Sullurpeta: ప్రశాంత పోలింగ్‌కు సూళ్ళూరుపేట, తడ మండలాల్లో కట్టుదిట్టమైన భద్రత!

సూళ్ళూరుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29న (ఆదివారం) జరగనున్న నేపథ్యంలో సూళ్ళూరుపేట, తడ మండలాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సర్వం సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు ఆధ్వర్యంలో ఎన్నికల నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నట్లు సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ శనివారం విలేకరులకు తెలిపారు.

రెండు మండలాల పరిధిలోని 31 గ్రామ పంచాయతీల్లో ఉన్న 88 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్సైలతో పాటు మొత్తం 250 మంది పోలీసు సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి 13 రూట్లలో నిరంతర మొబైల్ గస్తీని ముమ్మరం చేశామని సీఐ వివరించారు.

​ముఖ్యంగా రెండు మండలాల్లోని రౌడీషీటర్లు, గంజాయి విక్రేతలు, అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అక్కడ ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, పార్టీ జెండాలు, కండువాలు, ప్రచార సామగ్రి ప్రదర్శించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లు బూత్ లోపలికి సెల్‌ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడానికి వీల్లేదన్నారు. స్థానికేతరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు పోలింగ్ ముగిసే వరకు మండలాల పరిధి విడిచి వెళ్లాలని ఆదేశించారు.

​ఎన్నికల వేళ మద్యం విక్రయాలపై పూర్తి నిషేధం (డ్రై డే) అమలులో ఉందని, అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా, పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర గుర్తింపు పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, ఓటర్లను ప్రభావితం చేసినా లేదా అల్లర్లకు పాల్పడినా ఏపీ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 214తో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఓటర్లందరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ ఎం. మురళీకృష్ణ పిలుపునిచ్చారు.

Tags: