Burning Topic: భారత్ చుట్టూ పాక్ పన్నాగం. మక్కా కూటమిలోకి బంగ్లాదేశ్!
Burning Topic: సౌదీ, పాక్, టర్కీల మక్కా రక్షణ ఒప్పందంలో చేరేందుకు బంగ్లాదేశ్ ఆసక్తి. దక్షిణాసియాలో మారుతున్న సమీకరణాలు, భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్లేషణ.
Burning Topic: భారత్ చుట్టూ పాక్ పన్నాగం. మక్కా కూటమిలోకి బంగ్లాదేశ్!
Burning Topic: దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మన దేశంతో అంటీ అంటనట్లు సంబంధాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్ వేస్తున్న కొత్త అడుగులు చర్చనీయాంశంగా మారాయి.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రహమాన్ త్వరలో రియాద్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తావిచ్చాయి.
ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీతో ఏర్పడిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో చేరేందుకు తమ దేశం ఆసక్తి చూపిస్తోందని తెలిపారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా.. అది తమ దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని అన్నారు. చేశారు. జాతీయ ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని మరో మంత్రి షమా ఒబైద్ కూడా చెప్పారు.
మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఇప్పటికే మన దేశం ముందు అనేక సవాళ్లను నిలిపింది. ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఈ కీలక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం ప్రకారం సంతకం చేసిన ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది మూడు దేశాలపైనా జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా తిప్పికొడతాయి.
రక్షణ రంగంలో ఉమ్మడి ఉత్పత్తి, టెక్నాలజీ బదిలీ, సంయుక్త సైనిక విన్యాసాలు కూడా ఒప్పందంలో భాగం. మక్కా సంయుక్త రక్షణ ఒప్పందాన్ని ఇస్లామిక్ నాటో అని కూడా పిలుస్తున్నారు. ఈ కూటమిలో త్వరలో ఈజిప్ట్ కూడా చేరనుందని టర్కీ విదేశాంగ మంత్రి అధికారికంగా వెల్లడించారు.
ఇరాన్‌కు ఆహ్వానం అందగా ప్రస్తుతం ఈ ప్రతిపాదన వారి పరిశీలనలో ఉంది. సిరియా కూడా మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో చేరే ఆసక్తి చూపించినా, తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు కాగా ఇప్పుడు మక్కా రక్షణ కూటమిలో చేరే అంశాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ తీవ్రంగా పరిశీలిస్తోంది.
దక్షిణాసియా ప్రాంతీయ అనిశ్చితి, దేశీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఫస్ట్ విధానంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలతో ఆర్థిక, రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఆసక్తితో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.
ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ పోర్టులు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగంలో సౌదీ భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్, టర్కీలతో తన సంబంధాలను మెరుగు పరుచుకుంది బంగ్లాదేశ్. ఆ దేశానికి టర్కీ నుంచి అధునాతన డ్రోన్లు, పాకిస్థాన్ నుంచి జేఎఫ్-17 వంటి యుద్ధవిమానాలు, యుద్ధనౌకల సరఫరా ఒప్పందాలు కుదిరాయి.
బంగ్లాదేశ్ మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం పరిధిలోకి వస్తే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇది భారత్ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలకు సంకేతమా? అనే చర్చ జరుగుతోంది.
ఎందుకంటే భారత్‌కు బంగ్లాదేశ్ పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది ఈశాన్య రాష్ట్రాలకు భౌగోళికంగా అత్యంత కీలకమైన దేశం. బంగ్లాదేశ్ తన సరిహద్దు భద్రత, వాణిజ్యం, సముద్ర మార్గాల కనెక్టివిటీ కోసం భారత్ మీద ఎక్కువగా ఆధార పడుతోంది.
బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ద శత్రువులుగా ఉన్న పాకిస్థాన్, టర్కీలు ఉన్న మక్కా రక్షణ ఒప్పందంలోకి చేరితే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. పాకిస్థాన్, టర్కీలు మన దేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుకోవడాన్ని దౌత్య పరంగా విజయంగా భావిస్తున్నాయని చెబుతున్నారు. ఇది భారత్ ప్రయోజనాలకు ముప్పుగానే చెబుత్నారు
భారత్, సౌదీ అరేబియాల మధ్య దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు అత్యంత బలంగా, స్నేహపూర్వకంగా కొనసాగుతున్నాయి. ఇంధన భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద వ్యతిరేక సహకారం, రక్షణ రంగాల్లో రెండు దేశాలు పరస్పరం కలిసి పనిచేస్తున్నాయి.
2019లో ఏర్పాటు చేసిన 'వ్యూహాత్మక భాగస్వామ్య మండలి' ద్వారా భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా మన దేశానికి కీలకమైన అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 42 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
మన దేశానికి అవసరమైన ముడి చమురు దిగుమతుల్లో సౌదీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ కారణంగా ఇప్పటికే పాకిస్థాన్, అర్టకీలతో మక్కా ఒప్పందం ద్వారా భారత్‌కు రక్షణ పరంగా పెద్దగా ముప్పేమీ లేదని చెబుతున్నారు. ఇప్పుడు బంగ్లా కొత్తగా చేరినా తక్షణ ప్రమాదమేం లేదంటున్నారు.
మక్కా కూటమిలో బంగ్లాదేశ్ చేరితే భారత్‌కు తక్షణ ముప్పేమీ లేదని ప్రాథమిక అంచనా. ఈ రక్షణ ఒప్పందం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏర్పడినదని బంగ్లాదేశ్ ప్రకటించలేదు. కాబట్టి భారత్ మీద యుద్ధ ముప్పు అని చెప్పడం తొందరపాటు అవుతుందంటున్నారు.
బంగ్లాదేశ్ వెంటనే ఆ కూటమిలో చేరబోతోందని ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఆసక్తి మాత్రమే వ్యక్తం చేసింది. ఒకవేళ చేరినా ఈ ఒప్పందం బంగ్లాదేశ్‌కన్నా పాకిస్థాన్, టర్కీలకే ఉపయోగకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ తమ ఇంధనం కోసం ఎక్కువగా ఎర్రసముద్ర మార్గాలపైనే ఆధారపడుతోంది.
ఈ ఒప్పందం వల్ల తమ నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తాయని భావిస్తోంది.అయితే ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు దెబ్బతినడం ఆందోళన కలిగించే అంశం. ఈ కారణంగా ఇస్లామిక్ నాటోలో బంగ్లాదేశ్ ఆసక్తిపై నిషితంగా పరిశీస్తున్నట్లు భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
మరోవైపు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ భారత పర్యటనపై అనిశ్చితి కొనసాగుతోంది. సెప్టెంబర్ 12-13 ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొన్నాల్సి ఉంది. అయితే అంతకు ముందే తారిక్ భారత్ పర్యటనకు వస్తారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బంగ్లా ప్రధాని కార్యాలయం చెబుతోంది.
మాజీ ప్రధాని షేక్ హసీనాతోపాటు ఇతర నేరస్థులను అప్పగించే విషయంలో భారత్ స్పందన కోసం ఆ దేశం వేచి చూస్తున్నట్లు సమాచారం. కాగా తమ ప్రధాని తారిక్ భారత పర్యటన విషయంలో తొందరేమీ లేదని బంగ్లా విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
భారత్‌లో సత్సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ, తమ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఆయన అంటున్నారు. తారిక్ పర్యటనకు ఇరుపక్షాల మధ్య తగిన సన్నాహాలు, ప్రాథమిక ఏర్పాట్లు అవసరమని అన్నారు.