Kurupam: రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
Kurupam: కురుపాంలో 'గట్టు మీద చెట్టు' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు.
Kurupam: రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి
ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుంది
గట్టు మీద చెట్టు కార్యక్రమంలో స్పష్టం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కురుపాం , ఆగష్టు 8 : రైతులు సంప్రదాయ ధాన్యం పంటలకే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శనివారం కురుపాం మండలంలోని రంగుపురం పంచాయతీ పరిధిలోని గురుగుబిల్లి గ్రామంలో గట్టు మీద చెట్టు కార్యక్రమంలో మంత్రి పాల్గొని రైతులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. పంటల దిగుబడి పెంచడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, చేల గట్ల వెంట ఉపయోగకరమైన చెట్లను నాటడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఎల్ నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు దృష్టి సారించాలని కోరారు. సాగునీటి భద్రత, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా రైతులకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతన్న సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, సాగు వ్యయాన్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడమే ‘రైతన్న మీకోసం’ ముఖ్య ఉద్దేశమన్నారు. వరితో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు మక్కువ చూపాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా తక్కువ నష్టంతో పాటు ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉందన్నారు. సాంప్రదాయ పద్ధతుల నుంచి రైతులు మారితే తప్ప ఆదాయ మార్గాలు పెరగవని, ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షానే నిలుస్తుందని, రైతులకు నిరంతరం లాభాలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.