Hanumakonda: ఈనెల 16న పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Hanumakonda: ఈనెల 16న పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఏర్పాట్లను అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం.
Hanumakonda: ఈనెల 16న పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
హనుమకొండ: ఈ నెల 16న పరకాల పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారదలతో కలిసి రెండు జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వేదిక ఏర్పాటు, సభా ప్రాంగణం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలు, ప్రజాప్రతినిధుల రాకపోకలు, బారికేడింగ్, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, భద్రతా చర్యలు, హెలిప్యాడ్, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
సభా ప్రాంగణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రాంతాలను ముందుగా గుర్తించి, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాలని సూచించారు.
సభా ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సిబ్బంది, వైద్య బృందాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చూడాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వీఐపీ రాకపోకలు, ప్రజల ప్రవేశం, అత్యవసర మార్గాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడంలో అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రవి, గణేష్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్‌డీవోలు, జెడ్పీ సీఈవోలు, పోలీస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక, ట్రాన్స్‌పోర్ట్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.