ఆ నాలుగు జోన్లలోనే కరోనా ఎక్కువ : సీఎం కేసీఆర్
తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ లోని lb నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం ఆక్టివ్ కేసులున్నాయని అన్నారు. ఆ నాలుగు జోన్ లొనే లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా చేస్తామని అన్నారు. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులకు ఎవరికీ పాజిటివ్ లేదని, ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇక కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమేనని, ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువననీ, కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదుని కేసీఆర్ అన్నారు
ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటోమోబైల్ షో రూములు, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని కేసీఅర్ వెల్లడించారు.




