Chodavaram: అల్లూరి మన్యంలో ముసురు వాతావరణం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు!
Chodavaram: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో ముసురు వాతావరణం నెలకొంది. పలు మండలాల్లో మోస్తరు వర్షం, పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Chodavaram: అల్లూరి మన్యంలో ముసురు వాతావరణం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు!
Chodavaram: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడగా, పలు మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో కురిసిన వర్షానికి పంట పొలాల్లో నీరు చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజా వాతావరణంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
కొయ్యూరులో సోమవారం 30.1, పాడేరులో 25.9, అరకులోయలో 25.6, డుంబ్రిగుడలో 24.7, చింతపల్లిలో 24.5, హుకుంపేటలో 23.7, పెదబయలులో 22.8, ముంచంగిపుట్టులో 22.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టు మండల పరిధిలో మండల కేంద్రం నుంచి కుమడ, సంగడ, పెదబయలు, జోలాపుట్టు, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు చిత్తడిగా మారాయి. కిలగాడ, మాకవరం, జోలాపుట్టు, కరిముఖిపుట్టు, వనుగుమ్మ, బూసిపుట్టు, రంగబయలు, లక్ష్మీపురం, తదితర పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో పల్లపు ప్రాంతంలో ఉన్న వరిపంట పొలాలు నీట మునిగాయి. పలు చోట్ల వరదనీటి ఉధృతికి వరినారు కొట్టుకుపోయింది. అలాగే లక్ష్మీపురం, జోలాపుట్టు, రంగబయలు, బంగారుమెట్ట, తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.