Top
logo

ఓ మహర్షీ సరిలేరు నీకెవ్వరు..

ఓ మహర్షీ సరిలేరు నీకెవ్వరు..
X
Highlights

తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా తెరంగేట్రం చేసి.. తండ్రిని మించిన తనయుడిగా..వెలుగులు విరజిమ్ముతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఈరోజు.

వారసుడు అంటే.. తండ్రికి సంబంధించిన రంగంలో తండ్రి సాధించిన సింహాసనం మీద కూర్చుని పిల్ల చేష్టలు చేసేవాడు కాదు. వారసత్వం అంటే తండ్రి..తాతల ప్రతిష్టను మోసుకుని తిరిగేవాడు కాదు.. నిజమైన వారసుడు తన ప్రతిభతో గుభాలిస్తాడు. అసలైన వారసుడు తండ్రి సాధించిన అద్భుత విజయాన్ని మరిచిపోఎంతటి అద్భుతాల్ని సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు. వారసత్వంగా వచ్చే ప్రతిష్టకు తన నడవడితో మరింత వన్నె తెచ్చేవాడికి మాత్రమే చెందేది. సరిగ్గా అటువంటి వారసుడే మహేష్ బాబు. తనకు సహజంగా వచ్చిన వారసత్వ ప్రతిష్టను మరో పదిమెట్లు పైకి తీసుకెళ్లిన మహర్షి! ఈరోజు (ఆగస్టు 9) మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ గురించి కొన్ని ముచ్చట్లు..

ఘట్టమనేని శివరామకృష్ణ.. అంటే ఎవరని కంగారు పడొచ్చు.. కానీ సూపర్ స్టార్ కృష్ణ అంటే మాత్రం తెలుగు సినీ పరిశ్రమలోని ఓ ప్రకాశవంతమైన సాహసి ప్రయాణం గుర్తువచ్చి తీరుతుంది. ఆ సాహసవంతుడి ముద్దు బిడ్డ మహేష్ బాబు. చిన్నతనంలో కొన్ని సినిమాల్లో మెరిసి.. కొన్ని సినిమాల్లో తానే నాయకుడిగా వసూళ్ల వర్షం కురిపించి.. చదువుకోసం తాత్కాలిక విరామం తీసుకున్నారు మహేష్.

మళ్లీ తెలుగు తెరకు ఓ 'రాజకుమారుడి' అవసరం కచ్చితంగా ఉందనిపించింది.. వచ్చాడు. అంతే.. ఇక తానే 'యువరాజు' అయిపోయాడు. తండ్రి సూపర్ స్టార్ స్టేటస్ ను నిభాయిస్తూ.. అభిమానుల ఆశల పల్లకినీ మోస్తూ.. కసిగా ఒక్కో మెట్టూ ఎక్కాడు. తడబడిన చోట ఆగి.. సాగాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వేలెత్తి చూపించే పరిస్థితి తేలేదు. ఒక్కడుగా వచ్చి.. తెలుగు సినీ ప్రపంచంలో 'అర్జును'డై.. అభిమానులనే కాదు తెలుగు ప్రేక్షకులందరి మనసుల్నీ దోచిన 'మురారి'గా.. కుటుంబ బంధాలలో 'శ్రీమంతుడి'గా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. 'నిజం' కాలుస్తున్నా.. 'ఖలేజా'తో సినీ ప్రపంచంలో 'దూకుడు'గా సాగుతూ వసూళ్ల 'బిజినెస్ మేన్' గా 'ఆగ'కుండా ప్రేక్షకులకు వినోదాల 'బ్రహ్మోత్సవాన్ని' విలువల సందేశాలతో చుట్టి ఇస్తున్నాడు 'అతడు.'

ఇటు తండ్రి సూపర్ స్టార్ వారసత్వాన్ని ప్రేక్షకుల అభిమానంతో గెలుచుకున్న మహేష్ బాబు.. అటు కుటుంబ బంధాల్లోను ఆదర్శంగా నిలిచాడు. 'సరిలేరు నీకెవ్వరూ' అనిపించుకున్న ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇందుస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ పోకిరీ!

సూపర్ స్టార్ రెండో వైపు..

తన సంపాదనలో 30 శాతం మహేష్ బాబు సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తారనే విషయం ఎవరికీ తెలీదు. ఎందుకంటే, ఆయన ఈ విషయంలో పబ్లిసిటీని ఇష్టపడరు. తమ స్వగ్రామమైన బుర్రిపాలెం ను దత్తత తీసుకుని అక్కడ అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. హీల్ ఎ చైల్డ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడార్ గా 2013 నుంచి వ్యవహరిస్తున్నారు. ఇది అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల వైద్య చికిత్స కోసం తల్లిదండ్రులకు ఆర్థిక సహాయాన్ని అందించే సంస్థ. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాల్లో మహేష్ సహాయం చేస్తూనే ఉంటారు.

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం తో నటుల బాధ్యత తీరిపోదు. తమను ఆరాధించే అభిమానులకు ఆదర్శప్రాయంగా మెలగాల్సిన బాధ్యత కూడా వారికి ఉంటుంది. అందులో కూడా సూపర్ హిట్ కొట్టేశారు మహేష్ బాబు.

సినీ వినీలాకాశంలో మరిన్ని ఉత్తమ తారల్ని మహేష్ బాబు జత చేయాలనీ.. వాటి తళుకుల మధ్య అభిమానులు జరుపుకునే మరిన్ని సంబరాలలో మహేష్ జీవితం వెలుగులు నింపుకోవాలనీ హెచ్ ఎంటీవీలైవ్ కోరుకుంటోంది.


Next Story