Burning Topic: సైనిక సాయం చేయలేదని కొరియాపై అలిగిన ట్రంప్!

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశాలు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-08-19 06:52 GMT

Burning Topic: సైనిక సాయం చేయలేదని కొరియాపై అలిగిన ట్రంప్!

Burning Topic: ఉన్నట్లుండి అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియాతో అమెరికా నిర్వహించనున్న సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌ను ఆదేశించారు డొనాల్డ్ ట్రంప్.

అమెరికా, దక్షిణ కొరియా బలగాలు ప్రతి ఏటా నిర్వహించే కీలక సైనిక విన్యాసాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది 'ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్' పేరుతో ఆగస్టు 17 నుంచి 27 వరకు 11 రోజుల పాటు ఇది జరగాల్సి ఉంది. ఇందులో సుమారు 18 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొనే ఏర్పాట్లు చేశారు.

ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే సైనిక ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవడం ఈ విన్యాసాల ఉద్దేశం. కచ్చితమైన లక్ష్యాలను ఛేదించడం, సైనిక బలగాల కదలికలు, నదులు లేదా నీటి మార్గాలను దాటడం, ముందుగానే నిల్వ ఉంచిన సైనిక సామగ్రి పంపిణీ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.

అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ విన్యాసాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణం ఈ సైనిక విన్యాసాలు భారీగా ఖర్చుతో కూడుకున్నవని, అదే సమయంలో ఉత్తర కొరియాకు అనవసరంగా శత్రుత్వ సంకేతాలను పంపుతున్నాయని వ్యాఖ్యానించారు.

అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. ఇవి తమపై దాడికి సన్నాహాలుగా వ్యాఖ్యానించింది. ఆ డ్రిల్స్ వల్ల కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ప్రతి ఏటా అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ముందు ఉత్తర కొరియా ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సాధారణమే.

ఇటీవలే ఉత్తర కొరియా మళ్లీ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు ప్రారంభించింది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ బలగాలు ఉత్తర కొరియా నుంచి స్వల్పదూర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించాయి. ఆ క్షిపణి ఉత్తర కొరియా తూర్పు తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో పడింది.

డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా వార్నింగ్ కారణంగా దక్షిణ కొరియాతో నిర్వహించే యుద్ధ విన్యాసాలను తగ్గించాలని నిర్ణయించారా? కాదనే చెప్పవచ్చు.. అసలు కారణం వేరే ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్ మీద చేపట్టిన దాడుల విషయంలో తమతో కలిసి రావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ కోరారు.

ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలకు సహకరించాలని అడిగారు. అయితే మ్యూంగ్‌ ఇందుకు నిరాయకరించారు. ఇక్కడే అమెరికా అధ్యక్షుని అహం దెబ్బతింది. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాను కాపాడేందుకు అమెరికా 39 వేలమంది సైనికుల్ని ఉపయోగిస్తుంటే..

మీరు మాత్రం ఇరాన్ విషయంలో సహాయం చేయననడం వింతగా ఉంని మ్యూమ్‌తో వ్యాఖ్యానించారు ట్రంప్. ఇదే విషయాన్ని ట్రూత్ సోషల్ యాప్ ద్వారా పంచుకుకున్నరాయన. అమెరికాకు దక్షిణ కొరియా సహాయం అవసరం లేదు, మాకు సహకరించని మిత్రదేశాలను రక్షించడంలో అర్థం లేదన్నారు ట్రంప్

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తాను ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్‌తో దిగిన పాత ఫోటోను పంచుకున్నారు. తమ ఇద్దరివీ అన్ ఫ్రెండ్లీ లుక్స్ అంటూ సరదాగా రాసుకొచ్చారు. తమ చూపుల్లో స్నేహం లేకపోయినా వ్యక్తిగతంగా తమ మధ్య సంబంధాలు మాత్రం చాలా బాగుంటాయని చెప్పారు. కిమ్ జోంగ్ ఉన్, నేను చాలా బాగా బాగుంటాం' అని ట్రంప్ అంటూ రాసుకొచ్చారు.

డొనాల్డ్ ట్రంప్ 2019లో సింగపూర్‌లో కిమ్ జోంగ్ ఉన్‌‌ను కలుసుకొని అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం అయినప్పటి నుంచీ అణు, క్షిపణి ఆయుధ సంపదను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టారు కిమ్.

పెద్ద మొత్తంలో ఆయుధ సంపద ఉంటే భవిష్యత్తులో అమెరికాతో చర్చల సమయంలో మరిన్ని రాయితీలు పొందవచ్చని కిమ్ భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా కిమ్‌తో చర్చలు కొనసాగించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. 

దక్షిణ కొరియా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ ఉత్తర కొరియా విషయంలో తనకు ఉన్న సంబంధాలను వ్యూహాత్మకంగా ప్రస్తావించారు.కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా తమ పట్ల ఎలాంటి ముప్పు కలిగించలేదని, గౌరవప్రదంగా వ్యవహరిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సైనిక విన్యాసాలను పూర్తిగా రద్దు చేయడానికి ఇప్పటికే ఆలస్యమైందని తెలిపారు. ట్రంప్ గతంలో కూడా అమెరికా- దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను ప్రొవొకేటివ్​గా అభివర్ణించారు. 2018లో కిమ్‌తో సింగపూర్‌లో సమావేశమైన అనంతరం యుద్ధ విన్యాసాలను నిలిపివేస్తామని ప్రకటించారు.

వాటిని నిర్వహించడం వల్ల భారీగా డబ్బు ఖర్చవుతోందని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశించడం అమెరికా-దక్షిణ కొరియా రక్షణ సంబంధాలపై చర్చకు దారితీసింది.

మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టిన ఉల్చి ఫ్రీడమ్‌ షీల్డ్‌ సైనిక విన్యాసాలు షెడ్యూల్‌ ప్రకారమే ప్రారంభమయ్యాయి. అయితే ట్రంప్‌ ఆదేశాల నేపథ్యంలో ఏయే శిక్షణ కార్యక్రమాలను తగ్గిస్తారన్నది వెంటనే స్పష్టంకాలేదు. కాగా అమెరికా-ఉత్తర కొరియా మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఉత్తర కొరియా ఆశాభావం వ్యక్తం చేసింది.

కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వం కోసం అవసరమైన దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపింది.దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ ఉత్తర కొరియాతో సంబంధాలను మెరుగుపర్చేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. సరిహద్దుల్లో ఉత్తర కొరియాను ఉద్దేశించి నిర్వహిస్తున్న లౌడ్‌స్పీకర్‌ ప్రసారాలను నిలిపివేశారు.

తాజాగా 1950-53 కొరియా యుద్ధాన్ని అధికారికంగా ముగించే దిశగా చర్చలు జరపాలని లీ ప్రతిపాదించారు. నాటి యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసిందే తప్ప, శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు.

కాగా తమతో సంబంధాలు మెరుగు పరుచుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు చూపిస్తున్న ఆసక్తి విషయంలో ఉత్తర కొరియా వైఖరి ఎలా ఉండబోతో చూడాలి. 2019లో ట్రంప్‌, కిమ్‌ మధ్య శిఖరాగ్ర చర్చలు విఫలమైన తర్వాత ఉత్తర కొరియా అమెరికా, దక్షిణ కొరియాలతో దాదాపుగా చర్చలకు దూరంగా ఉంది.

అదే సమయంలో అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. అణు పదార్థాల ఉత్పత్తిని పెంచడంతో పాటు రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాకు తమ సైనికులకు కూడా పంపంచింది.

చైనాతోనూ సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది. తాజాగా కొరియా ద్వీపకల్పంలో సైనిక ఉద్రిక్తతల వేళ ఉత్తర కొరియా తన ఆయుధ పరీక్షలను ముమ్మరం చేసింది. ఆగస్టు 12న ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News