Burning Topic: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు

Burning Topic: సామాన్యుడిపై ఇంధన భారం మరోసారి పడింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 10 రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలను పెంచాయి.

Update: 2026-05-24 01:59 GMT

Burning Topic: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు

Burning Topic: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు భగ్గుమన్నాయి. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు ప్రకటించాయి. మరోవైపు కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంచారు. దీంతో ఈ నెలలోనే ఇంధన ధరలు మూడుసార్లు పెరిగాయి. 10 రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలను పెంచడం ఇది మూడోసారి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ప్రపంచ ముడి చమురు ధరలతో ప్రభుత్వ చమురు సంస్థలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మే 15న దేశీయ చమురు సంస్ధలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 మేర పెంచాయి. ఈషాక్ నుంచి తేరుకోకముందే మే 19న మరోసారి పెట్రోల్, డీజిల్‎పై సుమారు 90 పైసల మేర పెంచారు. తాజాగా మూడోసారి కూడా దేశంలో ఇంధన ధరలు పెరగడంతోఇప్పటికే పెరిగిపోయిన నిత్యవసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్య జనంపై మరింత భారం పెరిగింది.

తాజా పెరుగుదల తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.112.23, డీజిల్‌ రూ.100.44

విజయవాడ: పెట్రోల్‌ రూ.115.35, డీజిల్‌ రూ.103.08

విశాఖపట్నం: పెట్రోల్‌ రూ.113.83, డీజిల్‌ రూ.101.23

ఢిల్లీ: పెట్రోల్‌ రూ.99.50, డీజిల్‌ రూ.92.41

ముంబై: పెట్రోల్‌ రూ.108.27, డీజిల్‌ రూ.94.77

కోల్‌కతా: పెట్రోల్‌ రూ.110.18, డీజిల్‌ రూ.96.76

చెన్నై: పెట్రోల్‌ రూ.105.53, డీజిల్‌ రూ.97.13

బెంగళూరు: పెట్రోల్‌ రూ.107.69, డీజిల్‌ రూ.95.73

పశ్చిమాసియా యుద్ధం కారణంగా అధిక ధరలకు క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నామని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు ఇంధన ధరలు పెంచలేదు. అలాగే ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. చమురు రేట్లు మరింతగా దూసుకుపోతున్న తరుణంలో నష్టాల భారం పెరగడంతో ఇప్పుడు పెంపు తప్పడం లేదని ఆయిల్‌ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఇప్పటికీ చేసిన పెంపు సరిపోదని అంటున్నారు. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు రూ.13 నుంచి రూ.17 వరకు పెంచాల్సి ఉంటుందని సూచిస్తున్నారు

మరోవైపు వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కూరగాయలు, సరుకులు, ప్రయాణ ఛార్జీలపై కూడా ప్రభావం పడే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా ఇంధన ధరలు పెంచడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇంధన ధరలు పెరగడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోంది.. ఇంధన ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజలపై పడుతున్న భారంకన్నా చమురు కంపెనీల లాభాల గురించే మోదీ ప్రభుత్వం ఎక్కువగా ఆందోళన చెందుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తమ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుండగా, మోదీ ప్రభుత్వం తన సొంత పౌరులను దోచుకోవడంలో నిమగ్నమై ఉంది. కనీసం ఒక్కసారైనా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి, ఇంకెంతకాలం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తారు?" అంటూ ప్రశ్నించింది.

మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇంధన ఎగుమతులను పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. భారత్ తమకు గొప్ప మిత్రపక్షం, గొప్ప భాగస్వామి అని వ్యాఖ్యానించారాయన. హర్మూజ్ మూసివేతతో ఏర్పడిన చమురు సప్లై ఒత్తిళ్లను భారత్ సమర్ధంగా నిర్వహిస్తోందని కితాబిచ్చారు. భారత్ ఎంత కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందో అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం అమెరికా చమురు ఉత్పత్తి, ఎగుమతులు చారిత్రాత్మక స్థాయులలో ఉన్నాయని రూబియో తెలిపారు. భారత్‌తో ఇంధన సహకారాన్ని విస్తరించడంపై చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయని, వెనెజువెలా చమురును భారత్‌కు సప్లై చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రూబియో భారత్ పర్యటనలో ఉన్నారు.

మరోవైపు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్​పీజీ ఎలాంటి కొరత లేదని చమురు మార్కెటింగ్‌ సంస్థలు స్పష్టం చేశాయి. రష్యా నుంచి వస్తున్న ముడి చమురు సరఫరాలో ఎటువంటి తగ్గుదల లేదని తెలిపాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని చెబుతున్నాయి. అవసరాలకు మించిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపాయి. భారత్‌ ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో నికర ఎగుమతిదారుగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం పంటల కోతల సీజన్‌ కొనసాగుతుండటంతో డీజిల్‌కు డిమాండ్‌ పెరిగిందని తెలిపాయి. వ్యవసాయ కార్యకలాపాలు అధికమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్‌ వినియోగం ఎక్కువైందని పేర్కొన్నాయి. అదేవిధంగా ప్రైవేట్‌ చమురు కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థల బంకుల్లో ధరలు తక్కువగా ఉండటంతో వినియోగదారులు ఈ బంకులకే వస్తున్నారు.


Full View

Tags:    

Similar News