logo
తెలంగాణ

Almond Nutrition Facts: కరోనా ప్రభావంతో బాదంకు భలే గిరాకీ

Almond Nutrition Facts: కరోనా ప్రభావంతో బాదంకు భలే గిరాకీ
X
Highlights

Almond Nutrition Facts : బాదం పప్పు బలవర్థకమైన ఆహారం. ఇవి జలుబు, జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి. బాదం పైపొట్టు...

Almond Nutrition Facts : బాదం పప్పు బలవర్థకమైన ఆహారం. ఇవి జలుబు, జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి. బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజూ బాదం పప్పును తినడం ద్వారా శరీరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది. తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. ఇన్నిపోషకాలు ఉన్న ఈ బాదం పప్పు సామాన్యలకు అందని ద్రాక్ష అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో పోషకాలు ఉన్న పప్పు ధర చుక్కల్ని అంటే విధంగా ఉంటాయి. ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఈ బాదంల వినియోగం విపరీతంగా పెరిగింది.

పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కరోనా ను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాదం పప్పులను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. వీటికి డిమాండ్ పెరిగినా ధరలు మాత్రం తగ్గడంలేదు. గతంలో రంజాన్‌తోపాటు ఇతర పండుగలప్పుడు మాత్రమే ఈ బాదం పప్పు విక్రయాలు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాదంను తెగ తినేస్తున్నారు. మార్కెట్లో సాధారణ రోజుల్లో నెలకు 3–4 టన్నుల బాదం విక్రయాలు జరిగితే ప్రస్తుతం మాత్రం అంతకు పది రెట్లు విక్రయాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ బాదంలలో కూడా ఎక్కువగా క్యాలిఫోర్నియా బాదంకు డిమాండ్‌ ఉందని వ్యాపారులు చెపుతున్నారు.

పోషకాలు..

బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది.

గుండెకు : పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌.

కొలెస్ట్రాల్‌ నియంత్రణ : వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది.

రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.

ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది.

బరువుతగ్గడానికి : బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.

తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకని దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.

మధుమేహానికి : మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.

మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది.

బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్ : బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండ ఉంటుంది.

అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా, ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
Web TitleAlmond Nutrition Facts: Good demand in the market for immune-boosting almonds
Next Story