Khammam: బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి.. 8 మందికి గాయాలు

Khammam: బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో బాణసంచా పేల్చిన యువకులు

Jyothi
Published on: 12 April 2023 2:17 PM IST
Fire Accident In Khammam
X

Khammam: బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి.. 8 మందికి గాయాలు

Khammam: ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో ఈ సమావేశం నిర్వహించగా.. ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్‌లకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చారు.

ఈ సమయంలో నిప్పు రవ్వలు పక్కనే ఉన్న పూరిగుడిసెపై పడ్డాయి. దీంతో ఇంటికి నిప్పు అంటుకోవటంతో పాటు గుడిసెలోఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో ఓ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు జర్నలిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అగ్నిప్రమాదంతో అక్కడున్న వారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉరుకులు, పరుగులు తీశారు. క్షతగాత్రుల హాహాకారలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణ నెలకొంది. అనుకోని ప్రమాదంతో బాధితుల కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్‌లు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story