బిగ్ బాస్ ఎపిసోడ్ 18 హైలైట్స్: తిట్టుకోవడం.. కొట్టుకోవడం..రచ్చ రచ్చ..

బిగ్ బాస్ ఎపిసోడ్ 18 హైలైట్స్: తిట్టుకోవడం.. కొట్టుకోవడం..రచ్చ రచ్చ..
x
Highlights

♦ వైలెంట్ గా మారుతోన్న బిగ్ బాస్ సీజన్ 3 ♦ వినోదం లేని ఎపిసోడ్ ♦ శృతి మించుతోన్న దూషణల పర్వం ♦ రోదనలు కొట్లాటలతో సాగిన ఎపిసోడ్ 18

బిగ్ బాస్ 3 వైలెంట్ గా మారుతోంది. క్రమేపీ హౌస్ మేట్స్ ఒకరిని ఒకరు తిట్టుకోవడం.. చేతులు లేపుకోవడం వరకూ పరిస్థితి వెళ్ళింది. మంగళవారం తమన్నా విపరీత పోకడలతోనే ప్రారంభమైన గందరగోళం మరింత పీక్స్ కి చేరింది. వ్యక్తిగత దూషణల పర్వం ఊపందుకుంది. వినోదం పాలు తగ్గి వెగటు పాలు ఎక్కువైంది.

బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ కాస్తా కొట్లాటల టాస్క్ గా మారిపోయింది. మరీ సైలెంట్ గా హౌస్ మేట్స్ ఉంటున్నాట్టు భావించినట్టున్నాడు బిగ్ బాస్.. అందరి మధ్యలో కొట్లాటలు పెట్టడానికే ఈ టాస్క్ పెట్టినట్టు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా దొంగ పోలీసు ఆట పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్ కొంత నిధి ఇచ్చాడు. దానిని కాపాడుకోవడమే టాస్క్. శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి దొంగలు.. వరుణ్, రాహుల్, వితిక, తమన్నా, మహేశ్ బ్యాచ్ నిధిని కాపాడుకోవాలి. ఇక బాబా భాస్కర్, శివజ్యోతి పోలీసులు కాగా, హిమజ లాయర్. ఇక వీరి మధ్య ఆట మెల్లగా ప్రారంభమై రక్తాలు కారేవరకూ వెళ్ళింది.

శ్రీముఖి తెలివి..

సొమ్ము కాజేయడమే దొంగల పని. బిగ్ బాస్ ఓ ఖజానా బాక్స్ ఇచ్చాడు. దొంగలు కాజేసిన సొమ్ము అందులో దాచుకోవాలి. అది ఇంకెవరూ అంటుకునే అవకాశం ఉండదు. దీంతో వరుణ్ ని మెల్లగా మాటల్లో పెట్టి అటు తిప్పి, ఇటు తిప్పి తన దగ్గర ఉన్న సొమ్ముని కాజేసి ఖజానాలో పాడేసింది శ్రీముఖి. దీంతో షాక్ అవడం వరుణ్ వంతు అయింది. సరదాగా మాట్లాడుతూ ఎంత పనిచేసింది అని అనుకున్నారు అందరూ. ఇక్కడి వరకూ గేమ్ సరదాగా సాగింది. ఇక ఇక్కడనుంచి రచ్చ మొదలైంది.

హిమజ జేబులో అలీ చెయ్యి..

అలీ డబ్బుల కోసం హిమజ జేబులో చేయి పెట్టాడు. అంతే.. హిమజ అలీని కాలితో ఒక్కటిచ్చుకుంది. నన్ను నువ్వు ఎందుకు టచ్ చేసావంటూ కేకలు వేసింది. టచ్ చేస్తే తన్నుతావా అంటూ అలీ హిమజ మీదకు వెళ్ళాడు. నా బాడీ లాంగ్వేజ్ అంతే అంటూ హిమజ మొదట గట్టిగా చెప్పింది. కానీ, తరువాత నేను కావాలని తన్నలేదు.. అంటూ సారీ చెప్పింది. అయినా అలీ వినకుండా నన్ను తాన్నుతావా అంటూ ఆమె వ్యక్తిగత జీవితం గురించి గట్టిగా మాట్లాడాడు. దాంతో హిమజ అతని కాళ్ళు పట్టుకుని సారీ చెప్పింది. అయినా, అలీ శాంతించలేదు.. మరింత రెచ్చిపోయాడు. నిన్ను నేను కాళ్ళు పట్టుకోమన్నానా అంటూ మరోసారి కేకలు వేశాడు. దాంతో హిమజ బాత్రూం కి వెళ్లి భోరున ఏడ్చింది. ఇదిలా ఉంటే తమన్నా, హిమజ తరఫున అలీ మీదకు యుద్దానికి వెళ్ళింది. ఆడపిల్ల.. సారీ చెప్పినా, కాళ్ళు పట్టుకున్నా వదలవా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావ్ అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయింది. అలీ కూడా తమన్నా పైకి దూసుకు వెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాంతో తమన్నా మీదకి వస్తున్నావెంటి అంటూ తిట్లు అందుకుంది. కొద్ది సేపటి తరువాత హిమజ అలీతో మళ్ళీ ఈ విషయంపై మాట్లాడి క్లారిటీ ఇచ్చింది. దీంతో వారి గొడవ అప్పటికి సర్దుమణిగింది.

తెగిన రవికృష్ణ చేయి..

నిధిని కాజేయడానికి ఈసారి శ్రీముఖి కొత్త ప్లాన్ వేసింది. ఎటాక్ చేస్తేనే నిధిని కొల్లగొట్టగలం అని తన బృందానికి చెప్పింది. డంబుల్ తీసుకుని.. నిధిని కొల్లగొట్టేందుకు వెళ్ళింది. అక్కడ..వరుణ్, వితికా, మహేష్ నిధిని కాపాడుకోవడానికి దాని చుట్టూ ఉన్నారు. ఇంతలో అకస్మాత్తుగా శ్రీముఖి నిధి ఉన్న అద్దాల బాక్స్ ని దంబెల్ సహాయంతో బద్దలు కొట్టింది. మరో పక్క రవికృష్ణని కూడా అద్దాలు పగలగొట్టమని చెప్పింది. రవికృష్ణ తన చేతితో అద్దం పగుల కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో అతని చేయి తెగింది. అంతే....హౌస్ మొత్తం ఏకమై శ్రీముఖిని నిందించడం మొదలు పెట్టారు. ఫాల్తూది అంటూ వరుణ్ తిట్టాడు. ఇక వితికా భోరున ఏడ్చి పెద్ద సీన్ చేసింది.

ఇలా ఎపిసోడ్ అంతా తిట్లు.. ఏడ్పులు.. కొట్లాటలతో సాగింది. వయోలెంట్ ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలని బిగ్ బాస్ ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. కానీ, ఇది ప్రేక్షకులకు అంతగా పట్టడం లేదు. ప్రస్తుతం సినిమాల్లోనే యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఇక ఇటువంటి గేమ్ షో లో ఇటువంటి రచ్చ ఎలా చూస్తారు? వరుసగా రెండు ఎపిసోడ్ లు హౌస్ లో వినోదాన్ని పూర్తిగా దూరం చేశాయి. రెండు ఎపిసోడ్ లు గోల గోలగా సాగాయి. ఇక రక్తాలు కారే లెవెల్ కి షో వెళ్ళిపోవడం ఇక ముందు ముందు ఎంత దారుణంగా ఉంటుందో అని ప్రేక్షకులు భావిస్తే వారి తప్పుకాదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories