కరోనా పేషెంట్లకు రూ.28 వేలకే వైద్యం!

కరోనా పేషెంట్లకు రూ.28 వేలకే వైద్యం!
x
Highlights

Jain International Covid Care Centre : రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్...

Jain International Covid Care Centre : రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఆ బిల్లు, ఈ బిల్లు అంటూ లక్షల కొద్దీ డబ్బులను వసూలు చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ప్రయివేటు ఆస్పత్రుల బిల్లులు చూసి ఇప్పటికే కొంత మంది గుండెపోటుతో మృతి చెందిన దాఖలాలు కూడా ఉన్నాయి. పీపీఈ కిట్లకు వేసిన బిల్లు చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రయివేట్ హాస్పిటళ్లలో కట్టేందుకు డబ్బులు లేక దిగువ మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకోవడానికి చాలా మంది ధైర్యం చేయడం లేదు. మరికొంత మందికి చేతిలో డబ్బులున్నప్పటికీ వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్‌లో బెడ్ దొరకని పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీగా బిల్లులు వసూలు చేస్తున్న రెండు ప్రయివేట్ హాస్పిటళ్లకు షాకిచ్చింది.

ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి పరిస్థితులను చూసిన ఓ హాస్పిటల్ యాజమాన్యం వారానికి రూ.28 వేలు మాత్రమే చార్జ్ చేస్తూ కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు ముందుకొచ్చింది. దాతల సహకారంతో నడిచే ఈ సంస్థ తక్కువ ఫీజులతోనే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించనుంది. అందుకు గాను జైన్ ఇంటర్నేషనల్ సంస్థ వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

జైన్ ఇంటర్నేషనల్ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్న ఈ కోవిడ్ సెంటర్ 16వది. బుధవారం రోజున బేగంపేట చిరాగ్‌పోర్ట్‌లోని మూడు అంతస్థుల మానస సరోవర్‌ హోటల్‌లో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారు. ఆరోగ్య శాఖ సూచనలకు అనుగుణంగా, ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. షుగర్, హైబీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడే కోవిడ్ బాధితుల కోసం ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరుగురు డాక్లర్ల టీంతోపాటు వైద్య సిబ్బంది ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో 24 గంటలపాటు డ్యూటీలో ఉంటారు.

కరోనా బారిన పడిన వారు ఎవరైనా ఈ ఆస్పత్రిలో చేరొచ్చు. అంతే కాదు ఈ సెంటర్లో ఒక గదిలో ఇద్దరు లేక ఒక్కరు పేషెంట్లను మాత్రమే ఉంచుతారు. ఇద్దరు పేషెంట్ల చొప్పున ఉంటే వారానికి ఒక్కొక్కరికి రూ.28 వేల చొప్పున ఫీజు వసూలు చేస్తారు. అదే గదిలో ఒక్కరు మాత్రమే ఉండాలనుకుంటే వారానికి రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పేషెంట్లకు పోషకాలతో కూడిన శాకాహారం అందిస్తారు. అయితే ఈ కోవిడ్ సెంటర్లో ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది, వెంటిలేటర్లు ఉండవు. కరోనా మందులు, ఆక్సిజన్ తదితర సదుపాయాలకు అదనంగా బిల్లు చెల్లించాల్సిన అవసరం అస్సలే లేదు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లను వేరే హాస్పిటళ్లకు తరలించడం కోసం అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ రోగికి వెంటిటేర్ అవసరమని భావిస్తే.. మసాబ్ ట్యాంక్‌లోని మహవీర్ హాస్పిటల్‌లో తక్కువ ధరకే వెంటిలేటర్‌తో కూడిన వైద్యాన్ని అందిస్తారు.




Show Full Article
Print Article
Next Story
More Stories