పాక్ తొలి అణుపరీక్షపై ఇప్పుడు బలూచీ నిరసనలెందుకు?

పాక్ తొలి అణుపరీక్షపై ఇప్పుడు బలూచీ నిరసనలెందుకు?
x
Highlights

ఓ 22 ఏళ్ళ క్రితం 1998 మే 28న పాకిస్థాన్ తొలి అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది. ఆ అణు పరీక్ష జరిగింది బలూచిస్తాన్ లో. అప్పుడు జరిగిన అణు పరీక్ష కారణంగా...

ఓ 22 ఏళ్ళ క్రితం 1998 మే 28న పాకిస్థాన్ తొలి అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది. ఆ అణు పరీక్ష జరిగింది బలూచిస్తాన్ లో. అప్పుడు జరిగిన అణు పరీక్ష కారణంగా లక్షలాది మంది ప్రజలు వివిధ రోగాల బారిన పడ్డారు. నేటికీ ఆ గాయాలు బలూచిస్థాన్ ను వెంటాడుతూనే ఉన్నాయి. బలూచిస్తాన్ లో పాక్ పేల్చిన అణు బాంబు ఆ ప్రజల గుండెలను ముక్కలు చేసింది. అక్కడ ఏడు దశాబ్దాలుగా రగులుతున్న స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత తీవ్రం చేసింది. అందుకే మే 28న ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు ఆ రోజున వారికి సంఘీభావం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఈ రోజు మాట్లాడుకుందాం బలూచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటం గురించి.

బలూచిస్తాన్ అంశంపై ఇప్పటి వరకూ భారత్ లో మరే ప్రధాని చేయని సాహసాన్ని మోడీ చేశారు. 2016 లో పంద్రాగస్టు నాటి ప్రసంగంలో ఆయన బలూచిస్తాన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. నాలుగేళ్లు గడిచాయి. నాడు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ ప్రకటించిన సంఘీభావాన్ని ఆచరణలో చూపెట్టాల్సిన సందర్భం వచ్చింది. బలూచిస్తాన్ ప్రజల స్వాతంత్ర్య పోరాటానికి భారత్ మద్దతు ఇవ్వడం నైతిక బాధ్యత మాత్రమే కాదు చైనా, పాక్ ల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయడంలో అది మన అవసరం కూడా. అప్పట్లో ఈస్ట్ పాకిస్థాన్ ప్రజల ఆకాంక్షలను భారత్ నెరవేర్చింది. బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైంది. అదే తరహాలో ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ మద్దతు పలకాల్సిన సందర్భం వచ్చింది.

కశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఒకవైపున సరిహద్దు పొడుగునా చైనా ఆక్రమణలు మరో వైపున భారత్ కు ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. పాకిస్థాన్ కు బుద్ధి చెబుదామని భారత్ ప్రయత్నించినప్పుడల్లా ఏదో రకంగా చైనా అడ్డుపుల్ల వేస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతోంది. పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకోకుండా చేస్తోంది. మరో వైపున బలూచిస్థాన్ లో పాక్, చైనాలకు ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటానికి భారత్ మద్దతు పలకడం ద్వారా రెండు దేశాలపై కూడా ఒత్తిడి పెంచినట్లు అవుతుందన్న వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం పాకిస్థాన్ లో భాగంగా ఉన్న బలూచిస్థాన్ నిజానికి వందల ఏళ్లుగా ఓ స్వతంత్ర దేశం. పాకిస్థాన్ ఆవిర్భవించే క్షణం దాకా అది స్వతంత్ర దేశంగానే ఉండింది. పాక్ ఆవిర్భావ చివరి క్షణాల్లో మాత్రమే అది పాకిస్థాన్ లో భాగంగా మారింది. విడదీసి పాలించు అనే సూత్రంతోనే బ్రటిష్ వారు రాజ్యమేలారు. బ్రటిష్ ఇండియాను రెండు ముక్కలు చేసిన బ్రిటిష్ వారు బలూచిస్థాన్ విషయంలో మాత్రం దాన్ని పాక్ తో కలిపేసి వినోదించారు. నాటి నుంచి కూడా బలూచిస్థాన్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని హిందూ రాజులు పాలించారు. మహా భారతంలో కూడా ఈ ప్రాంతం గురించి ఇక్కడి రాజుల గురించిన ప్రస్తావన ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకనాటి అఖండ్ భారత్ లో అది కూడా భాగమే. అక్కడి ప్రజల మూలాలు నేటి భారతీయుల మూలాలతో కలసి ఉన్నవే. అలాంటి ప్రాంతం ఇప్పుడు స్వాతంత్ర్యం కోసం తన పోరాటాన్ని తీవ్రం చేసింది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్నికూడా ఉన్నాయి. బలూచిస్థాన్ పోరాటం జిహాద్ ఆధారంగా జరుగుతున్నది కాదు. మతం ప్రాతిపదికన గాకుండా సోషలిజం నేపథ్యంగా ఈ పోరాటం సాగుతోంది. పోరాటం చేసే వారిలో ఎన్నో వర్గాలున్నా....ఉమ్మడి వేదికలు కూడా ఉన్నాయి. అవే ఇప్పుడు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తున్నాయి. మే 28 ని నిరసన దినంగా పాటించాలని అవి పిలుపునిచ్చాయి.

పాకిస్తాన్ మొదటి నుంచి కూడా బలూచిస్థాన్ పట్ల సవతి తల్లి ప్రేమనే కనబర్చింది. దాన్ని తన వలసరాజ్యంగా భావించింది. చివరకు చైనాను దాన్ని ధారాదత్తం చేస్తోంది. తమ అభీష్టానికి విరుద్ధంగా పాక్ లో విలీనం పాక్ అణ్వస్త్ర ప్రయోగం తాజాగా చైనాకు ధారాదత్తం ఈ అంశాలే ఇప్పుడు బలూచిస్థాన్ ప్రజలు తమ తిరుగుబాటును ఉధృతం చేసేలా చేశాయి. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ లో చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఎంతో కీలకం. అటు చైనాకు, ఇటు పాకిస్థాన్ కు ఎంతో ముఖ్యమైంది. అది బలూచిస్థాన్ గుండానే వెళ్తోంది. చైనాలోని జింగ్ యాంగ్ ప్రావిన్స్ ను పాక్ లోని గ్వడార్ ఓడరేవుతో అనుసంధానం చేసేది ఈ మార్గమే. ఈ మార్గం అధికంగా ఉన్నది బలూచిస్తాన్ లోనే. అందుకే బలూచిస్థాన్ ఉద్యమకారులు ఈ రోడ్డు మార్గాన్ని తమ లక్ష్యంగా చేసుకున్నారు. దానికి రక్షణగా ఉండే చైనీయులపై, పాక్ సైన్యంపై దాడులు చేయడం మామూలైపోయింది. ఇటీవలి దాడుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు మరణించారు. ఇందుకు ప్రతీకారంగానా అన్నట్లుగా పాక్ సైన్యం అక్కడ కిరాయి మూకలను ప్రోత్సహిస్తోంది. ఆ మూకలు బలూచిస్థాన్ ఉద్యమకారులను హతమార్చడమే పనిగా పెట్టుకున్నాయి. ఎంతో మంది జర్నలిస్టులు, ప్రజా నాయకులు ఈ కిరాయి మూకల చేతిలో హతమైపోయారు. ఇక సైన్యం స్వయంగా ఎన్నో ఆగడాలకు పాల్పడుతోంది. వివిధ మానవ హక్కుల వేదికలపై ఈ అంశాలు ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. అంతర్జాతీయ సమితి విభాగాల్లోనూ పలు మార్లు చర్చ జరిగినా ఫలితం లేకపోయింది. పాక్ అకృత్యాలను తట్టుకోలేక ఎంతో మంది ఇరాన్ లాంటి పొరుగు దేశాలకు పారిపోవడం సహజమైపోయింది.

బలూచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటంపై అంతర్జాతీయంగా అవగాహన కల్పించేందుకు ఫ్రీ బలూచిస్థాన్ మూవ్ మెంట్ కృషి చేస్తోంది. అందులో భాగంగా ఆజోయ్ టీవీ యూట్యూబ్ చానల్ ను ప్రారంభించింది. మే 28న అండర్ ది షాడో ఆఫ్ స్టోలెన్ బాంబ్ అనే షార్ట్ డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది. బలూచిస్థాన్ ప్రజల పోరాటానికి సంఘీభావంగా నెటిజన్లు ఇప్పటికే తమ ప్రొఫైల్ పిక్ ను మార్చుకుంటున్నారు.

బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం బలూచ్ నేషనల్ మూవ్ మెంట్ కృషి చేస్తోంది. ఈ విషయంలో తమకు మద్దతు ప్రకటించాల్సిందిగా అది భారత్ ను ఎప్పటి నుంచో కోరుతోంది. 2016లో ఎర్రకోట సాక్షిగా భారత్ ప్రధాని మోడీ బలూచిస్థాన్ గురించి ప్రస్తావించారు. ఆ ప్రస్తావన మాటలకే పరిమితం చేయవద్దని కార్యరూపంలోకి తీసుకురావాలని బలూచిస్థాన్ పోరాట నాయకులు కోరుతున్నారు. తమకు స్వాతంత్ర్యం వచ్చే వరకూ ఢిల్లీ నుంచి ప్రవాస ప్రభుత్వాన్ని నడిపేందుకు అనుమతించాలని కోరుతున్నారు. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని వారు భారత్ ను అభ్యర్థిస్తున్నారు. బలూచిస్థాన్ ప్రజల ఆశలన్నీ ఇప్పుడు భారత్ పైనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం ఒక వైపున కరోనా మరో వైపున ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో అన్ని దేశాలు కూడా తమ ప్రాథమ్యాలనే పట్టించుకుంటున్నాయి. బలూచిస్థాన్ గురించి పట్టించుకునే అవకాశం వాటికి లభించడం లేదు. పాకిస్థాన్ తో ఇప్పటికే ఉన్న గొడవల నేపథ్యంలో బలూచిస్థాన్ ఉద్యమం విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకే సమయంలో పాక్, చైనా నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ళను తట్టుకోవాలంటే అంతర్జాతీయ సమాజం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు అవసరం. ప్రస్తుతం అమెరికా, మిత్ర రాజ్యాలు చైనా పై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా పాక్, చైనాలను ఎదుర్కొనే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేయాలనే వారూ ఉన్నారు.

బలూచిస్థాన్ పోరాటం చుక్కాని లేని నావలా సాగుతోంది. ఎన్నో వర్గాలు విడివిడిగా పోరాటం చేస్తున్నాయి. అవన్నీ ఒక్క వేదికపైకి వస్తేనే వాటి గొంతుక బలంగా వినిపిస్తుంది. అప్పటి వరకూ ఈ విషయంలో భారత్ బహిరంగంగా చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాకపోతే బలూచిస్థాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను అంతర్జాతీయ వేదికలపై చర్చకు తీసుకువచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. ఆ విధంగా చేసినా బలూచిస్థాన్ పట్ల భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నట్లు అవుతుంది. ఈ లోగా ఇండియన్ నెటిజన్లు ఎంతోమంది సోషల్ మీడియాలో బలూచిస్థాన్ పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఆ రకంగా చూస్తే మాత్రం మే 28న సోషల్ మీడియాలో ఓ సంచలనం చోటు చేసుకోనుందనే చెప్పవచ్చు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories