Kurupam: రాజకీయ రగడ.. ఎమ్మెల్యే జగదీశ్వరి, పుష్పశ్రీవాణి మధ్య క్రెడిట్ వార్!
Kurupam: క్రెడిట్, అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
Kurupam: రాజకీయ రగడ.. ఎమ్మెల్యే జగదీశ్వరి, పుష్పశ్రీవాణి మధ్య క్రెడిట్ వార్!
కురుపాం, ఆగస్టు 11: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కురుపాం, గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ ఆసుపత్రుల నూతన భవనాల ప్రారంభోత్సవాల నేపథ్యంలో క్రెడిట్, అభివృద్ధి అంశాలపై ప్రస్తుత ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఇటీవల జరిగిన ఆసుపత్రి భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని గత ఐదేళ్లలో కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు తెరలేచింది.
మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన పుష్పశ్రీవాణి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తమ హయాంలో పూర్తయిన భవనాలను ప్రారంభించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
దీనికి కౌంటర్‌గా మంగళవారం కురుపాంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే జగదీశ్వరి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసిన పలు పనులను తమ ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఆసుపత్రి భవనాల విషయంలో కూడా పెండింగ్‌లో ఉన్న పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాటును పూర్తి చేసిన తర్వాతే ప్రారంభోత్సవం నిర్వహించామని స్పష్టం చేశారు. కేవలం భవనం నిర్మించడం మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా అన్ని వసతులు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.
ప్రెస్‌మీట్ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని పేర్కొంటూనే, అభివృద్ధి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సరికాదన్నారు. పుష్పశ్రీవాణి చేసిన విమర్శలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు.
మొన్న పుష్పశ్రీవాణి, నేడు జగదీశ్వరి నిర్వహించిన ప్రెస్‌మీట్లు కురుపాం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆసుపత్రి భవనాల క్రెడిట్‌తో మొదలైన ఈ వివాదం ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి, గత ప్రభుత్వం–ప్రస్తుత ప్రభుత్వం పనితీరు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది.
ఆసుపత్రి భవనాల నిర్మాణం, ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులపై ఇరు వర్గాలు తమదే కృషి అని చెబుతుండగా, ఈ రాజకీయ మాటల యుద్ధం ప్రస్తుతం కురుపాం నియోజకవర్గంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.