Off The Record: ప్రభాకర్ చౌదరికి పదవి ఇస్తారా ?

Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ విజయం సాధించినప్పటికీ పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నేతలకు తగిన గుర్తింపు లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Update: 2026-08-22 03:11 GMT

Off The Record: ప్రభాకర్ చౌదరికి పదవి ఇస్తారా ?

Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాకు ముందు నుంచి టీడీపీకి కంచుకోటగా పేరుంది. హిందూపురం నుంచి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రాతినిథ్యం వహించడంతో పాటు జిల్లాలో నెలకొన్న రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇక్కడి జనం తెలుగుదేశంను ఆదరిస్తూ వస్తూన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో కూటమి పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఎన్నికల ముందు వరకు టీడీపీకి అన్నీ తామై వ్యవహరించిన నియోజకవర్గ ఇంచార్జిల్లో పలువురు సైకిల్ నేతలకు..అప్పట్లో టికెట్లు దక్కలేదు.

కూటమి పార్టీల సీట్ల పంపకాల్లో భాగంగా.. పలువురు తమ సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. ఐతే పార్టీ అధికారంలోకి వస్తే.. సరైత గౌరవం దక్కుతుందన్న ఆశతో.. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ రాకపోయినా.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు.

వైసీపీ పాలనలో ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు.. కూటమి పాలనలో రెండేళ్లు గడిచిపోయినా తగిన గుర్తింపు లేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అనంతపురం నియోజకవర్గానికి ఎన్నికల ముందు ప్రభాకర్ చౌదరి పార్టీ బాధ్యుడిగా కొనసాగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో చౌదరి వర్గం ఆందోళనకు దిగినా చివరికి ఎన్నికల్లో రెండు వర్గాలు కలిసి పనిచేశాయి.

పార్టీ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పడంతో పాటు ఇతర ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించింది. భవిష్యత్తులో నామినేటెడ్ పదవి వస్తుందని అప్పట్లో అధిష్టానం హామీ ఇచ్చినట్లు చౌదరి వర్గీయులు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం పాలన పూర్తవుతున్నా... ఆయనకు ఎలాంటి అధికారిక పదవి దక్కకపోవడంపై తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తూన్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో అనంతపురంకు చెందిన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ దక్కడంతో సోషల్ మీడియాలో ప్రభాకర్ చౌదరిపై జరిగిన ప్రచారంపై ఆయన కలత చెందారు.

అధిష్టానం పదవులు ఇస్తే తీసుకుంటా.. లేదంటే పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతానని చెప్పుకొచ్చారు. తనపై లేనిపోని ప్రచారం చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిలోపనిగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అక్రమాలు, అన్యాయాలు చేస్తూన్నారని ఆరోపించారు.

ఆధారాలతో సహా పార్టీ నాయకులకు ఇచ్చానని... అనంతపురంలో జరుగుతున్న దౌర్జన్యాలపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్పందించాలని కోరారు. అనంతపురంలో పార్టీకి పనిచేసిన కార్యకర్తలను కాపాడాలని... పార్టీని బతికించాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మవరం టీడీపీ ఇంచార్జిగా పరిటాల శ్రీరాం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పార్టీ బాధ్యతలు స్వీకరించారు. గత ఎన్నికల్లో టికెట్ శ్రీరాంను వరిస్తుందని ఆయన అనుచరులు, పార్టీ నేతలు భావించారు.

చివరి నిమిషంలో కూటమి పొత్తులో భాగంగా ధర్మవరంను బీజేపీకి కేటాయించడంతో అక్కడి నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తూన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక నామినేటెడ్ పదవి వస్తూందని ఆశించిన పరిటాల అభిమానులకు ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మారిందట.

ధర్మవరం టీడీపీ నియజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న శ్రీరాంను ఎప్పుడు నామినేటేడ్ పదవి వరిస్తూందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తూన్నారు. ఇక గుంతకల్లు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గుమ్మనూరు జయరాంకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది.

ముందు నుంచి టీడీపీ నియోజకవర్గ నాయకుడిగా ఉన్న జితేంద్రగౌడ్ ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా.. సౌమ్యుడిగా పేరు ఉన్న జితేంద్ర గౌడ్‌కు..నేటికీ ఎలాంటి పదవి దక్కకపోవడంపై ఆయన వర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ముందు నుంచి గౌడ కుటుంబం సైకిల్ పార్టీకి నమ్మకంగా ఉంటూ వచ్చిందని... ప్రభుత్వం వచ్చిన అనంతరం ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు.

అలాగే మడకశిర నియోజకవర్గంలో ముందు నుంచి పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన గుండుమల తిప్పేస్వామి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం నామినేటెడ్ పదవిని ఆశించారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోకవర్గమైన మడకశిరలో పార్టీకి కష్టకాలంగా అండగా ఉన్నారు.

ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పాటును అందింస్తూన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఏదో ఒక గౌరవప్రదమైన పదవి కచ్ఛితంగా దక్కుతుందని ఆయన భావించారట. ఇప్పటికీ ఎలాంటి పదవి దక్కకపోవడంపై ఆయన వర్గంలోనూ ఆవేదన వ్యక్తం అవుతోంది.

శింగనమల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఆలం నరసానాయుడు కూడా.. ఎమ్మె్ల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవులపై నమ్మకంగా ఉన్నారట. కానీ రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇప్పటికీ ఎదురుచూపు తప్పడం లేదు.

నియోజకవర్గంలో, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూన్నా.. పదవి రాకపోవడంపై నరసానాయుడు వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇలా ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండాలని భావించిన సీనియర్ నేతలకు ఇప్పటికీ.. పదవుల విషయంలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంపై అనంత తమ్ముళ‌్లలో ఆందోళన పెరుగుతోందట.

పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచి పనిచేసిన నేతలు, కార్యకర్తలకు చాలా చోట్ల గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. చూడాలి మరి మున్ముందు పార్టీలో.. ప్రభుత్వంలో వారికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందో... ఏ మేరకు పదవులు దక్కుతాయో...?

Full View

 

Tags:    

Similar News