Off The Record: కాంగ్రెస్‌లో నేతలు గీత దాటేస్తున్నారా ?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, కొండా సురేఖ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతల ధిక్కార స్వరంపై క్రమశిక్షణ
Off The Record: కాంగ్రెస్‌లో నేతలు గీత దాటేస్తున్నారా ?
Off The Record: ఏ పార్టీలో ఐనా అసంతృప్తులు, అసమ్మతులు కామన్. కానీ వాటిని అంతర్గత వేదికలపై ఎలా పరిష్కరించుకున్నారు అనేదే ఇంపార్టెంట్. కానీ, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం నేతల రూటే సపరేటు.
ఇక్కడి నేతలకు హద్దులుండవ్. క్రమశిక్షణ నిబంధనలు అసలే వర్తించవు. ఏం అనుకుంటే అది స్వేఛ్చగా మాట్లాడేస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా.. పార్టీలో ఆధిపత్య పోరులు, గ్రూప్‌ల వార్‌లు రాజ్యం ఏలుతున్నాయి.
ఐతే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. ఇటీవల పార్టీలోని కొందరి నేతల తీరు పార్టీకి తలనొప్పిగా మారింది. సొంత పార్టీ, ప్రభుత్వంపైనే కాదు.. ఏకంగా సీఎంపైనే నోరు పారేసుకుని పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.
ఇప్పుడిది పార్టీకి, క్రమశిక్షణ కమిటీకి పెద్ద సవాల్‌గా మారిందట. పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలా లేక అలానే వదిలేస్తే ఇవాళ వీళ్లు..రేపు ఇంకొకరు. దీనికి పుల్‌స్టాప్ పెట్టేది ఎలా అన్నది పార్టీకి పెద్ద సమస్యగా మారింది.
సీఎం రేవంత్‌పై.. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన కామెంట్స్ పార్టీలో భూకంపం పుట్టించినంత పనైంది. ఇది ఒకలాంటి ధిక్కార స్వరమే. పార్టీ నిర్ణయాలను, సీఎం రేవంత్‌ను, మరికొందరు ముఖ్యనేతలను ఘాటుగా విమర్శించారు.
పైగా వచ్చే ఎన్నికల్లో తానే నిలబడతాను అంటూ సవాల్ చేసేలా మాట్లాడం కాంగ్రెస్‌లో కాకరేపింది. ఉమ్మడి వరంగల్‌లో కొండా ఫ్యామిలీకి.. మిగతా హస్తం లీడర్లు, ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ చాలా రోజుల నుంచే జరుగుతోంది.
ముఖ్యంగా పరకాలలో పెత్తనం విషయంలో తగ్గేదే లే అంటోంది సురేఖ. దీనికి తోడు.. దేవాదాయ శాఖలో జోక్యం పెరిగిందని,, మరో కేబినెట్ లీడర్ పొంగులేటి, కడియంపై గతంలో ఫైర్ అయ్యారు సురేఖ.
ఇప్పుడు బిడ్డా మాట్లాడిన మాటలతో.. ఏకంగా మంత్రి పదవిపైనే బర్తరఫ్ కత్తి వేలాడుతోంది. నోటీస్‌లకు సురేఖ ఇచ్చిన వివరణతో.. పార్టీ ఇంకాస్త గరమైంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే అంటూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. పార్టీని డిమాండ్ చేశారు. దీంతో.. కొండా సురేఖపై వేటు తప్పదా అన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
ఆమెను పార్టీ సస్పెండ్ చేస్తుందని కొందరు, లేదు ఆమెనే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏమి జరుగుతుందో అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
అయితే ఇప్పుడు కొండా సురేఖ ముందు రెండు ఆప్షన్ లు ఉన్నాయి. ఒకటి ఆమెను పార్టీ సస్పెండ్ చేయడం.. లేకపోతే ఆమెనే పార్టీకి, మంత్రి పదవి రాజీనామా చేయడం. అయితే ఇప్పుడు పార్టీ ఆమెను సస్పెండ్ చేయాలంటే ఏ లైన్ లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ ఆలోచన చేస్తుంది.
అయితే కొండాపై చర్యలు తీసుకుంటే గతంలో పార్టీపై, మంత్రులపై ఇలా చాలా మంది సొంత పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.. అందులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.
రీసెంట్ గా చిన్నా రెడ్డి మాట్లాడుతూ నాకు టికెట్ రాకపోవడానికి కారణం డబ్బుల సంచులే అంటూ కామెంట్స్ చేశారు..ఆ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, క్రమశిక్షణ కమిటితో పాటు ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పిర్యాదు చేశారు..
అయితే ఇప్పుడు మంత్రి కొండాపై చర్యలు తీసుకోవాలంటే ముందు రాజాగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి అలాగే మందుల సామేల్, అనిరుద్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డితో పాటు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడం సాధ్యమేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.
కొండా సురేఖ ను సస్పెండ్ చేసి రాజాగోపాల్ రెడ్డిని, చిన్నారెడ్డిని సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున బిసి సంఘాల నుండి వ్యతిరేకత వస్తుందనీ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఎస్సీ ఎస్టీ బిసి లకు అండగా కులగణన, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అంటూ ఇలా అణగారిన వర్గాల వైపు రాహుల్ గాంధీ నిలబడుతున్నారు..దానితో ఇప్పుడు ఈ అంశం పార్టీకి పెద్ద మైనస్‌గా మారే ఛాన్స్ ఉంది.
ఐతే స్వపక్షంలో విపక్షంలా మారిన నేతల తీరుపై..పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అసలు వాళ్లు మన పార్టీలో ఉన్నారా లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారా. మన వాళ్ళు మనల్ని అనడం ఏంటి..అది నాలుగు గోడల మధ్య కాకుండా అందరిలో అనడం ఏంటి అని, వారి నోరు కంట్రోల్ చేయండి అంటూ పార్టీ పెద్దల దగ్గర వాపోతున్నారట నేతలు..
అనిరుద్ రెడ్డి, మందుల సామెల్, చిన్నారెడ్డి ,రాజగోపాల్ రెడ్డి, కొండా ఫ్యామిలీ.. పార్టీని, ప్రభుత్వం ని ఉద్దేశించి మాట్లాడిన తీరు పార్టీకి డ్యామేజ్ చేసేలా ఉందనీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాల ఆరోపణలన..కంట్రోల్ చేయాల్సింది పోయి సొంత పార్టీపై సొంత పార్టీ నేతల పై కామెంట్స్ చేయడం ఏంటని అంటున్నారు.
ఇంచార్జి మీనాక్షి నటరాజన్, tpcc చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతలు సందర్భం వచ్చిన ప్రతిసారి పార్టీకి నష్టం అయ్యే విధంగా మాట్లాడకూడదని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇంచార్జిలకు, పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. కానీ పెద్దల మాటలను పెడచెవిన పెట్టి రోజుకో నాయకుడు పార్టీ పై పార్టీ పెద్దల పై నోరు జారుతూనే ఉన్నారు..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ పలు మార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ గా చిన్నారెడ్డి సైతం కోట్లు కోట్లు పెట్టీ నాకు రావాల్సిన టికెట్ కొనుకున్నావని స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణ చేశారు.
దానితో పైసలు ఎవరు ఎవరికి ఇచ్చారు అంటూ స్థానిక నేతలు చిన్నారెడ్డి పై ఫైర్ అవుతున్నారు. చిన్నారెడ్డి నేతలు సస్పెండ్ చేయాలని కోరుతున్నారు..అనిరుధ్ రెడ్డి గతంలో మీడియా మిత్రులతో చిట్ చాట్ చేస్తూ కమిషన్ లు తీసుకుని బిల్లులు క్లియర్ చేస్తున్నారని అన్నారు..రీసెంట్ గా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు.
మొన్నటికి మొన్న మందుల సామెల్ నియోజక వర్గ పరిధిలో మండల అధ్యక్షుల నియామక ప్రక్రియలో ఇతరుల జోక్యం ఏంటని ప్రశ్నిస్తునే ఒక సామాజిక వర్గంపై ఘాటు విమర్శలు చేశారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి సైతం రెండు సామాజిక వర్గాలను కించపరిచారని పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.
ఇలా ఎవరికి వారు పార్టీ పై, పార్టీ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం అవుతుందని సొంత పార్టీ నేతలు పార్టీ పెద్దల దగ్గర వాపోయారట.