డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి ఆదిమూలపు సురేష్

డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి ఆదిమూలపు సురేష్
x
Highlights

విద్యాశాఖలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర విద్యాశాఖ...

విద్యాశాఖలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అందులో భాగంగానే 1998, 2008, 2012 డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. సోమవారం సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ నియామకంలోని సమస్యలను సమీక్షించామని, వాటిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రధానంగా 1998, 2008, 2012 డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు తమ దృష్టికి తీసుకువచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కటాఫ్ తగ్గించడం వల్ల నష్టపోయిన 1998 డీఎస్సీ అభ్యర్థులు, డీఈడీ, బీఈడీ పేరిట 70:100 నిష్పత్తి వల్ల నష్టపోయిన 2008 డీఎస్సీ అభ్యర్థులు, లోకల్, నాన్ లోకల్ విధానం వల్ల నష్టపోయిన 2012 డీఎస్సీ అభ్యర్థులకు అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కమిటీ ప్రకారం డీఎస్సీ- 1998లో 4534 మంది అభ్యర్దులు నష్టపోయారని తెలిపారు. ఎమ్మెల్సీ కమిటీ చేసిన సూచనల్లో 36 మందిని అర్హులుగా గుర్తించామని, వీరిలో ఆరుగురు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికెషన్ పూర్తి అయ్యిందని, వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. డీఎస్సీ- 2008 డిఈడి, బిఈడి అభ్యర్థులకు 30, 70 శాతం కేటాయింపుల వల్ల నష్టపోయిన వారి విషయంలోనూ ఎమ్మెల్సీ కమిటీ నివేదిక ఇచ్చిందని దాని ప్రకారం 4,657 మందిని గుర్తించామన్నారు. 3,636 మంది ఆ తర్వాతి వచ్చిన డీఎస్సీల్లో ఉద్యోగాలు పొందారని, మిగిలిన వారికి ఉద్యోగాలు ఇవ్వనున్నామని తెలిపారు. డీఎస్సీ 2012 లోకల్, నాన్ లోకల్ కు కేటాయింపుల్లో నష్టపోయిన వారికి కూడా ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆయా డీఎస్సీల అభ్యర్థుల జాబితాలు తెప్పించుకొని వెరిఫికేషన్ ను కూడా చేపట్టామని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆయా డీఎస్సీ అభ్యర్థులు న్యాయం కోసం పోరాటం చేస్తున్న అంశం తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. వీరందరిని ఎస్జీటి కింద అపాయింట్ చేసుకొని టైమ్ స్కేలు రూపంలో గానీ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన గానీ వేతనం అందిస్తామన్నారు. ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఇక 2018 డీఎస్సీ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో నిర్వహించే డీఎస్సీ విషయంలో నోటిఫికేషన్ మొదలుకొని భర్తీ ప్రక్రియదాకా ఎక్కడా తప్పులు దొర్లకుండా పరీక్షలు సజావుగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్రంత్లో ఎక్కడెక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి రాబోయే డీఎస్సీలో పొందుపరిచి భర్తీ చేస్తామన్నారు. అంతేగాక నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లో ఉన్న సమస్యలకైనా త్వరితగతిన పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.

విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పించడం పట్ల రాజీపడబోమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. లాభాల వ్యాపారంగా నడుస్తున్న విద్యావ్యవస్థకు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. త్వరలోనే ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహణ విధి విధానాలపై కసరత్తు జరుగుతోందన్నారు. ఫీజుల నియంత్రణపై రూపొందించిన చట్టానికి కేబినెట్‌ ఆమోదం లభించిందన్నారు. ఫీజురీయింబర్స్‌ మెంట్‌పై సీఎం జగన్‌ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఫీజులపై రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. విద్యాశాఖలో త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని మంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా ప్రమోషన్ల ప్రక్రియ జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇక పాఠశాలల మౌలిక వసతులు, నిబంధనల విషయంలో పరిశీలన నిరంతరం చేపడతామని తెలిపారు. నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు పడిపోకుండా చూస్తామని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో తెచ్చే ఇంగ్లీష్ మీడియంలో బోధించే వారి విషయంలో ఆంగ్లం ఒక సబ్జెక్టుగా కలిగి ఉన్న వారికి డీఎస్సీలో 50 శాతం రిజర్వేషన్ కల్పించే విషయమై ఆలోచిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories