Donald Trump: బర్త్ రైట్ సిటిజెన్‌షిప్ రద్దు చెల్లుతుందా?


Donald Trump: బర్త్ రైట్ సిటిజెన్‌షిప్ రద్దు చెల్లుతుందా?
ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే వచ్చే నష్టం ఏంటి? ఈ నిర్ణయంతో భారతీయులపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది?
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు జన్మత: వచ్చే పౌరసత్వం బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ను రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు వేర్వేరుగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశాయి. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కోర్టును కోరారు. అయితే అగ్రరాజ్యాధినేత తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు కావడం అంత ఈజీ కాదని లీగల్ నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే వచ్చే నష్టం ఏంటి? ఈ నిర్ణయంతో భారతీయులపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? ట్రంప్ ఆర్డర్ జారీ చేసినా అమలుకు ఇబ్బందులుండవా? ఈ ఆర్డర్ అమలు సాధ్యమేనా? ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాల గురించి ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
బర్త్‌రైట్ సిటిజన్ షిప్ అంటే ఏంటి?
అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరులే. అగ్ర రాజ్యానికి వలస వచ్చిన పిల్లలకు కూడా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ను అందించేందుకు వీలుగా 1868లో 14వ రాజ్యాంగ సవరణ చేశారు. దీంతో అక్కడ పుట్టిన పిల్లలంతా అమెరికా పౌరులే. అంటే ఉద్యోగం కోసం వెళ్లిన భార్యభర్తలకు అక్కడ గ్రీన్ కార్డు లభించకపోయినా ఆ దంపతులకు పుట్టిన పిల్లలు మాత్రం అమెరికా పౌరులే. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకొని పిల్లల్ని కనేందుకే అమెరికా వెళ్లే జంటలు కూడా ఉన్నాయనే చర్చ కూడా ఉంది. దీన్ని బర్త్ టూరిజంగా కూడా పిలుస్తారు. దీన్ని కంట్రోల్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం కొన్ని పద్దతులను అమలు చేస్తోంది. పిల్లలను కనేందుకు వచ్చేవారికి వీసా రూల్స్ ను మరింత కఠినతరం చేసింది. అమెరికాలోనే డెలీవరీ కోసం ఎందుకు వస్తున్నారో బలమైన కారణం చెప్పడంతో పాటు అందుకు సంబంధించిన ఆర్ధిక స్థోమత ఉందని నిరూపించుకోవాలి. ఇది నమ్మితేనే అమెరికా అధికారులు వీసా మంజూరు చేస్తారు.ఇలా ఇచ్చే వీసాను బి వీసా అంటారు.
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెబుతోంది?
ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారంగా అమెరికాలో పుట్టిన పిల్లలకు తల్లి లేదా తండ్రి అమెరికా పౌరుడై ఉండాలి. లేదా గ్రీన్ కార్డు హౌల్డరై ఉండాలి. అలా ఉన్న దంపతులకు పుట్టిన పిల్లలకే ఆటోమెటిక్ అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇదే ట్రంప్ తెచ్చిన కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ ఆర్డర్ అమల్లోకి వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలకు పాస్ పోర్టులు, సామాజిక భద్రతా నెంబర్లతో పాటు అమెరికా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను అందవు. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ను దుర్వినియోగం చేశారని.. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్ఢర్ తేవాల్సి వచ్చిందని ట్రంప్ వర్గం వాదన. ఈ ఆర్డర్ కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకపోతే నెల రోజుల్లోనే అది అమల్లోకి రానుంది.
ట్రంప్ నిర్ణయంతో భారతీయులపై ఎఫెక్ట్ ఎంత?
అగ్ర రాజ్యంలో భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఓటములను ఇండియన్లు ప్రభావం చూపుతారనే విశ్లేషణలున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో భారత్ నుంచి వలస వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్న ఇండియన్లను ప్రసన్నం చేసుకొనేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తుంటారు.
అమెరికాలో భారతీయుల జనాభా 50 లక్షలు. అమెరికా జనాభాలో భారతీయులు 1.47 శాతం. అయితే ఇందులో అమెరికాలో పుట్టింది 34 శాతం మంది. అందులో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారి సంఖ్య 7.25 లక్షల మంది ఉన్నారని అంచనా. మిగిలిన వారంతా అమెరికాలో వలసదారుల కింద లెక్కే. అంటే ఉద్యోగం కోసం తాత్కాలిక వీసాపై అమెరికాకు వెళ్లి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారన్నమాట.
ఇలాంటి వలసదారులకు పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు.ఇది అనేక ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంటుంది. కుటుంబాల మధ్య దూరం పెరగనుంది. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ లభించకపోతే చట్టపరమై సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్ధులు ఎక్కువ మంది ఇండియన్లు. ఆ తర్వాతి స్థానంలో చైనా దేశీయులు. అమెరికాలో మాస్టర్స్ కోసం వెళ్లి చదువు పూర్తై అక్కడే ఉద్యోగం సంపాదించిన ఇండియన్ విద్యార్థులు కొందరు అక్కడి అమ్మాయిలను వివాహం చేసుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ చట్టం అమలైతే ఇలాంటి వారికి కష్టాలు తప్పవు.
ట్రంప్ ఆర్డర్ అమలుకు లీగల్ సమస్యలు ఏంటి?
బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ రద్దుపై ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్ఢర్ అమలుకావాలంటే అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలి. అంటే అమెరికాకు చెందిన చట్టసభలు ప్రతినిధుల సభ, సెనెట్‌లలో మూడింట రెండొంతుల మెజారిటీతో ఇది ఆమోదం పొందాలి. ఆ దేశానికి చెందిన రాష్ట్రాల్లోని శాసనసభల్లో నాలుగింట మూడొంతుల అసెంబ్లీలు దీనికి ఆమోదం తెలపాలి. అప్పుడే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్ఢర్ అమల్లోకి వస్తుంది.
అమెరికా సుప్రీంకోర్టు కూడా గతంలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ను సమర్ధించింది. యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ కేసులో 1898లో ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. అమెరికాలో పౌరులు కానీ పేరేంట్స్‌కు పుట్టిన పిల్లలు అమెరికా పౌరులేనని కోర్టు ఆ తీర్పులో తెలిపింది.
ఈ తీర్పు ఆధారంగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై వలసదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్ ఉల్లంఘించారని పిటిషన్ దారులు ఆరోపించారు. ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ను రద్దు చేయడం సాధ్యం కాదని లీగల్ నిపుణులు చెబుతున్నారు.
ఎంతమందిపై ఈ ఆర్డర్ ప్రభావం చూపుతుంది?
ట్రంప్ తెచ్చిన బర్త్‌రైట్‌సిటిజన్‌షిప్ రద్దు చేస్తూ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వస్తే భారత్ తో పాటు ఇలా ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉంటున్న వలసదారుల పిల్లలపై ప్రభావం చూపుతుంది. వ్యూ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం అమెరికాకు వలసవచ్చిన దంపతులకు 2.50 లక్షల మంది పిల్లలు పుట్టారు. ఇది 2022 నాటికి 1.2 మిలియన్లకు చేరుకుంది.
2050 నాటికి అమెరికాలో అనధికార వలసదారుల సంఖ్య 4.7 మిలియన్లకు చేరుకొనే అవకాశం ఉందని అంచనా.అమెరికాలో 30 దేశాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు.
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెచ్చారు. ఈ నిర్ణయం అమలైతే అమెరికాలో ఉంటున్న భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు కావడం అంత సులువేమీ కాదనే లీగల్ ఓపినియన్ అమెరికాలో ఉంటున్న వలసదారులకు కొంత ఊరటనిస్తుంది. అయితే ఈ ఆర్డర్ పై కోర్టులు ఎలాంటి తీర్పును ఇస్తాయో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



