Off The Record: దొంతి మాధవరెడ్డి కి మంత్రి పదవి?

Off The Record: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కే అవకాశం లేదా?

Update: 2026-06-18 01:02 GMT

Off The Record: దొంతి మాధవరెడ్డి కి మంత్రి పదవి?

Off The Record: రాజకీయ చైతన్యం కలిగిన వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పుడు సమన్వయ లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. రేవంత్ రెడ్డి కేబినేట్లో ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇటీవలి వరకు కేబినెట్ హోదా కలిగిన సీఎం సలహాదారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి.. ఈ ముగ్గురు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సఖ్యత లేక మంత్రులు వాళ్ల సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారన్న టాక్ లేకపోలేదు. ఇక వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంతరంగిక వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్ లో మంత్రివర్గ విస్తరణ తెరపైకి రావడంతో ఓరుగల్లులో రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు అమాత్య పదవిపై మరింత ఆశలు పెంచుకున్నారన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. పక్కా బెర్తు కోసం అటు హస్తిన చుట్టూ, ఇటు రేవంత్ రెడ్డితో క్లోజ్‌గా మూవ్ అవుతున్నారట. బెర్తు పక్కాగా దక్కాలని ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి లాంటి నేతలు కొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. నాటి ఏపీ సీఎం కోట్ల మంత్రివర్గంలో మాదాటి నరసింహారెడ్డి లాంటి దిగ్గజానికి వరంగల్ నుండి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కగా నాటి నుంచి 32 ఏళ్లుగా రెడ్డి సామాజికవర్గానికి జిల్లా నుంచి బెర్తు దక్కలేదు. కాబట్టి ఈసారి ఆలోటు భర్తీ చేయాలనే డిమాండ్‌తో ప్రధానంగా ఆ వర్గం నేతలు హస్తిన స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలు, అధిష్టానం లాబీయింగ్ ముందు తన వాదన ఉంచుతున్నారట. అటు సీతక్క, ఇటు కొండా సురేఖకు కేబినెట్‌లో స్థానం కల్పించడంపై కాంగ్రెస్ పార్టీలో వాళ్ల పాత్ర, పార్టీ పటిష్టత భాగస్వామ్యంపై తీవ్రమైన చర్చ పెడుతూ పాయింటవుట్ చేస్తున్నారట. తనకు స్థానం కల్పించకుండా ఉండటంపై కూడా ప్రశ్నిస్తున్నారట.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి.. రాష్టంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాధవరెడ్డి అంటీముంటని రాజకీయాలు చేస్తూ రేవంత్‌తో గ్యాప్ కంటిన్యూ చేశారు. సీఎంతో సాన్నిహిత్యం వల్లే అవకాశాలొస్తాయనే వాదనపై నియోజకవర్గంలో శ్రేణుల నుంచి, అటు రాష్ట్ర రాజకీయాల్లో దొంతి శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడి పెరగడం, మాధవరెడ్డి తల్లి మృతి చెందడం, సీఎం రేవంత్ పరామర్శకు రావడంతో గ్యాప్ సెట్ అయిందట. ఎమ్మెల్యే మాధవరెడ్డి సొంత నియోజకవర్గానికి సీఎం రేవంత్‌ను తీసుకొచ్చి భారీ సభ కూడా నిర్వహించారు. అయినప్పటికీ మాధవరెడ్డికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదన్న చర్చ ఉండనే ఉంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడం, సీఎంతో సఖ్యత, సయోధ్య రెండూ ఉన్నప్పటికీ అవకాశం రాకపోతే ఎలా? అనే ప్రశ్నలను మాధవరెడ్డి సంధిస్తున్నారట అనుచరులు. మంత్రి పదవిపై తేల్చుకుందామని సిద్ధమైన ఎమ్మెల్యే దొంతికి సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి నుంచి అనూహ్య పరిణామం, ప్రతిపాదన ఎదురైందట. రాష్ట్రంలో కోరుకున్న కార్పోరేషన్ గానీ, ఆర్టీసీ చైర్మన్ గిరి డిప్యూటీ కేబినెట్ హోదాతో కట్టబెట్టనున్నట్టు తెరపైకి రావడంతో మాధవరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇన్నిరోజులు సీఎం సయోధ్య అంశం అడ్డుపెట్టి ఇప్పుడు తీరా దగ్గరైతే పరిణామాలు మళ్లీ మార్చారని మదనపడుతున్నారట.

ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత.. ఎమ్మెల్యే మాధవరెడ్డికి మంత్రి పదవి వస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నారట. జిల్లాలో దొంతి పవర్ సెంటర్‌గా మారుతారనే పక్కా స్కెచ్ తో ఆయనను సైడ్ చేస్తున్నారనే అభిప్రాయం ఎమ్మెల్యేలో బలంగా ఉందట. ఎమ్మెల్యే మాధవరెడ్డి మంత్రి పదవిపై చర్చ రాగానే దొంతి పరోక్షంలో అటు పార్టీ పైస్థాయిలో, ఇటు సీఎం రేవంత్ కోటరీలో విచిత్రమైన ఈక్వేషన్స్ తెరపైకి తెస్తున్నారట. ఇప్పటికే బీసీ, ఎస్టీ వర్గానికి మంత్రులుగా బెర్త్ దక్కగా, నిన్నటి వరకు రెడ్డి సామాజికవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి సీఎం సలహాదారుగా కేబినెట్ హోదా, ప్రస్తుతం రాజ్యసభ సీటు దక్కిందని లెక్కలు కడుతున్నారట. మాధవరెడ్డి డిమాండ్ చేస్తున్న రెడ్డి కోటాను ఎంపీ వేంతో లెక్క కట్టడం, కార్పొరేషన్‌గిరీ తెరపైకి తేవడం మాధవరెడ్డి జీర్ణించుకోలేకపొతున్నారట. సీన్ అంతా అర్థమైన మాధవరెడ్డి తనకు సుదీర్ఘ కాలంగా రాజకీయంగా పడని కోటరీ అంతా మళ్లీ ఒక్కటై ఈ పరిణామాలన్నీ తెరపైకి తీసుకువస్తున్నారని, నిన్నటి వరకు కస్సుబుస్సులాటతో నానా యాగీ చేసిన వారంత తనకు అవకాశం దక్కకుండా అంతా ఒక్కటయ్యారనే భావనలో ఉన్నారట దొంతి మాధవ రెడ్డి.

తన అవకాశాలకు వ్యతరేకంగా వస్తున్న సంకేతాలు, జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే మాధవరెడ్డి.. సైలెంట్ గా తన పంథాను ప్రదర్శిస్తున్నారనే చర్చ నడుస్తోంది. అందుకే ఉమ్మడి వరంగల్ నేతలు, మహబూబాబాద్ జిల్లా నేతలు నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సన్మాన సభకు దూరంగా ఉన్నారట. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ నిర్వహించిన సమీక్షకు కూడా డుమ్మా కొట్టారనే టాక్ హాట్ టాపిక్ అయ్యిందట. డిలిమిటేషన్ జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్‌లలో ఏదైనా ఒకటి జనరల్ అవుతుందని అంచనా వేస్తున్నారట. అలా ఎంపీ బరిలో తేల్చుకుంటాననే విశ్వాసంతో ఉన్నట్టు దొంతి అనుచరుల్లో చర్చ నడుస్తోంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సంపేట నుంచి తన కుమారుడు అవియుక్త్ రెడ్డిని బరిలోకి దింపి బరి గీస్తాననే ఆత్మవిశ్వాసంతో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఉన్నట్టు ఆంతరంగికుల్లో చర్చ నడుస్తోంది. దానికి తగ్గట్టుగా కొడుకు అవియుక్త్ రెడ్డిని స్థానిక సంస్థల బరిలోనూ, సహాకార సంఘాల ద్వారా గాని పొలిటికల్ ఎంట్రీ చేయించి జిల్లా స్థాయి పీఠంపై కూర్చొబెట్టేందుకు మానసికంగా సిద్దమై బ్లూ ప్రింట్ తో ముందుకెళుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. తాను టీడీపీ, కాంగ్రెస్ లో రాజకీయాలు నెరిపిన దగ్గర నుంచి ఉన్న వ్యతిరేక వర్గం నెగిటివ్ వైబ్రేషన్స్ తో రాజకీయంగా స్మూత్ వేలో అవకాశాలను అణిచివేస్తున్నారనే భావనలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారట. తనకు, తన కొడుకుకు ప్రజాక్షేత్రమే రాజకీయ రాచబాట వేస్తుందనే ఫిలాసఫిలో ఎమ్మెల్యే దొంతి ఉన్నట్టు ఆంతరంగికులు గుసగుసలాడుతున్నారు. విషయమేదైనా రెడ్డి సామాజికవర్గం కోటాలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని లెక్క కట్టడం, ఇప్పటికే సీతక్క, సురేఖ కేబినెట్ పట్టాలపై ఉండటం ఎమ్మెల్యే దొంతిని అంతర్మథనంలోకి నెట్టేసిందట.



Full View


Tags:    

Similar News