Off The Record: ఇక బీజేపీని ఎవ్వడు ఆపలేడు?

Off The Record: రాజ్యసభలో పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.

Update: 2026-05-24 01:33 GMT

Off The Record: ఇక బీజేపీని ఎవ్వడు ఆపలేడు?

Off The Record: తాజాగా ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో అందరి నజర్ బీజేపీ ఎత్తుగడపై పడింది. అవును.. ఇందులో కనీసం 10 సీట్లు కైవసం చేసుకుంటే సొంతంగా మేజిక్ ఫిగర్ 123కి బీజేపీ రీచ్ అవుతుంది. ఆ దిశగా బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 24 రాజ్యసభ సీట్లలో మెజార్టీ స్థానాలు గెలుచుకుని, పెద్దల సభలో పూర్తిస్థాయిలో ఆధిపత్యమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలక సంస్కరణల బిల్లులు, రాజ్యాంగ సవరణలను ఆటంకాలు లేకుండా ఆమోదించుకోవాలంటే ఎగువ సభలో సంఖ్యాబలం కాషాయదళానికి అత్యంత కీలకంగా మారింది. అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందన్న చర్చ రీసౌండ్ చేస్తోంది. ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీకి ఉన్న 113 స్థానాలతో ఎన్డీఏ కూటమి బలం 148గా ఉంది. బీజేపీ మరో 10 సీట్లను సొంతంగా గెలుచుకుంటే సొంతంగానే మెజారిటీ మార్కు 123ను దాటుతుంది. రాజ్యాంగ సవరణల వంటి కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైన 163 సీట్ల మార్కును దాటాలంటే ఎన్డీఏకు మరో 15 సీట్లు కావాలి.

ప్రస్తుతం నోటిఫికేషన్‌ వెలువడిన 24 స్థానాల్లో ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో నాలుగు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో మూడు చొప్పున భర్తీ కానున్నాయి. జార్ఖండ్‌లో రెండు, మహారాష్ట్ర, తమిళనాడు, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌‌‌ప్రదేశ్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ 24 మంది సభ్యుల్లో 12 మంది బీజేపీకి చెందినవారే. వారిలో కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఉన్నారు. మరోవైపు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తమిళనాడులో సీవీ షణ్ముగం తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఈసారి కేవలం సంస్థాగత విధేయతకే కాకుండా ప్రజాదరణ, ఎన్నికల ప్రభావం, సామాజిక సమీకరణాల వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభించే అవకాశముందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్‌ ఎన్నికల దృష్ట్యా కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూకు మళ్లీ రాజస్తాన్‌ నుంచే అవకాశం లభించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ లక్ష్యంగా కొందరు కీలక నాయకులను రాజ్యసభ బరిలో దింపేందుకు బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే కర్ణాటక నుంచి సదానందగౌడను రాజ్యసభకు పంపి ఆయనకు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ బీజేపీ నేతను ఆంధ్రప్రదేశ్‌ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఆలోచన కూడా ఉందట. అంతేకాక.. మాజీ ముఖ్యమంత్రులు, గవర్నర్లుగా ఉన్న సీనియర్‌ నాయకుల పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోందట. మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన ఆయా రాష్ట్రాల యూనిట్లు ఇప్పటికే ఆశావహుల జాబితాలను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నాయట. బీజేపీ, మిత్రపక్ష పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ నుంచి మెజారిటీ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏపీలో గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నాత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు టీడీపీ సభ్యులు సానా సతీష్ బాబు పదవీకాలం ముగియనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో నాలుగు స్థానాలను సునాయసంగా కైవసం చేసుకోనుంది ఎన్డీయే. దీనిపై బీజేపీ అగ్ర నాయకులు నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సైతం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని టాక్.

దిగువ సభలో బలం ఉన్నప్పటికీ ఎగువ సభలో సరిపడా మెజారిటీ లేకపోవడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మెజారిటీ లేకపోవడంతో పలు బిల్లులు వీగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నియోజకవర్గాల పెంపు బిల్లు లోకసభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో వీగిపోయింది. రాజ్యసభలో మేజిక్ ఫిగర్ లేకపోవడంతో పలు బిల్లులు పాస్ కావడం లేదు. అయితే వచ్చే నెలలో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు అదనంగా 20 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో బలం పెరిగడం మూలంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు అడ్డంకులు లేకుండా పోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి ప్రస్తుత బలంతోపాటు రానున్న ఎన్నికల్లో అదనంగా 18 నుంచి 20 సీట్లు పెరగనున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా మేజిక్ ఫిగర్ చేరుకోనుండడంతో లోకసభలో ఆమోదించిన బిల్లులు రాజ్యసభలో పాస్ కావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు.

వక్ఫ్ సవరణ బిల్లు-2025, ఉమ్మడి పౌర స్మృతి, ఉగ్రవాద నిరోధక బిల్లు, బ్యాంకింగ్ సర్వీసు కమిషన్, పంచాయతీ, మున్సిపాలిటీ, వంటి కీలక బిల్లులు ఆటంకాలు లేకుండా ఆమోదం పొందుతాయి. గతంలో ఈ బిల్లులును లోకసభలో ఆమోదించగా, రాజ్యసభలో సరిపడా బలం లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీ భవిష్యత్తులో తీసుకురావొచ్చని భావిస్తున్న కీలక బిల్లుల్లో వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్ అత్యంత కీలకమైనది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటే ఈ బిల్లులన్నీ అవలీలగా గట్టెక్కుతాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ఛాలెంజ్‌గా తీసుకుందని టాక్. కమలదళం వ్యూహరచన ఏమేరకు ఫలిస్తుందో చూడాలి మరి.


Full View

Tags:    

Similar News