సంక్రాంతి సినిమా పందెం.. మహేష్ పట్టాడా? బన్నీ కొట్టాడా?

సంక్రాంతి సినిమా పందెం.. మహేష్ పట్టాడా? బన్నీ కొట్టాడా?
x
Highlights

సినిమా అభిమానులు పండగ మొదలెట్టేశారు. రెండు రోజుల ముందుగానే తెలుగు సినిమా క్రాంతి పలకరించేసింది తెలుగు ప్రజలను. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ 11న...

సినిమా అభిమానులు పండగ మొదలెట్టేశారు. రెండు రోజుల ముందుగానే తెలుగు సినిమా క్రాంతి పలకరించేసింది తెలుగు ప్రజలను. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ 11న పలకరించేశారు. ఇక ఈరోజు 12న వైకుంఠపురం చూపిస్తానని 'అల వైకుంఠపురములో' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు బన్నీ. రెండూ ప్రత్యేకమైన సినిమాలే. సరిలేరు నీకెవ్వరు కేవలం 5 నెలలో మహేష్ కెరీర్ లోనే అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న సినిమా. అల వైకుంఠపురములో దాదాపు సంవత్సరమున్నర తరువాత అల్లు అర్జున్ చేసిన సినిమా. రెండూ వేర్వేరు సినిమాలు. కానీ, ఒకే సారి విడుదల కోసం పోటీ పడ్డ అగ్రతారల సినిమాలు. దీంతో, ఏ సినిమా ఎలావుంటుందో అనే ఆసక్తి ఆయా హీరోల అభిమానుల్లోనే కాకుండా.. తెలుగు సినీ ప్రేమికులందరిలోనూ నెలకొంది.

రెండు సినిమాలూ విడుదలయ్యాయి. మహేష్ మాస్ హిట్టు కొట్టాడంటున్నారు అయన అభిమానులు. క్లాసికల్ హిట్ కొట్టారంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అయితే, రెండూ మాస్ సినిమాలే. లాజిక్ లేకుండా కేవలం మాస్ ఎలిమెంట్స్ నమ్ముకుని తీసిన సినిమాలే. మహేష్, బన్నీ ఇద్దరూ హిట్ కొట్టాలన్న కసితో.. తమ ఇమేజి చట్రంలోనే సినిమాలు చేశారు. దర్శకులు ఇద్దరూ కూడా సరిగ్గా ఆ కోణంలోనే ఆలోచించి సినిమా తీసారు. రెండు సినిమాల గురించి ఒక్కసారి చూస్తె..

సరిలేరు నీకెవ్వరు..


అనిల్ రావిపూడి అపజయం లేని దర్శకుడు. ఎంత పెద్ద ఇష్యూని అయినా సరే, కామెడీతో ముడిపెట్టగల సమర్ధుడు. ప్రేక్షకులను కుర్చీలో కూర్చోకుండా నవ్వించగల నేర్పరి. అయితే, ఇప్పటివరకూ పెద్ద హీరోతో సినిమా చేయలేదు. కానీ, ఎఫ్2 తో వెంకటేష్ కి మంచి హిట్ ఇచారు. దాంతో మహేష్ బాబు అనిల్ ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేతిలో పెట్టారు. అయితే, త్వరగా సినిమా పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. ఇంకేముంది.. అనిల్ తన మార్కును కొంచెం పక్కన పెట్టి మహేష్ కి మాస్ హిట్టిస్తానని చెప్పిమరీ ఐదు నెలలలో సినిమా పూర్తి చేశారు.

సరిలేరు నీకెవ్వరు పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక సినిమాలో పెద్దగా చెప్పుకునేంత కథ ఏమీ లేదు. సదా సీదా అతి పాత కథ ఇది. ఒక హీరో.. కష్టాలలో ఉన్న ఒక నిజాయతీ పరురాలైన మహిళ.. అనుకోకుండా ఆమెను కల్సి ఆ ఇబ్బందుల నుంచి బయట పాడేయడం.. మధ్యలో విలన్లు.. తన్నులాటలూ.. హీరోయిన్ అందాల ఆరబోతలూ.. ఇంతే సినిమా కథ. దానికి ఓ మిలటరీ బ్యాక్డ్రాప్ సృష్టించారు అనిల్. ఇక్కడే కొద్దిగా ప్రేక్షకులకు కొత్తదనం కనిపించింది. (ఇంతకు ముందు ఇటువంటి సినిమాల్లో హీరో పోలీసు అధికారో..లాయరో ఇలాంటి వృత్తుల్లో వుండేవారు. మిలటరీలో పనిచేసిన హీరో అనే కాన్సెప్టు చాలా తక్కువ సినిమాల్లో ఉంది. పైగా మహేష్ బాబు ఇప్పటివరకూ ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు) ఇక ఇప్పుడు జబర్దస్త్ మార్క్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. దానికి తన మార్కు మేనరిజం జర్క్లు జతచేసి ఓ నలభై నిమిషాల పాటు నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంటర్వెల్ లో పెద్ద యాక్షన్ సన్నివేశంతో ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఆ తరువాత సీరియస్ గా సినిమాని నడిపించి.. కొన్ని ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకుల గుండె తడి చేసి.. చివరికి చిన్న సందేశం ఇచ్చి ముగింపు పలికారు. ఈ మొత్తం మహేష్ బాబు చుట్టూ తిప్పి మహేష్ లోని కామెడీ టైమింగ్.. సీరియస్ యాక్షన్ రెండిటినీ సరిగ్గా వాడుకున్నారు. ఈ మసాలా సరిపోదనిపించి విజయశాంతిని కీలక పాత్రకు తీసుకుని సినిమా పై అంచనాలు పెంచారు. చివరికి అంచనాలు అందుకున్నారు.

అల వైకుంఠపురములో..


త్రివిక్రమ్ గురించి చెప్పెపనే లేదు. మాటలతో మూడు గంటల పాటు విషయం లేకపోయినా సినిమా చూపించేయగల సమర్ధుడు. అయన ఇప్పటివరకూ చేసిన సినిమాల నుంచి కొన్ని సీన్లను తీసి.. రెండు గంటల సినిమాగా కలిపి చూపించినా ప్రేక్షకులు కదలకుండా చూసేస్తారు. అదీ ఆయన ప్రతిభ. దానికి రుజువు యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉండే ఆయన సినిమాల బిట్ లే చెబుతాయి. ఆయన పాత సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే కళ్ళప్పగించి చూసే ప్రేక్షకులు ఉన్నరాయనకు. అటువంటి అయన సినిమాల్లోనూ కథ గురించి పెద్దగా ఏమీ ఉండదు. కానీ, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తారు. మాటలతో సన్నివేశాలు గుందేల్లో దూసుకు పోయేలా చేస్తారు.

అల వైకుంఠపురములో పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సినిమా కథ కూడా చాలా పాతదే. హీరో మధ్యతరగతి కుర్రాడు.. హీరోయిన్ బాగా రిచ్. ఆమె దగ్గరే పనిచేస్తాడు హీరో. అనుకోకుండా ఒక పెద్ద ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇంటి పేరే వైకుంఠపురము. ఆ ఇంటి పెద్దాయన సమస్యల్ని హీరో భుజం మీద వేసుకుని ఆ సమస్యలు తీర్చెస్తాడు. ఇంతే. కానీ ఈ ఇంతనే ఎంతో చేశారు త్రివిక్రమ్. అయన మాటల్లో చెణుకులు.. కథానాయికల్ని చూపించే విధానం.. పాత్రల మధ్య మాటలతో ముడివేసిన దారాల సన్నివేశాలు. ఇక వీటన్నిటిని మించి తమన్ సంగీతం. దానికి బన్నీ డ్యాన్స్ లు.. మొత్తం కలసి ..పండగకి అరిశెలు..బొబ్బట్లు తింటూ కోడిపందేల్లో గెలిచిన కోడిని చంకన పెట్టుకుని.. ఓడిన కోడి మాంసాన్ని చేతితో పట్టుకుని.. ఇంటికి వెళితే ఇంట్లో ఉన్న బంధు మిత్ర సపరివారమంతా చుట్టూ చేరితే.. వాళ్ళకి తన కోడి పందెం ఎలా కొట్టిందన్న విషయాన్ని చెబుతుంటే.. అందరూ తన్మయులై విన్నంత సంబరంగా అల వైకుంఠపురములో సినిమా ఉంది.

ఎవరు కొట్టారు?

ఈ సంక్రాంతి ఇద్దరిదీ. అవును.. పందెంలో ఏదో ఒక కోడే గెలుస్తుంది. కానీ, ఈ సినిమా పందెంలో రెండు సినిమాలూ పండగ చేశాయి. అభిమానులు ఎవరికీ వారుగా మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అని అనొచ్చుగాక. ఈ రెండు సినిమాలూ మాస్ సినిమాలు అయినా.. రెండిటి దారీ వేరే. ''బరి బయట నిలబడి కోడి పందాలని చూస్తున్న అనుభూతి ఓ సినిమాడైతే.. తెల్లవారుజాము చలిలో భోగిమంటల వెచ్చదనాన్ని చూపించే సినిమా ఒకటి. పిండివంటలు తిని ముత్యాల ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల దగ్గర ఆటలాడుతున్న అనుభూతి ఒక సినిమా పంచితే.. కనుమ పండగ రోజు కోడిపలావు తిని.. సాయంత్రం పల్లె అందాలలో నడుచుకుంటూ వెళితే ఉండే ఆనందాన్ని పంచే సినిమా ఒకటి''. ఏ సినిమా ఏ అనుభూతిని పంచింది అనే విషయం సినిమా చూసిన ప్రేక్షకుడి అభిరుచిని బట్టి మారుతుంది. తెలుగు సినిమాకి ఈ సంవత్సరం ప్రారంభం మొత్తం పండగే అయింది. ప్రేక్షకులకు కూడా పండగలాంటి సినిమాలు కనువిందు చేస్తున్నాయి.

చివరగా ఓ మాట..మహేష్ బాబు..బన్నీ ఇద్దరూ సినిమా విడుదల విషయంలో రాజీ పడకుండా..పోటా పోటీగా వినోదాల విందును ప్రేక్షకులకు ఇచ్చారు. అందుకే పోటీ మంచిదే. అసలు పోటీ లేకపోతె మజా ఎక్కడుంటుంది చెప్పండి? అది కోడి పందెం అయినా.. సినిమా అయినా..! తెలుగు ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని పంచి సంక్రాంతి హీరోలుగా ఇద్దరూ నిలబడ్డారు. కాదు.. త్రివిక్రమ్..అనిల్ రావిపూడిలు నిలబెట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories