Off The Record: తెలంగాణ బీజేపీలో కోవర్టులు? బాంబు పేల్చిన అమిత్ షా?
Off The Record: తెలంగాణ బీజేపీలో కోవర్టు రాజకీయాల కలకలం! సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టిన అధిష్టానం.
Off The Record: తెలంగాణ బీజేపీలో కోవర్టులు? బాంబు పేల్చిన అమిత్ షా?
Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఢిల్లీ అధిష్టానం అడుగులు వేస్తూ చేయని ప్రయత్నమంటూ లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్టీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంటే.. కొందరు నేతలు మాత్రం తమకేమీ ఎరగనట్టు, పట్టనట్టు.. అంతకుమించి.. నాకెందుకులే అన్నట్టుగా సొంత అజెండాతో వ్యవహరిస్తుండటం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందట. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని చెబుతుంటే.. మరోవైపు కొందరు నేతలు అధికార పార్టీ నేతలతో స్నేహగీతాలు పాడుతున్నారనే చర్చ సాగుతోంది. మరికొందరు ప్రధాన ప్రతిపక్ష నేతలతో దోస్తీ పెంచుకుంటున్నారట. "కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు మొక్కుబడిగా హాజరవుతున్నారట. కానీ ప్రభుత్వాధినేతలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నారట.
కంచే చేను మేస్తే.. రైతు ఏమీ చేయాలన్న సామెత ఇప్పుడు కమలం శ్రేణుల్లో ఒకటే చర్చించుకుంటున్నారట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కోవర్ట్ రాజకీయాలు ఎక్కువయ్యాయనే సమాచారం పార్టీ పెద్దలకు వెళ్లిందట. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొందరు నేతలు అధికార పార్టీతో, మరికొందరు ప్రతిపక్ష నేతలతో సన్నిహితంగా ఉంటూ వారిచ్చిన డబ్బులు జేబులో వేసుకొని సొంత పార్టికి ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయట. అంతేకాదు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం వచ్చిన నిధులను నొక్కేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇక ఒకవైపు పార్టీ జెండా, మరోవైపు పక్క పార్టీల అండా..? ఒకవైపు కమలం పువ్వు.. మరోవైపు గులాబీలతోపాటు హస్తంతో స్నేహం చేస్తూ ఇంటి దొంగలుగా, కోవర్టులుగా మారిన ఆ నేతలెవరూ..? అంటూ పార్టీ ఆఫీసులో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఒకరినొకరు చెవులు కొరుక్కునేలా గుసగుసలాడుకుంటున్నారట.
లోపల మనస్సులో ఒకటి.. బయటకు మరో మాట" అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేతల తీరు కలకలం సృష్టిస్తోందట. ఇలా రెండు పడవల మీద కాలు పెట్టి రాజకీయం చేస్తున్న నేతల జాబితా ఢిల్లీ పెద్దల టేబుల్‌పైకి చేరిందనే చర్చ ఇప్పుడు నాంపల్లి పార్టీ ఆఫీసులో హాట్ టాపిక్‌గా మారింది.
శత్రువు ఎదురుగా ఉంటే జాగ్రత్త పడొచ్చు. కానీ ఇంట్లో ఉంటే ఏం చేస్తాం అనే డైలాగ్ ఇప్పుడు కమలం పార్టీలో వినిపిస్తోందట. ఇటీవల కొందరు నేతలు చురుకుగా అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం, సీఎం సభల్లో ప్రత్యేకంగా హాజరవడం, పలు వేదికలు పంచుకోవడం.. పార్టీ పెద్దలకు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. ఒకవేళ తమ నియోజకవర్గానికి సీఎం వస్తే ప్రజా సమస్యల కోసం కలవడం ఒక ఎత్తైతే.. సంబంధంలేని ప్రాంతాల్లో కూడా వెళ్లి స్వాగతం పలకడం మరో ఎత్తని పార్టీ పెద్దలు ప్రశ్నించారట. కాంగ్రెస్ నేతలకంటే ముందే బీజేపీ నేతలు వెళ్లి శాలువాలు కప్పడం ఏ సంకేతమని నిలదీశారట. రాజకీయంగా ప్రజల పక్షాన పోరాడి వారిని నిలదీయాల్సింది పోయి.. పొగడటం ఎందుకు..? అని "ప్రత్యర్థితో రాజకీయ యుద్ధం చేయాలి.. అంతేగానీ దోస్తానా చేయడమేంటన్న ప్రశ్నలు ఇప్పుడు కాషాయ శిబిరంలో మారుమోగుతున్నాయట. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతం ఒక్కటేనట.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడండి.. కానీ అధికార పార్టీతో పాటు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీతో ఎలాంటి రాజకీయ స్నేహాలు చేయడం హానికరం అంటూ హెచ్చరించారట. అదే సందేశం ఇప్పుడు పార్టీ కేడర్‌లో చర్చకు దారితీస్తోందట.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఈ చర్చ మరింత వేడెక్కిందట. కొందరు నేతల ప్రవర్తన పార్టీకి నష్టం చేస్తోందని నేరుగా చెప్పేశారట. "సింహం వేటకు వెళ్తే తోకలు ఊపే సమయం కాదు" అన్నట్టుగా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అందరూ పార్టీ లైన్‌లో నడవాలని తేల్చి చెప్పేశారట. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు కూడా ఇచ్చారట. ఆ సమావేశంలో కొందరు నేతల వ్యవహార శైలిపై నేరుగా ప్రశ్నలు సంధించారనే ప్రచారం జరుగుతోంది. సంబంధం లేకపోయినా సీఎం కార్యక్రమాలకు వెళ్లడం ఎందుకు..? అదే పిచ్‌లో ప్రధాన ప్రతిపక్షంపై కూడా విమర్శలు చేయాల్సిన నేతలు..
ఒకే వేదికపై చిరునవ్వులు పంచుకోవడం దేనికీ సంకేతం..? దీంతో సొంత పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు ఏమీ సందేశం ఇస్తున్నారంటూ సూటిగా నిలదీశారట. ఇదే సమయంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయట. "బీజేపీలో కోవర్టు రాజకీయాలు నడవవు.. ఎవరైనా కోవర్టులు ఉంటే వెళ్లిపోవచ్చు" అంటూ బహిరంగంగానే అనడం అప్పట్లో పార్టీలో పెద్ద చర్చకు దారితీసిందట. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలతో పాటు, ఇప్పుడు కోవర్టు పాలిటిక్స్, స్నేహ గీతాలు, లోపాయికారి ఒప్పందంతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదెవరు..? అసలు ఆ కోవర్టులు ఎవరు?" అన్న ప్రశ్న కమలదళంలో చర్చనీయాంశమైంది.
ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీలపై నిఘా పెట్టిన కమలం పార్టీ.. ఇప్పుడు సొంత పార్టీలోనే "ఆపరేషన్ కోవర్టు" మొదలుపెట్టిందా...? పార్టీ సమావేశాల్లో కూర్చుని.. ఆ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్న నేతలపై ప్రత్యేక నిఘా పెంచారట. అలాంటి నేతలపై పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. "గోడకూ చెవులుంటాయి" అంటారు.. కానీ ఇప్పుడు కమలం పార్టీలో గోడలే కాదు.. గదులు, కారిడార్లు, సమావేశాలన్నీ ఎవరో గమనిస్తున్నాయనే టాక్ నడుస్తోందట. కార్పొరేషన్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కమలం తోటలోని కలుపు మొక్కలను గుర్తించి కోవర్ట్ పాలిటిక్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతుందా..? లేక కోవర్ట్ రాజకీయాలే మరో కొత్త రాజకీయ తుఫాన్‌కు కారణమవుతాయా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.