మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ప్రపంచం?

Will Russia Ukraine Conflict Cause Third World War
x

మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ప్రపంచం?

Highlights

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం చిలికి చిలికి ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం చిలికి చిలికి ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధంతో రష్యా సైనికులు నీరసించిపోతున్నారు. ఈ నేపథ్యంలో మాస్కో అణుదాడికి సిద్ధమవుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పోలాండ్‌ పర్యటన అదే రోజు బ్రిటన్‌ వార్‌హెడ్లను బయటకు తీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. రష్యా దాడులు 27వ రోజుకు చేరుకుంది. అయినా ఉక్రెయిన్‌ను మాత్రం రష్యా ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోయింది. దక్షిణాదిలోని కీలకమైన వాణిజ్య నగరం మారియూపోల్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టింది. ఇప్పటికీ ఆ నగరాన్ని రష్యా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయింది. నగరంలోని నివాస ప్రాంతాలపై రష్యా దాడులు నిర్వహించింది. దాదాపు నగరమంతా శిథిలాలతో దర్శనమిస్తుంది. అయితే ఉక్రెయిన్‌ సైన్యం మాత్రం ధీటుగా పోరాడుతోంది. లొంగిపొమ్మని రష్యా సైన్యం ఆదేశిస్తున్నా ఉక్రెయిన్‌ సైన్యం మాత్రం నగరాన్ని వదులుకునేందుకు సిద్ధపడడం లేదు.

ఉక్రెయిన్‌లోకి చొచ్చుకువస్తున్న రష్యా సైన్యం రోజు రోజుకు నీరసిస్తోంది భూమార్గంలో లక్ష మందికి పైగా సైన్యం ఉక్రెయిన్‌ భూభాగంలోకి ప్రవేశించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను దాటి ముందుకు రాలేకపోయింది. కీవ్‌కు 40 కిలోమీటర్లలోనే నిలిచిపోయింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా సైన్యానికి సరైన అవగాహన లేదు. మరోవైపు మ్యాపింగ్‌ అవకాశాన్ని కూడా కోల్పోయాయి. దీంతో నగరాలవైపు చొచ్చుకువెళ్లడానికి రష్యా సైన్యానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే అదునుగా ఉక్రెయిన్‌ సైన్యం విరుచుకుపడుతోంది. నగరాలవైపు రాకుండా రష్యా సైన్యాన్ని నిలువరిస్తోంది. ఉక్రెయిన్‌ సైన్యం తీవ్ర ప్రతిఘటనతో రష్యా సైన్యం రోజు రోజుకు నీరసించిపోతోంది. నగరాల్లో పోరాడే అనుభవం లేకపోవడంతో ఢీలా పడుతోంది. అంతేకాకుండా ఇప్పటివరకు 14వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్టు ఉక్రెయన్‌ చెబుతోంది. రష్యా లాంటి పెద్ద దేశానికి ఇది భారీ దెబ్బ. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్‌లో అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై అణుదాడికి రష్యా సిద్ధమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇదివరకు హెచ్చరించారు. దీంతో పుతిన్‌ అణుదాడికి దిగే ప్రమాదం ఉందని ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉన్న పొలాండ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ వారం పర్యటించనున్నారు. పోలాండ్‌ రాజధాని వార్సాలో ఆ దేశ అధ్యక్షుడితో బైడెన్‌ బేటీ కానున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా, మిత్ర దేశాలు అందించే సాయంపై చర్చించడానికే అని పైకి చెబుతున్నా అంతర్గతంగా మాత్రం పుతిన్‌ దూకుడు, అణుదాడి వంటి అంశాలపైనే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

బ్రిటన్‌ అణువార్‌ హెడ్లను బయటకు తీసింది. రీడింగ్‌ పట్టణ సమీపంలోని బర్‌ఫీల్డ్‌ గ్రామంలోని అణు కేంద్రం నుంచి అణువార్‌హెడ్లను స్కాట్లాండ్‌లోని కోల్‌పోర్టులోని నౌకాదళ ఆయుధ డిపోకు బ్రిటన్‌ ఆర్మీ తరలించింది. బ్రిటన్‌ అణువార్‌హెడ్‌లను బయటకు తీయడం.. రష్యా అణుదాడి అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. పుతిన్‌ అణుదాడికి పాల్పడితే ఊరుకునేది లేదనే సంకేతాలు ఇచ్చేందుకు బ్రిటన్‌ అణువార్‌ హెడ్‌లను బయటకు తీసినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాటో కూటమిని భయపెట్టేందుకు పుతిన్‌ తేలికపాటి అణ్వస్త్రాలను ప్రయోగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు,. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌ అణువార్‌హెడ్లను సన్నద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

రష్యా అణుదాడికి దిగే అవకాశం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఐరోపా దేశాలు ఇప్పటికైనా ఉక్రెయిన్‌ను నో ఫ్లైజ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు పుతిన్‌తో చర్చలకు సిద్ధమని కూడా ప్రకటించారు. సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని కూడా జెలెన్‌స్కీ తెలపడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories