తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. వడగాల్పుల తీవ్రత.. అకాల వర్షం...

Different Weather Reported in Telangana Andhra Pradesh | Weather Forecast Today
x

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. వడగాల్పుల తీవ్రత.. అకాల వర్షం...

Highlights

Weather Report: *తడిసి ముద్దయిన వరి ధాన్యం *నేల రాలిన మామిడి కాయలు *కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. ఏపీలో వడగాల్పులు వీయనుండగా... తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో శుక్రవారం 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాలు, అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం మండలాలు, కాకినాడ జిల్లాలో కోటనండూరు, పల్నాడు జిల్లాలో అమరావతి మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు మండలాలు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపు కోట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు.

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండలు.. ఒక్కసారిగా మాయమై.. వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకోవడంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో.. చిరు జల్లులు కురిశాయి. రామాంతపూర్ , ఉప్పల్, బోడుప్పల్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ ప్రాంతాల్లో జల్లులు కురవడంతో.. నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు.

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో వడగండ్ల వర్షం కురియడంతో వందల ఎకరాల్లో పంట నేల పాలయింది. సిరికొండ మండలంలోని పందిమడుగు, దుప్య తండా, చీమనుపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. వడగండ్లతో కోతకు వచ్చిన పొలాల్లో వడ్లు నేల రాలిపోయాయి. ఆయా గ్రామాల్లో వంద ఎకరాల్లో వడ్లు నేలరాలాయి. వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం, పారిశ్రామిక వాడ పాష మైలారం, పటాన్‌చెరు ప్రాంతాల్లో పలు చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రుద్రారం గ్రామంలో ఈదురు గాలులతో చెట్టు కొమ్మలు విరిగి ఇంటి పైకప్పు రేకులు విరిగిపడ్డాయి.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ఐకెపి సెంటర్లో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. చేతికందిన మామిడి కాయలు నెలరాలడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. చేతికందిన పంటలు కళ్ళ ముందే తడిసి పోవడంతో రైతులు మనో వేదనకు గురవుతున్నారు.తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని, మామిడి కాయలు రాలిపోయి నష్టం వాటిల్లిన రైతులను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మెదక్ జిల్లాలో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. నార్సింగి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో జప్తి శివనూర్‌లో చెట్లు , విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రామాయంపేట మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతులు ఆరబెట్టుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. జలాల్పూర్ తండాలో బొజ్జ నాయక్ అనే రైతు పొలానికి వెళ్లగా పొలంలోనే పిడుగు పడి చనిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories