అని ఎవరూ గొంతెత్తడానికి లేదు. గతంలో ముఖ్యమంత్రులు సామాన్యులకు అందుబాటులో ఉండేవారు. చంద్రశేఖర్ రావు సీఎం అయ్యాక సామాన్యులకు దర్శన భాగ్యం దేవుడెరుగు... ప్రతిపక్ష నేతలకు సైతం అపాయింట్ మెంట్లు లేవు. ఆయన సచివాలయానికి రారు. ధర్నానో, నిరసననో చేపట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళదామంటే ధర్నాచౌక్ మూసేశారు. ఇక సామాన్యులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి.

తాజాగా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిన తొమ్మిది మంది సిబ్బంది మృత్యువాతపడిన విషయం మీకు తెలిసిందే. మనుషుల ప్రాణాలతో పాటు, వేల కోట్ల రూపాయల విలువైన జాతి సంపద పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సంకేతాలను హెచ్చరిస్తూ రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారులకు అక్కడ సిబ్బంది సమాచారం పంపారు. సదరు అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు. ఈ ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యమన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో సైతం ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించలేదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం జెన్ కో ఆసుపత్రి ముందు సిబ్బంది ఆందోళన చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వాస్తవ పరిస్థితిని తెలుసు కునేందుకు నేను, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి ఈ రోజు ఉదయం శ్రీశైలం బయలుదేరి వెళ్లామన్నారు. మార్గమధ్యంలో దిండి వద్ద పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లేందుకు గానీ, బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు గానీ అనుమతి లేదన్నారు. ప్రజాప్రతినిధులు గా ఆ కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉందని, పరామర్శకు అనుమతించాలని ఎంతగా విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదని పేర్కొన్నారు.

అత్యంత పాశవికంగా, మా వాహనాల నుంచి ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారని తెలిపారు. ఈ రాష్ట్రంలో మా లాంటి ప్రజాప్రతినిధుల హక్కులకే దిక్కులేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా వారిని కలిసి, ధైర్యం చెప్పి, న్యాయం కోసం ప్రశ్నించే హక్కు మాకు లేదా!? వారి తరఫున పోరాడే హక్కు మాకు లేదా? అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా? రాజ్యాంగ అధినేతగా ఉన్న మీరు సదరు హక్కులకు కాపాడాలని కోరుతున్నాను. తాజా విద్యుత్ కేంద్ర ప్రమాదంలో మానవతప్పిదం ఉంది. కింది స్థాయి సిబ్బంది హెచ్చరించినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. దీనికి పూర్తిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సంస్థ సీఎండీ ప్రభాకర్ రావులు బాధ్యత వహించాలని కోరారు. వారిద్దరి పై చర్యలు తీసుకునేలా మీరు ముఖ్యమంత్రిని ఆదేశించాలని సవినయంగా కోరుతున్నాను. అదే విధంగా ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి. బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. కోవిడ్ పై స్పందిన తీరుగానే ఈ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నాని లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories