Srikalahasti: శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి పాండురంగయ్యకు తీవ్ర గాయాలు!

శ్రీకాళహస్తి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండురంగయ్య రాజీవ్ నగర్ సమీపంలోని దేవుని బాట వద్ద ఆయన ఉండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాండురంగయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా, మున్సిపల్ చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పాండురంగయ్యను పోటీ నుంచి తప్పుకోవాలని కూటమికి చెందిన కొందరు వ్యక్తులు తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags: