Ala Vaikunthapurramloo movie review : ఇది త్రివిక్రమ్ మార్క్ బన్నీ సినిమా!

Ala Vaikunthapurramloo movie review : ఇది త్రివిక్రమ్ మార్క్ బన్నీ సినిమా!
x
Highlights

కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభం కాగానే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ ఆసక్తిని విడుదల వరకూ అలానే ఉంచే సినిమాలు తక్కువగా ఉంటాయి. దానిని కొనసాగిస్తూ.....

కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభం కాగానే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ ఆసక్తిని విడుదల వరకూ అలానే ఉంచే సినిమాలు తక్కువగా ఉంటాయి. దానిని కొనసాగిస్తూ.. సినిమా విడుదల తేదీనాటికి ఆసక్తి సినిమాని కచ్చితంగా చూడాల్సిందే అనేవిధంగా ప్రేక్షకులపై బలంగా ముద్ర వేసే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అటువంటి సినిమాయే త్రివిక్రమ్..అల్లు అర్జున్ ల అల వైకుంఠపురములో.. ఐదు కారణాలున్నాయి ఈ ఆసక్తి వెనుక. మొదటిది అల్లు అర్జున్ చాలా కాలం తరువాత తెరమీదకు రావడం.. రెండు త్రివిక్రమ్ దర్శకత్వం..మూడు వీరిద్దరి కాంబినేషన్! ఇవి సినిమా పై ఆసక్తి కలిగిస్తే సినిమా సంగీతం ఆసక్తిని కాస్తా ఆరాటం స్థాయికి తీసుకు వెళ్ళింది. ఇక విడుదల సమయానికి వదిలిన ట్రైలర్లు..టీజర్లు..వీడియో సాంగ్స్ అంతకు మించి సినిమా కచ్చితంగా చూడాల్సిందే అనే స్థాయికి తీసుకువెళ్ళిపోయాయి. ఇంత హైప్ వచ్చిన అల వైకుంఠపురములో సినిమా థియేటర్లను సంక్రాంతి కానుకగా ఈరోజు పలకరించింది. ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాల్లో సినిమా ప్రదర్శనలు మొదలైపోయాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం తొలి ఆటలు కొద్ది సేపటి క్రితమే ముగిసాయి. ఇక పండగ సినిమాగా వచ్చ్చిన ఈ వైకుంఠపురము లోకి వెళ్లి ఎలా ఉందో తెలుసుకుందామా?

ఒక్క మాటలో ఇది త్రివిక్రమ్ సినిమా. మరో మాటలో ఇది బన్నీ, త్రివిక్రమ్ ల సినిమా అంతే! ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవాలంటే, సినిమా కథ, కథనం ఇలా వరుస విశేషాల్లోకి వెళ్ళాల్సిందే!

కథ ఇదీ..

అనగనగా ఒక మధ్య తరగతి కుర్రోడు.. పేరు బంటు..జీవితం మీద విపరీతమైన ఆశలు.. ఈ కుర్రోడు ఓ అందాల భరిణె యాజమాన్యంలోని ఓ కంపెనీలో ఉద్యోగంలోకి చేరతాడు. అక్కడ ఆ ముద్దుగుమ్మకు ఈ యువకుడికి మధ్యలో ప్రేమ పుడుతుంది. కట్ చేస్తే.. వైకుంఠపురము ఓ పెద్దింటి భవనం.. ఈ వైకుంఠపురము లోకి బంటు వెళతాడు. ఆ పురానికీ.. బంటు కు మధ్య సంబంధమేమిటి? మనోడు అక్కడకు వెళ్లి ఏం చేశాడు? అసలు ఆ ఇంట్లో ఉన్నవారి సమస్యలేమిటి? ఆ సమస్యలకూ ఈ యువకుడికీ మధ్య సంబంధం ఏమిటీ? ఆ సమస్యలను ఈయన ఎలా పరిష్కరించాడు? ఆ నేపధ్యంలో ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ 'అల వైకుంఠపురములో..'

ఎలా ఉందంటే..


త్రివిక్రమ్ సినిమాలో కథ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. అది అంతర్లీనమే! ఇక ఈ సినిమాకి కథనమే ప్రధానం. అదీ హీరో చుట్టూ అల్లుకున్న కథనం. త్రివిక్రమ్ మాటల తూటాలకు సరిపడే కథనం ఇది. సినిమాని మొదటి భాగం.. రెండో భాగం అని విడగొట్టకుండా చెప్పుకుంటే.. ఇది పూర్తిగా అల్లు అర్జున్ మూసలో పోసిన త్రివిక్రమ్ ఫార్ములా. సినిమా మొదట్నుంచీ తెరమీద అల్లు అర్జున్ కనిపిస్తే..తెరంతా త్రివిక్రమ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. సరదా సన్నివేశాలు.. వాటిలో ఉండే అనుబంధాల గుబాళింపులు. పాత్రకీ పాత్రకీ మధ్య త్రివిక్రమ్ వేసిన మాటల దారాలు.. వీటి మధ్యలో వచ్చే స్టైలిష్ పాటలు.. అక్కడక్కడ మెరిపించిన యాక్షన్. ఇంతే సినిమా. ఇంటిల్లపాదీ సరదాగా చూసేలా పాత సినిమాలలో ఉండే భావుకతను ఆధునికశైలిలో త్రివిక్రమ్ అల్లాడు. తండ్రీ కొడుకుల బంధం.. వాటి మధ్య భావోద్వేగం.. తన మటల మూటలలో బంధించి వాటిని తెరమీద విప్పి చూపించాడు త్రివిక్రమ్. బన్నీ ఆ మాటల బలాన్ని తన నటనతో మరింత పదునుగా తెరమీద ఆవిష్కరించాడు. అందుకే ఇది ఈ ఇద్దరి సినిమా అయింది. ఈ సాగదీత.. మొదటి భాగం బావుంది..రెండో భాగం బాలేదు.. రెండో భాగంలో కామెడీ లేదు..మొదటి భాగంలో ఎమోషన్ లేదు ఇలాంటి మాటలు పక్కన పెట్టి చెప్పుకోవాలంటే, సినిమా మొత్తంగా ఇంటిల్లపాదీ హాయిగా పండగ చేసుకోవచ్చు. జబర్దస్త్ కామెడీ స్కిట్లలాంటి కామెడీ అగ్రహీరోల సినిమాల్లో చొప్పించి సినిమా విజయం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో సుతి మెత్తని మాటలతో.. సునిశిత హాస్యాన్ని అందిస్తూ కథనాన్ని నడిపించారు. అదే ఈ అల వైకుంఠపురములో ప్రత్యేకత!

ఎవరెలా చేశారంటే..

అల్లు అర్జున్ స్టైల్!


అల్లు అర్జున్ సినిమాని మొత్తం మోశాడు. తన కూల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో స‌న్నివేశాల్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లాడు. అసలు ఈ సినిమా త్రివిక్రమ్ రాసిందే బన్నీ కోసం కదా.. అందుకే బన్నీ సినిమా మొత్తం త్రివిక్రమ్ మాటల్ని మోస్తూ తనదైన స్టైల్ లో మెరిపించాడు.

పూజాహెగ్డే..


హీరోయిన్ గా చెప్పుకోదగ్గ పాత్ర దొరికింది. త్రివిక్రమ్ సినిమాలో కచ్చితంగా హీరోయిన్ లను అందంగా ఆహ్లాదంగా చూపిస్తారు. ఇక పూజా హెగ్డే కూడా ఆ చట్రంలో ఇమిడిపోయింది. బన్నీ తో రెండోసారి జతకట్టిన ఈ భామ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.

టబు..


త్రివిక్రం సినిమాలో ఇటువంటి ఒక పాత్ర ఉందంటే చాలా బలంగా చూపిస్తారు. కానీ, ఈ సినిమాలో టాబుకు అంత ప్రాధాన్యం లేదు. దాంతో టబు పెద్దగా చేయడానికి ఏమీ లేదు.

ఇక సునీల్, సుశాంత్..ఇద్దరూ అక్కడక్కడ కొద్దిగా మెరుపులు మెరిపించినా.. ప్రధానంగా వారివి సినిమాలో అంత బలమైన పాత్రలు కావు. మరో ముఖ్య పాత్ర మురళీశర్మది. మధ్యతరగతి తండ్రిగా మురళీశర్మ చాలా బాగా చేశారు.మిగిలిన వారంతా సినిమాలో తమదైన శైలిలో అలరించారు.

పాటలు ఎలా ఉన్నాయంటే..


తమన్ సంగీతం మొందే చెప్పుకున్నట్టు సినిమా పై ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అన్ని పాటలూ చాలా బావున్నాయి. ఇక వాటి చిత్రీకరణ.. మరో లెవెల్ లో ఉంది. పాటలకు వేసిన సెట్స్, డ్యాన్స్ కంపోజింగ్ అసలు పాటలను మరింత పై స్థాయికి తీసుకు వెళ్ళాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ.. రాములో రాములా.. సామజవరగమనా.. ఈ పాటల్ని చూసే కొలదీ చూడాలనిపించేలా తీశారు.. చేశారు.

సాకేతికంగా అన్ని విధాలుగానూ సినిమా బానే ఉంది. నిర్మాణ విలువలకు పేరుపెట్టే పనిలేదు.

పంచ్ లైన్ : మొత్తమ్మీద ఇది త్రివిక్రమ్ బన్నీతో కల్సి చూపించిన నాన్నారింటికి దారేదీ!


గమనిక: ఇది విశ్లేషకుడి దృష్టి కోణం నుంచి రాసిన విశ్లేషణ. దీనిలోని అభిప్రాయాలు విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయలు మాత్రమె!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories