Burning Topic: మనల్ని ఎవడ్రా ఆపేది.. విజయ్ ప్రమాణ స్వీకరణకు సర్వం సిద్ధం

Burning Topic: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్! కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతుతో మేజిక్ ఫిగర్ సాధించిన టీవీకే.

Update: 2026-05-09 01:46 GMT

Burning Topic: మనల్ని ఎవడ్రా ఆపేది.. విజయ్ ప్రమాణ స్వీకరణకు సర్వం సిద్ధం

Burning Topic: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడనుంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న టీవీకే అధినేత విజయ్‌ చిన్న పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు వామపక్షాలతో పాటు, వీసీకే తమ అంగీకారం తెలిపాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ విజయ్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. లెఫ్ట్‌, కాంగ్రెస్‌, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరనుంది. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లు సాధించింది. అయితే, అందులో విజయ్ రెండు చోట్లా గెలవడంతో సంఖ్యాబలం 107గా మారింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ 5,

వీసీకే-2, సీపీఐ-2, సీపీఎం-2 సీట్లు గెలుచుకున్నాయి. తనకు మద్దతిచ్చిన పార్టీలకు మంత్రిపదవులు ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు రెండు, సీపీఐ, సీపీఎం, వీసీకేకు ఒక్కో మంత్రిపదవి చొప్పున కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

అంతకు ముందు విజయ్​కు సంఖ్యాబలం లేదనే సాకుతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్​ఆర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించారు. దీనితో తమిళనాట రాజకీయ దుమారం చెలరేగింది. మోదీ సర్కార్​ తమిళనాట గవర్నర్ పాలన విధించడానికి తెరవెనుక కుట్రలు చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంకే వీసీకే అధినేత తొల్​ తిరుమావళవన్​తో మాట్లాడారు. ఆ తరువాత సీపీఐ, సీపీఎంలు అత్యంత నాటకీయంగా విజయ్​పార్టీకి మద్దతు ప్రకటించాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుగా ఉన్నప్పటికీ, విజయ్​ ఇతర పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడకుండా తన ప్రతినిధుల ద్వారా మాత్రమే డీల్ చేశారు. దీనిపై వీసీకే నేత చింతనై సెల్వన్​ మండిపడ్డారు. ఎన్నికల అనంతర పరిస్థితులను విజయ్ హ్యాండిల్ చేసిన తీరును ఆయన బహిరంగంగానే విమర్శించారు. విజయ్​ చుట్టూ ఉన్న తీయ శ్రేణి నేతలు రాజకీయ అనిశ్చితికి కారణమవుతున్నారని అన్నారు.

గత మూడు రోజులుగా కొనసాగుతున్న పరిణామాలు టీవీకే మీద తీవ్ర ఒత్తిడి పెంచాయి. ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్‌ వైఖరిని నిరసిస్తూ.. లోక్‌భవన్‌ ముట్టడికి టీవీకే పిలుపునిచ్చింది. దీంతో.. లోక్‌భవన్‌ ఎదుట టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినా గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడం ఎందుకని వారు ప్రశ్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిరసనకారులను చెదరగొట్టారు. వరుసగా మలుపు తిరిగిన పరిణామాలు చివరకు టీవీకేకు అనుకూలంగా మారాయి. నాలుగు రోజుల అనిశ్చితి, గందరగోళం తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమం కావడంతో విజయ్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. చెన్నైలోని విజయ్‌ ఇంటి వద్ద ‘టీవీకే, టీవీకే’ నినాదాలు మార్మోగాయి. విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు సమకూర్చుకున్నారని సమాచారం రావడంతో ఆయన తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంపై ఆనందం వ్యక్తమైంది

కాగా విజయ్ చేసిన చిన్న పొరపాటు కారణంగానే సమస్యలు వచ్చాయిని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మే 6న విజయ్‌ లోక్‌భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకోసం టీవీకేతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలను కూడా సమర్పించారు. రెండోసారి గవర్నర్‌తో సమావేశమైనప్పుడు కూడా తమ సంఖ్యాబలాన్ని ఇలాగే చూపించారు. వాస్తవానికి విజయ్‌ తొలుత తమ టీవీకే పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను మాత్రమే సమర్పించాల్సింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ సమ్మతించేవారు. ఆ తర్వాత శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చేది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలను కూడా సమర్పించడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాననే సంకేతాలిచ్చినట్లయ్యింది. ఈ కారణంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని గవర్నర్‌ ఆయనను తిప్పి పంపి ఉంటారని తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు డీఎంకే ప్రకటించింది. తమకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని విరుచుకుపడింది. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే కూటమి వల్లే కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపీ, అసెంబ్లీ సీట్లు వచ్చాయని గుర్తు చేసింది. మరోవైపు లోక్‌సభలో తాము కూర్చునే సీట్లను మార్చాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డీఎంకే ఎంపీ కనిమొళి కోరారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌‌తో డీఎంకే పార్టీ పొత్తు ముగిసిపోయిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఇకపై కాంగ్రెస్ ఎంపీల పక్కనే కూర్చోవడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. తద్వారా తమ ఎంపీలు లోక్‌సభలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వీలవుతుందని తెలిపారు. తన అభ్యర్థనను స్పీకర్ కార్యాలయం తగిన విధంగా పరిశీలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కనిమొళి లేఖ రాశారు.

మరోవైపు తమిళనాడులో వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిందేనని డీఎంకే సారధి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు అనేది అత్యవసరమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రస్తుత శాసనసభ ఇప్పటికే రద్దు చేశారు. ఇటువంటి పరిస్థితులలో, ఎన్నికైన వారి కోసం ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం కాలపు అవసరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం కూడా అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్‌.. టీవీకేకు మద్దతు అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే వామపక్షాలతో పాటు వీసీకే కూడా టీవీకేకు మద్దతు తెలిపింది.


Full View

Tags:    

Similar News