Burning Topic: కొత్త నాటకం మొదలుపెట్టిన దీదీ
Burning Topic: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించడం పెద్ద సంచలనంగా మారింది!
Burning Topic: కొత్త నాటకం మొదలుపెట్టిన దీదీ
Burning Topic: ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు సహజం. ఇందు కోసం అప్పటి వరకూ ప్రభుత్వ సారధులుగా ఉన్నవారు రాజీనామా చేయడం సాంప్రదాయం. తాజాగా దేశంలోని ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయా ముఖ్యమంత్రులు గవర్నర్లను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం అలా జరగలేదు. తాజా ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాలు గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్, ఈసారి 80 సీట్లతో వెనుకబడి రెండో స్థానానికి పరిమితమైంది. విజయోత్సవ సంబరాలు చేసుకుంటూనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా ప్రారంభించేశారు కమలనాథులు. ఇంతలో మమతా బెనర్జీ ఎప్పటి లాగే తన నాటకీయతను చాటుకున్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని ఆమె తేల్చి చెప్పారు. లోక్‌భవన్‌కు వెళ్లను. గవర్నర్‌కు రాజీనామా ఇవ్వను అంటూ మొండికేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తాము ప్రజా తీర్పు వల్ల ఓడిపోలేదని, కుట్రతో పరాజయం పాలైనట్లు పేర్కొన్నారు మమతా బెనర్జీ. అందుకే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సుమారు 100 స్థానాలను దొంగిలించిందన్నారు.టీఎంసీ పోటీ బీజేపీకి వ్యతిరేకంగా కాదని, ఆ పార్టీ కోసం పనిచేసిన ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగానేనని ఆరోపించారు. ఇకపై ఈసీపై ఎలా పోరాడాలో పార్టీలో చర్చించి, ముందుకెళ్తామని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఎన్నో అంశాల్లో వేధింపులను సహించానని తెలిపారు ఇప్పుడు స్వేచ్ఛా జీవిని, సామాన్యురాలిని, వీధి పోరాటయోధురాలిని, మళ్లీ వీధుల్లోకి వచ్చి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడతా’’ అని మమత వ్యాఖ్యానించారు. ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసపై క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు 10 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 7వ తేదీతో ముగియనుంది. మే 8వ తేదీ నుంచి పాత అసెంబ్లీ దానంతట అదే రద్దవుతుంది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉండబోతోంది? రాజ్యాంగపరమైన నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే చర్చ మొదలైంది. అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాత మమతా బెనర్జీ సీఎం పదవిలో కొనసాగడం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం.మమతా బెనర్జీ తన పోరాటాన్ని కోర్టుల ద్వారా లేదా ప్రజాక్షేత్రంలో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఆగదు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి ఎలాంటి అవకాశం లేదని అంటున్నారు న్యాయ నిపుణులు. ఓడిపోయిన ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే, గవర్నర్‌కు రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలను కల్పించింది. ఆర్టికల్ 164 ప్రకారం రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిని నియమించి, ప్రమాణ స్వీకారం చేయించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. రాజీనామా చేయకపోయినా ఫర్వాలేదు. తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు కొనసాగాలని గవర్నర్ ఆమెను కోరవచ్చు. కానీ ఐదేళ్ల పదవీ కాలం తర్వాత ప్రభుత్వం కొనసాగలేదని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి. మమత ఎన్నికలను సవాలు చేసినప్పటికీ, అది పోల్ పిటిషన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయానికి వస్తే, "ఆమె ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగించడాన్ని చూపిస్తూ, ఎన్నికలను సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు. కానీ అది ప్రత్యేక పిటిషన్ అవుతుంది. కనుక ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగడం సాధ్యం కాదు
మరోవైపు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే డిస్మిస్ చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. బెంగాల్ ప్రజలు ఆమె తప్పిదాలు, చర్యలను చాలా కాలంపాటు సహించారని చెప్పారు. దేశం ఆమె ఇష్ట ప్రకారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి ఉంటారు. ఆ తర్వాత ఆమెను తొలగిస్తారు.. అని వ్యాఖ్యానించారు. మమత 100 సీట్లు మీ నుంచి దోచుకున్నారని అంటున్నారు? అయితే, నేను కూడా అస్సాంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లను నా నుంచి దోచుకున్నారని అనొచ్చు. నాకు 126 రావాలి అనొచ్చు. దేశం అలా పనిచేయదు" అని అన్నారు."మీరు సరిహద్దులో కంచె ఏర్పాటుకు అనుమతించరు. ఇప్పుడేమో సీట్లు దోచుకున్నారని అంటారు. బెంగాల్ ప్రజలు మీకు చాలా ఇచ్చారు. ఇప్పుడు వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. సమాజం మీ నిర్ణయంతోనే నడుస్తుందా? ఎస్‌ఐఆర్‌ను ఉపయోగించి ఓటు దోపిడీ జరిగిందని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి పనిచేశాయని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యం ఎక్కడ?" అని ప్రశ్నించారు.
ఇక బెంగాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు మొదలు పెట్టింది. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి గవర్నర్‌కు పంపింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9, 2026న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో కొత్త సీఎం ఎంపిక, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎంపిక, కేబినెట్ కూర్పు అంశాలపై చర్చించడానికి బెంగాల్ బీజేపీ నేతలు ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సమావేశం అవుతున్నారు. ముఖ్యమంత్రి పదవి రేసుల
ముఖ్యమంత్రి పదవి రేసులో భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సువేందు గత ఎన్నికల్లో కూడా మమతను నందిగ్రామ్‌లో ఓడించడం గమనార్హం. కాగా సీఎం పదవి కోసం సీనియర్ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, సమిక్ భట్టాచార్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
మరోవైపు ఎన్నికల ఫలితాలు రావడంతోనే పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కోల్‌కతాలోని హాగ్ మార్కెట్‌లో ఉన్న తృణముల్ కాంగ్రెస్ యూనియన్ ఆఫీసును బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. అత్యంత రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రంలో బుల్డోజర్లతో వచ్చిన ఓ గుంపు టీఎంసీ యూనియన్ కార్యాలయాన్ని నేలమట్టం చేసింది.భయాందోళనకు గురైన వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు. కూల్చివేతల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై టీఎంసీ నాయకులు స్పందిస్తూ బీజేపీ ఎన్నికల నినాదమైన ‘పరివర్తన్’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ మద్దతుదారులు గూండాయిజం, వ్యాపార సంస్థలను టార్గెట్ చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు తోసిపుచ్చారు. కూల్చివేసిన నిర్మాణం అక్రమంగా నిర్మించినట్టు చెబుతున్నారు.