ఇది విపక్షాల ఐక్యతా ర్యాలీనా?

ఇది విపక్షాల ఐక్యతా ర్యాలీనా?
x
Highlights

అందరి నాయకులదీ ఒకే నినాదం.అదే మోడీ హఠావో. అన్ని పార్టీలది గొంతుక. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇసుకేస్తే రాలనంతగా హోరెత్తిన బ్రిగేడ్‌ మైదానంలో, దేశంలో ఉద్దండ నాయకులందరూ, సమైక్య రాగం వినిపంచారు. లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు.

అందరి నాయకులదీ ఒకే నినాదం.అదే మోడీ హఠావో. అన్ని పార్టీలది గొంతుక. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇసుకేస్తే రాలనంతగా హోరెత్తిన బ్రిగేడ్‌ మైదానంలో, దేశంలో ఉద్దండ నాయకులందరూ, సమైక్య రాగం వినిపంచారు. లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత, నిజంగా జనహోరును తలపించింది.ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల అధినాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధాని, ఇలా దేశ రాజకీయాలను శాసించిన నాయక గణమంతా ఒకే వేదికపై కొలువుదీరింది.

కోల్‌కతా బ్రిగేడ్‌ మైదానం జనంతో కిక్కిరిసింది. తృణమూల్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల ఐక్యతా ర్యాలీ సక్సెస్ అయ్యింది. మమతా బెనర్జీ పిలుపందుకుని 20 మందికి పైగా జాతీయస్థాయి నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌, డీఎంకే నేత స్టాలిన్, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామి, శరద్‌యాదవ్‌, ఎన్సీ నేత ఫరూక్‌ అబ్దుల్లా, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, బీజేపీ తిరుగుబాటు ఎంపీ శత్రుఘ్న సిన్హా ర్యాలీలో పాల్గొన్నారు. అంతేకాదు బీజేపీ తిరుగుబాటు సీనియర్ నాయకులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌ శౌరిలు కూడా పాల్గొన్నారు. అలాగే పాటిదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్, ‌వివిధ ప్రజాసంఘాల నాయకులు, వేదికపై కనిపించారు.

మోడీని గద్దెదించడమే లక్ష్యమని ఉమ్మడిగా ప్రకటించింది యునైటెడ్‌ ఇండియా ర్యాలీ. సేవ్‌ ఇండియా, సేవ్ డెమోక్రసీ అంటూ పిలుపునిచ్చింది. మోడీ నిరంకుశ పాలన అంతానికి ఇదే ఆరంభమని హోరెత్తించింది. ఈ ర్యాలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ అధ్యక్షురాలు సోనియా హాజరు కాలేదు. వారి తరపున లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. సభకు సంఘీభావం ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు రాహుల్‌. ఈ భారీ ర్యాలీ ద్వారా ఐక్య భారత సందేశం బలంగా వినిపిస్తుందని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదానికి మూల స్తంభాలు నిజమైన జాతీయవాదం, అభివృద్ధి, మోడీ సర్కారు వీటినే ధ్వంసం చేస్తోందని లేఖలో అన్నారు రాహుల్.

రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని గళమెత్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన చంద్రబాబు, మోడీ ఫెర్మానెన్స్ ప్రైమ్ మినిస్టర్ కాదు, పబ్లిసిటీ పీఎం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. రక్షణ రంగంలో ఎంతో అనుభవమున్న హాల్‌ను కాదని, రాఫెల్‌ విమానాల తయారీని రిలయన్స్‌కు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు బాబు. పాకిస్తాన్ 70 ఏళ్లలో చేయలేనిది మోడీ-షా ఐదేళ్లలో చేశారని విమర్శించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మోడీ అబద్దాలు చెప్పి, యువకుల నుంచి ఓట్లు తీసుకున్నారని కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. నోట్ల రద్దు వల్ల దేశంలో కోట్ల ఉద్యోగాలు పోయాయని విమర్శించారు కేజ్రీవాల్.

ప్రజా ప్రయోజనాలు పట్టని పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని ప్రజాస్వామ్యం, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన సాగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దేశ మహోన్నత రాజ్యాంగంపైనా దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్సీపీ నేత శరద్ పవార్. విపక్ష కూటమి దేశంలో భిన్నత్వంలోని ఏకత్వానికి ప్రతీకగా అభివర్ణించారు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్. పార్టీలు అనేకం ఉండొచ్చు కానీ అందరి లక్ష్యం ఒక్కటే, ఆ ఒక్క లక్ష్యమే విపక్షాలను ఒక్కతాటిపైకి తెస్తోందని వ్యాఖ్యానించారు.

బీజేపీ వ్యతిరేక పక్షాల సభకు, బీజేపీ ఎంపీ శత్రఘ్న సిన్హా హాజరుకావడం సంచలనం సృష్టించింది. మొదటి నుంచి మోడీ పాలనపై విమర్శలు చేస్తున్న సిన్హా, యశ్వంత్ సిన్హా, అరుణ్‌ శౌరీలతో కలిసి పాల్గొన్నారు. మోడీ అరాచక పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు

ఇక చివర్లో ప్రసంగించిన మమతా బెనర్జీ, మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్రలు ఇక ఎంత మాత్రమూ సాగవని, బీజేపీని ఓడించడమే కాకుండా మూలాలతో పెకిలించాలని పిలుపునిచ్చారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ ఇలా అన్ని వ్యవస్థలను మోడీ ధ్వంసం చేశారని, అందుకే బీజేపీని ఈ దేశం ధ్వంసం చేయబోతోందని అన్నారు మమత. విపక్షాల ఐక్యతా ర్యాలీ, మోడీ గుండెల్లో గుబులు సృష్టిస్తోందన్నారు మమతా బెనర్జీ.

మొత్తానికి మమతా బెనర్జీ నేతృత్వంలో సాగిన, బీజేపీ వ్యతిరేక పక్షాల ఐక్యతా ర్యాలీ, సక్సెస్ అయ్యింది. ఇక ఇదే జోష్‌తో 2019లోనూ యునైటెడ్‌గా కలిసి సాగుదామని, అన్ని పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. మోడీని గద్దెదించి, సరికొత్త పాలన దేశానికి అందిద్దామని అన్నారు. మరి ఎన్నికల వరకూ, ఎన్నికలైన తర్వాత, ఇదే ఐక్యతను చాటుకుంటారో మధ్యలో దిక్కులు చూస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories