Top
logo

వ‌చ్చే ఎన్నిక‌ల‌కోసం కేసీఆర్ సరికొత్త ఎత్తుగ‌డ‌

వ‌చ్చే ఎన్నిక‌ల‌కోసం కేసీఆర్ సరికొత్త ఎత్తుగ‌డ‌
X
Highlights

రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన సీఎం కేసీఆర్, మరో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్...

రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన సీఎం కేసీఆర్, మరో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ మినహా అన్ని ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదల మీదున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్ధులను బరిలో నిలపాలని భావిస్తున్నారు. ఇందుకోసం విపక్షాల ఊహలకు అందకుండా కొత్త పేర్లను తెరమీదకు తెస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రులలో చాలా మందిని ఢిల్లీకి పంపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేందుకు కొత్త పేర్లను తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుత లోక్ సభలో పార్టీకి ఉన్న 14 మంది ఎంపీలలో కనీసం 10 మందిని మార్చాలని గులాబీ బాస్ అనుకుంటున్నట్టు సమాచారం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్న అంచనాలో ఉన్న కేసీఆర్..16 ఎంపీ స్థానాలను గెలిచి తీరాలని భావిస్తున్నారు. గతంలో 13 మంది ఎంపీలతో దేవేగౌడ ప్రధాని అయింనదువల్ల వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని నమ్ముతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ సర్కార్ వచ్చినా తన మాట నెగ్గించుకొనేలా స్కెచ్ గీస్తున్నారు.

విపక్షాల ఊహలకు అందకుండా బలమైన అభ్యర్దులను బరిలో నిలపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పలువురు మంత్రులను లోక్ సభ బరిలో నిలపనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. 1996 లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ సలహా మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే వ్యూహంతో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. అదే వ్యూహాన్ని ప్రయోగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర్ రావు, కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను ఎంపీలుగా నిలబెడతారని పార్టీలో ప్రచారం సాగుతోంది. హరీష్ ను అయితే మెదక్ లేదా జహీరాబాద్ నుంచి, తుమ్మలను ఖమ్మం నుంచి, ఈటెల ను కరీంనగర్ నుంచి, వరంగల్ పార్లమెంట్ స్థానానికి కడియం, పోచారం ను నిజమాబాద్ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు.

ఇతర పార్లమెంట్ సీట్లలో సిట్టింగులకు కాకుండా ఎవ్వరి అంచనాలకు చిక్కని పేర్లను పరిశీలిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి మాజీ మంత్రి రెడ్యా నాయక్, పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీ వివేక్, మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, భువనగిరి నుంచి ఉమా మాధవరెడ్డి, ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్ లను బరిలో దింపాలనే యోచనలో ఉన్నారు.

ఇక చేవెళ్ల నుంచి మహబూబ్ నగర్ ఎంపీ జీతేందర్ రెడ్డిని, మల్కాజిగిరి నుంచి చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని పోటీ చేయించే అవకాశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లలో ఒకరిని పార్టీలో చేర్చుకుని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది. టికెట్లు రాని సిట్టింగ్ లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుండా వారికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు.

సర్వేల్లో ప్రతికూల ఫలితాలున్న ఎమ్మెల్యేల సీట్లలో వీళ్లను పోటీ చేయించాలనుకుంటున్నారు. అయితే చివర్లో ఒకటి రెండు పేర్లు మారినా దాదాపు ఎంపీ అభ్యర్ధులు ఇంతకు ముందు చర్చించుకున్న పేర్లనే కేసీఆర్ ఖరారు చేస్తారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అయితే హరీష్ రావు ఢిల్లీకి పోతారా, కవిత ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఒప్పుకుంటారా అన్న అంశాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేకున్నా వారికి కేసీఆర్ సర్దిచెబుతారని పార్టీ నేతలు అంటున్నారు.

Next Story